'జ్యోతి లక్ష్మి' రివ్యూ



-సూర్య ప్రకాష్ జోశ్యుల హీరోయిన్స్ వేశ్య పాత్రలలో తెరపై కనపడటం కొత్తేమీ కాదు కానీ ...పూరి జగన్నాథ్ వంటి స్టార్ డైరక్టర్ చిన్న బడ్జెట్ లో... అదీ హీరోయిన్ ఓరియెంటెడ్ గా, అందులోనూ నవలా ఆధారం గా సినిమా చేయటం అనేది ఈ రోజుల్లో చెప్పుకోదగ్గ విశేషమే...అభినందించాల్సిన సంగతే. అయితే పూరి మేకింగ్ లోనూ, డైలాగులలోనూ చూపిన శ్రద్దను కథ, కథనం, ట్రీట్ మెంట్ లో చూపలేకపోయారు. సినిమాలో ఎత్తుకున్న విషయం పై చర్చ కన్నా సందేశం ఎక్కువైంది. పోనీ ఆ మెసేజ్ అయినా సరిగ్గా అందించారా అంటే పూర్తిగా సినిమాటెక్ లిబర్టీస్ తో నడుస్తూంటుంది. సెకండాఫ్ లో సందేశాలతో కూడిన ఉపన్యాసాలతో విసుగెత్తించారు. ముఖ్యంగా ఛార్మిని హీరో గా మలచాలన్న తాపత్రయంతో ఎత్తుకున్న పాయింట్ ని వదిలి కథని దారి తప్పించారు. శ్వేతాబసు ఉదంతంలో చెలరేగిన కాంట్రావర్శి అయిన... ఆ పారిశ్రామిక వేత్త ఎవరు అనే ఎలిమెంట్ తో సెకండాఫ్ నడిపేద్దామని చూసారు. ముఖ్యంగా మల్లాది వెంకట కృష్ణమూర్తి... 'మిసెస్‌ పరాంకుశం' నవల ని అప్ డేట్ చేసి అందించే ప్రక్రియలో నవలలో చర్చించిన మెయిన్ ఎలిమెంట్ ని వదిలేసి, విలన్ సంహారం, వేశ్యా సంస్కరణ వంటివి హెలెట్ చేసారు. ప్రోమోలు,పోస్టర్స్ చూసి థియోటర్ కు వెళ్లిన వారికి నిరాశనే కలిగించినట్లైంది. ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు జ్యోతిలక్ష్మి (ఛార్మి) ఓ సెక్స్‌వర్కర్‌. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సత్య(సత్యదేవ్) ఆమెను చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఉండే చోటకి రోజూ వెళ్తూ...ఓ రోజు ..ఆమె వద్ద పెళ్లి ప్రపోజల్ పెట్టి...ఒప్పించి బయిటకు తీసుకువచ్చి పెళ్లి చేసుకుంటాడు. మొదట్లో తిక్కగా బిహేవ్ చేసినా తర్వాత సత్య ..నిజమైన ప్రేమకు ఆమె ..అతనితో నిజాయితీగా జీవితం ప్రారంభిద్దామనుకుంటుంది. కానీ ఆమె గత జీవితం ఆమెను వెంబడిస్తుంది. ఆ వ్యభిచార గృహాల (కంపెనీ) రాకెట్ నడిపే...నారాయణ పట్వారీ (అజయ్ ఘోష్) డబ్బు సంపాదించే ఆమెను వదులుకోదలుచుకోడు. అతను చేతిలో పోలీసులు, డబ్బు, రౌడీలు ఉంటారు. అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. అంత పరర్ ఫుల్ విలన్ ని ఆమె ఎలా ఎదుర్కుని తన జీవితాన్ని ఎలా నిలబెట్టుకుంది...మిగతా వ్యభిచారుల జీవితాలు సైతం ఎలా నిలబెట్టింది అనేది మిగతా కథ. నవలలో... ఓ సెక్స్ వర్కర్ ని పెళ్లి చేసుకున్న వాడు జీవితం ఎలా నడుస్తుంది...అదే సమయంలో సెక్స్ వర్కర్ ..మామూలు గృహిణిగా ఎలా ఎడ్జెస్ట్ అవుతుంది..చుట్టూ ఉన్న సమాజం సెక్స్ వర్కర్ వివాహాన్ని ఎలా స్వీకరిస్తుంది..మార్పు ని అంగీకరించే ప్రాసెస్ లో ఏ విధమైన ఇబ్బందులు ఆ సెక్స్ వర్కర్ కు పెడుతుంది అనే విషయాలు చుట్టూ తిరుగుతుంది. అయితే పూరి నవలను ఎడాప్ట్ చేసే పక్రియలో వాటిని ప్రక్కన పెట్టేసారు. వృభిచార కంపెనీ నడిపే పాత్రకు, హీరోయిన్ కు మధ్య కథను నడిపాడు. సాధ్యమైనంత యాక్షన్ ని చొప్పించే ప్రయత్నం చేసాడు. దాంతో అటు ఇటూ కాకుండా పులిహారలో చికెన్ బిర్యాని కలిపినట్లైంది. ఫైనల్ గా ... ఈ సినిమాలో పూరి సందేశం ఇచ్చినా నమ్ముకున్నది మాత్రం క్రైమ్ అండ్ సెక్స్ అని స్పష్టంగా అర్దమవుతుంది. అయితే వాటిని కూడా సరిగ్గా కథలో బ్లెండ్ చేయకుండా అవి ఎక్కడ హైలెట్ అవుతాయో అనే డౌట్ తో ...వాటిని సందేశంతో కవర్ చేయాలని ప్రయత్నించాడు. ఆ నిజాయితీ లోపమే సినిమాను ప్రక్కదారి పట్టించింది. బ్రహ్మానందం నుంచి కామెడీ....వేశ్య పాత్రలో ఉన్న ఛార్మి నుంచి శృంగార రసం, హీరో పాత్ర నుంచి హీరోయిజం, పూరి నుంచి పోకిరిలాంటి సినిమా ఎక్సపెక్ట్ చేయకపోతే ఈ సినిమా నచ్చుతుంది. ఈ చిత్రంలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది చార్మి నటన. మొదట వేశ్యగా...తర్వాత తనను ఇష్టపడి పెళ్లి చేసుకున్న వ్యక్తి భార్యగా, సమాజంపై తిరగబడే ఆదిపరాశక్తిగా, తన సమస్యను తెలివిగా పరిష్కరించుకునే స్త్రీగా, ఇలా డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో ఒదిగిపోయి నటించింది. అలాగే...సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో పాపులర్ అయిన భధ్రం కూడా బ్రోకర్ పాత్రలో రాణించారు. ఛార్మిని సపోర్ట్ చేసే రౌడీ కొత్తతను బాగా చేసారు. సినిమాలో ఛార్మి పాత్రమైన సానుభూతి ఎక్కడా కలగదు. ఆ విధంగా సీన్స్ రాసుకోలేదు. దాంతో ఆమె తిరగబడుతున్నా ప్రేక్షకులు ఆమెతో సహాయానుభూతి కలగటం కష్టమై పోయింది. సెటప్ లో ఆ సీన్స్ కరెక్టుగా ఉంటే పేఆఫ్ చేసే క్లైమాక్స్ లో అద్బుతం జరిగేది. ఈ సినిమా లో బ్రహ్మానందం పాత్ర సినిమాకు మరో మైనస్ అని చెప్పాలి. కామెడీ మాట దేవుడెరుగు. జుగుప్స కలిగించింది. బ్రహ్మానందం వంటి కమిడియన్ పై మోతాదు మించిన డైలాగులు పెట్టడం, సీన్లు అల్లటం చేసారు. అలాగే కథకు కీలకమైన పాత్రగా చేయాలని చూడటం రసాభాస ను కలిగించింది. సినిమాకు కీలకమైన సెకండాఫ్ లో పూరి కేవలం యాక్షన్, సందేశం ఈ రెండే నమ్ముకున్నారు. అంతేకానీ కథలో ఉన్న బేసిక్ ఎమోషన్స్ ని రిజిస్టర్ కానివ్వలేదు. వాటిపై చర్చ చేయలేదు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమా మారుతున్న మూడ్‌ను సినిమాటోగ్రాఫర్ పీజీ విందా సరిగ్గా క్యారీ చేశారు. ఎడిటింగ్ కూడా పూరి స్టైల్లో స్పీడుగానే నడిచిపోయింది. అసందర్భంగా వచ్చినా.... సునీల్ కశ్యప్ అందించిన సంగీతంలో రెండు పాటలు బాగున్నాయి. ముఖ్యంగా భాస్కరభట్ల రచన టైటిల్ సాంగ్ లో కొత్త పుంతలు తొక్కింది. నేపథ్య సంగీతం ఆకట్టుకునే ఉంది. ధనరాజ్, ఉత్తేజ్, సంపూర్ణేష్ బాబు, నెల్లూరి సప్తగిరి వీళ్లందరినీ క్లైమాక్స్ లో పెట్టారు కానీ రిజిస్టర్ అయ్యేలా కూడా చేయలేకపోయారు. కేవలం ప్రోమోల కోసమే వీరిని తీసుకున్నట్లు అనిపించింది. సినిమాలో ప్రియదర్శిని రామ్...కీలకమైన పోలీస్ పాత్రలో కనిపించారు. చాలా కాలం తర్వాత ఆయన తెరపై మెరిసారు. ఇప్పటికీ ఈ వయస్సులో ఆయన ఫెరఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేయటం విశేషం. పాత్రలో లీనమై చేసి సినిమాకు ప్లస్ అయ్యారు. బ్యానర్: సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌, శ్రీశుభశ్వేత ఫిలింస్‌ నటీనటులు: ఛార్మి కౌర్‌, సత్య, వంశీ, బ్రహ్మానందం, సంపూర్ణేష్ బాబు తదితరులు సినిమాటోగ్రఫీ: పి.జి.వింద, కథ: మల్లాది వెంకట కృష్ణ మూర్తి సంగీతం: సునీల్‌ కశ్యప్‌, నిర్మాతలు శ్వేతలానా, వరుణ్‌, తేజ,సి.వి.రావు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌. సమర్పణ: ఛార్మి కౌర్ విడుదల తేదీ: 12, జూన్ 2015.


మానవ హక్కుల దివిటీ మాగ్నాకార్టా


maanava hakkula diviti maagnaakaarta

గోరంత దీపం కొండంత వెలుగు..ఇది అక్షర సత్యం. మానవ హక్కుల ఉద్యమాల చారిత్రక, మహోన్నత ప్రయాణానికి మార్గనిర్దేశన చేసిన స్వేచ్ఛాయుత సామాజిక నియమావళే మాగ్నాకార్టా. ఎనిమిది శతాబ్దాల క్రితం అప్పటి ఇంగ్లాండ్ రాజు జాన్ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు ఫలితమే ఈ మహోత్కృష్ట నియమావళి. రాజైనా పేదైనా అందరూ చట్టం ముందు సమానమేనని నాటి ఇంగ్లాండ్ ప్రజానీకం నినదించింది. రాజరికం, నిరంకుశత్వం, అరాచక పాలనలపై తిరుగుబాటు చేసి అనంతర కాలంలో యావత్ ప్రపంచం మానవ హక్కులకు పట్టం కట్టడానికి దోహదం చేసింది. మానవ విలువలంటే ఏమిటో తెలియని..నిరంకుశ పాలనలో బతికేస్తూ రాజులకు సాగిలపడటమే దైనందిన జీవితంగా భావించిన రోజుల్లోనే భావి మానవ హక్కుల మహా ప్రయాణానికి ఈ నియమావళి నాందీ ప్రస్తావన చేసింది. ఆ తిరుగుబాటు మొదట్లో కొందరు వ్యక్తులు తమ హక్కుల కోసం చేసిన పోరాటమే అయినా అది అనంతర కాలంలో ఆధునిక ప్రజాస్వామ్య దేశాకు బలమైన విలువల పునాదిగా మారింది. కింగ్‌జాన్ సంతకం చేసిన మాగ్నాకార్టా ఎన్నో మార్పులకు, చేర్పులకు లోనైనా భారత్ సహా వందకు పైగా దేశాలకు విలువల కరపత్రమే అయింది. రెండు వందల కోట్ల మంది ప్రజల జీవితాలను, జీవనాన్నీ ప్రభావితం చేస్తూనే ఉంది. మానవ,ప్రజాస్వామ్య, వ్యక్తిగత స్వేచ్ఛా హక్కుల పరిరక్షణోద్యమాలకు అనునిత్యం వెలుగుదివ్వెగా భాసిల్లుతోంది. మానవ హక్కులను ఎప్పటికప్పుడు శక్తివంతంగా తీర్చిదిద్దడానికి, సరికొత్త విలువలతో ఉన్నత భావనలను పాదుగొల్పడానికి ఇది ఆధునిక సమాజంలోనూ ఎంతగానో దోహదం చేస్తోంది. స్వేచ్ఛాయుత జీవన హక్కులతో ముడివడి ఉన్న మానవీయ కోణాలను విస్తృతం చేస్తోంది. ఈ ఎనిమిది శతాబ్దాల కాలగతిలో ఎన్నో మార్పులు, ఎన్నో పరిణామాలు, ఎన్నో ఉత్కృష్ఠ ఘట్టాలు చోటుచేసుకున్నాయి. వీటిలో ప్రతీది కూడా మనిషి సాధించిన ఆలోచనాత్మక, విజ్ఞానదాయక పరిణతికి తోడ్పడింది. అందుకే..నిన్న మొన్న జరిగిన పరిణామాలనే మర్చిపోతున్న నేపథ్యంలో 1215 జూన్ 15నాటి మాగ్నాకార్టా ఇప్పటికీ నిరుపమానంగా, జాజ్వల్యంగా వెలుగుతోందంటే..ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించే దేశాలకు స్ఫూర్తిదాయక మార్గదర్శకమైందంటే..దీనికి ఉన్న ప్రాధాన్యత ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెలుగు చిన్నదే అయినా శూన్యాన్ని తరిమికొట్టడంలో అజే య శక్తే అవుతుంది. తిరుగులేని ఇంగ్లాండ్ రాజే చట్టానికి లోబడి వ్యవహరించే అనివార్య పరిస్థితిని ఈ చారిత్రక ఒప్పందం కల్పించింది. ఆ పరిణామంతో నియంతృత్వ, తిరుగులేని అధికారాలు క్రమంగా పలుచబడుతూ ప్రస్తుతం ప్రజలే ఎన్నుకునే ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఆవిర్భావానికి దారితీసింది. ఈ ఎనిమిది శతాబ్దాల్లో మాగ్నాకార్టా ఉద్దేశిత సిద్ధాంతాలు, నియమాలూ కాలానుగుణంగా మార్పులు చెందుతూ, హద్దులనూ చెరిపేసుకుని విశ్వ జనీనమైన మానవ హక్కులకు ఊతాన్నిచ్చాయి. న్యాయ, స్వేచ్ఛ, ప్రజాస్వామ్య వ్యవస్థలు, రాజ్యాంగాలూ శక్తివంతం కావడానికి దోహదం చేశాయి. భారత రాజ్యాంగానికి, అందులోని అత్యంత వౌలికమైన ప్రాథమిక హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛ్భావనలకు మాగ్నాకార్టానే స్ఫూర్తిదాయకమని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు. ఒక్క భారత దేశమే కాదు, ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న అమెరికా రాజ్యాంగ రూపకల్పనలోనూ మాగ్నాకార్టా ముద్ర స్పష్టం. మానవ హక్కులు, పౌర హక్కులకు అగ్రరాజ్య రాజ్యాంగం తిరుగులేని పునాదులు వేయగలిగిందంటే..వీటి పరిరక్షణ విషయంలో రాజీలేకుండానే కొనసాగుతోందంటే అందుకు మాగ్నాకార్టా అందించిన స్ఫూర్తే నిదర్శనం. చట్ట పాలన ఎలా ఉండాలో చెప్పడమే కాకుండా, నియంతల అధికారాలకూ ఈ మహా నియమావళి కత్తెర వేసింది. నేడు మనం చెప్పుకుంటున్న మహిళా సమానత్వ హక్కులకూ ఎనిమిది శతాబ్దాల క్రితమే పునాది పడిందన్న నిజం ఈ మహోన్నత హక్కుల పత్రాన్ని విశే్లషిస్తే స్పష్టమవుతుంది. అన్ని విధాలుగా ఎంతో పరిణతి చెందిన ప్రజాస్వామ్య వాతావరణంలో జీవిస్తున్న మానవాళికి హక్కుల పరంగా, అధికారాల పరంగా ఇతరత్రా కూడా వారి స్వేచ్ఛాయుత జీవనానికి గండి కొట్టే అవాంఛనీయ పరిణామాలెన్నో చోటుచేసుకుంటున్నాయి. మహిళలు రక్షణ కోసం, విద్యార్థులు హక్కుల కోసం, కార్మికులు వేతనాల కోసం, నిరుద్యోగులు ఉపాధి కోసం చేస్తున్న చేస్తున్న ఆక్రందనలకు మూలం మాగ్నాకార్టానే. భారత రాజ్యాంగం, పౌర హక్కుల రూపకల్పనలో మాగ్నాకార్టా కనబరిచిన ప్రభావం తిరుగులేనిదే. దేశ ప్రజలకు ప్రాధమిక హక్కులను, స్వేచ్ఛనూ కల్పిస్తున్న రాజ్యాంగ 21వ అధికరణకు మాగ్నాకార్టానే మూలమని ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు స్పష్టం చేసిన విషయాన్ని ఈ నేపథ్యంలో ప్రస్తావించడం ఎంతైనా సముచితం. 'న్యాయపాలనలో జాప్యం జరుగకూడదు.ఎవరికీ అన్యాయం జరుగకూడదు.న్యాయం అమ్ముడు పోకూడదు'అన్న ఉదాత్త భావనలను నాడే ప్రోదిచేసుకున్న మాగ్నాకార్టా ప్రపంచ హక్కుల ఉద్యమాలన్నింటికీ దివిటీగానే పని చేసింది. ప్రజాస్వామ్య ప్రస్థానాలనూ, రాజ్యాంగాల ఆవిర్భావాన్ని, అత్యంత వౌలికమైన మానవీయ భావనలను బలంగా పాదుగొల్పే ప్రయత్నంలో మార్గదర్శనే కాదు, నిర్దేశనా చేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ప్రజల ప్రాథమిక హక్కులకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో, రాజ్యాంగ పరమైన, పాలనాపరమైన విధానాలను మానవీయ కోణంలో రూపొందించుకోవాల్సిన అవసరమూ అంతే ఉంటుంది. భారత దేశ చట్ట, న్యాయ పాలనకు సంబంధించి అనేక కోణాల్లో మాగ్నాకార్టా స్ఫూర్తిదాయకమే అయింది. మిగతా దేశాల మాట ఎలా ఉన్నా మాగ్నాకార్టా భారత స్వాతంత్య్రోద్యమానికి తిరుగులేని శక్తిని అందించింది. ఆంగ్ల పాలకులపై రాజకీయ స్వేచ్ఛ కోసం మహాత్మాగాంధీ సాగించిన పోరాటానికి మాగ్నాకార్టానే మూలం. రాజకీయ హక్కుల సాథన, స్వేచ్ఛ సముపార్జన తమకు ముఖ్యమని చాటిచెప్పిన గాంధీ ఆ దశగానే దేశాన్ని ముందుకు నడిపించారు. ఆ మహోద్యమం ఫలించి భారతావని సర్వసత్తాక గణతంత్య్ర ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవించడానికి మూలం కూడా మాగ్నాకార్టానే. మూడువేల పదాలు, ఎన్నో నిబంధనలతో కూడిన మాగ్నాకార్టా నుంచే భారత రాజ్యాంగం మానవ హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రజాసామ్య విలువల వంటి ఉన్నత భావనలను పుణికి పుచ్చుకోగలిగింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో అమలులో ఉన్న రాజ్యాంగాలను క్రోడీకరించే దేశ రాజ్యాంగాన్ని నిర్మించుకున్నా..ఈ మొత్తం ప్రయత్నం వెనుక మాగ్నాకార్టా ప్రభావం చాలా స్పష్టం. 12శతాబ్ద కాలం నాటి సామాజిక, ఆర్థిక,రాజరిక, నిరంకుశ పరిస్థితుల పరీక్షలు నెగ్గి ఎప్పటికప్పుడు పునీతమవుతున్న మాగ్నాకార్టా తరగని వెలుగు దివ్వె. మానవ జాతి ఉన్నంత వరకూ, ఆక్రమణలు, అణచివేతలు, హక్కుల ఉల్లంఘనలు పేట్రేగుతున్నంత వరకూ ఇది తిరుగులేని స్ఫూర్తి మంత్రమే అవుతుంది. అంతిమంగా మానవ జాతి నాగరికంగా పరిణతి చెందడానికి, మానవీక కోణంలో రాణించడానికీ మాగ్నాకార్టా సాగించిన శతాబ్దాల ప్రయాణం నిరంతరం వెలుగుబాటను పట్టిస్తూనే వచ్చింది. మార్పు గుణాత్మకమైతే అది విలువలను ప్రోది చేస్తుంది. పరివర్తనాయుతమైన జీవన విధానానికి ప్రేరణ అవుతుంది. మాగ్నాకార్టాను ఈ కోణంలోనే పరిగణించాలి. అందులో ప్రవచించిన ప్రతి నిబంధన, ప్రతి డిమాండ్ ఆధునిక నాగరిక ప్రపంచావిష్కరణకు విశేషంగానే దోహదం చేసింది. మానవాళి చరిత్రలో ఎన్నో మధుర ఘట్టాలున్నాయి. ఎన్నో ఉత్కృష్ఠ పరిణామాలూ ఉన్నాయి. వీటిలో కొన్ని మాయని మచ్చలుగా మిగిలిపోతే ఇంకొన్ని సరికొత్త చరిత్రనే సృష్టించాయి. చారిత్రక గమనాన్ని నిర్దేశించడమే కాదు..అసలు ఉన్నతమైన జీవన ప్రమాణం ఏమిటో ప్రబోధించాయి. అదే క్రమంలో విలువలతో కూడిన ఉన్నత భావనలకూ ఉద్దీపనగా నిలిచాయి. ఇలాంటి ఘట్టాలెన్నింటినో తనలో ఇముడ్చుకుంటూ, ఎప్పటికప్పుడు నిగ్గుదేలుతూ సాగిన మానవ హక్కుల మహా ప్రయాణమే మాగ్నాకార్టా. కాలమేదైనా, పాలనా విధానమేదైనా..పాలకుల ధోరణులు ఒక్కటే రీతిలో ఉంటాయి. నాటి నిరంకుశ పాలకుడు కింగ్‌జాన్‌పై జరిగిన తిరుగుబాటుకు హక్కుల సాధనే కార ణం. చట్టాలు అందరికీ సమానమన్నదే మూ లం. నేడూ అలాంటి పరిస్థితులు,సవాళ్లనే మానవాళి ఎదుర్కొంటోంది. దేశమేదైనా హక్కులకు దిక్కులేని పరిస్థితులు నేడూ అన్ని చోట్లా కనిపిస్తున్నాయి. ఎనిమిది శతాబ్దాలను పూర్తి చేసుకుంటున్న మాగ్నాకార్టానే ఇలాంటి హక్కుల ఉద్యమాలకు స్ఫూర్తి. ప్రాథమిక హక్కుల సాధనకు ఎనలేని దీృప్త. చిత్రం... మాగ్నాకార్టాపై సంతకం చేస్తున్న కింగ్ జాన్

జగమంత యోగా.. గిన్నిస్‌లో జాగా


jagamanta  yoga.. ginnislo  jaaga

యోగా.. ప్రపంచమంతా పఠిస్తున్న జపం. 5 వేల ఏండ్లకింద భారత్‌లో ఆవిర్భవించిన ఈ శక్తి.. అంతర్జాయతీయ యోగా దినోత్సవంతో విశ్వమంతా వ్యాపించింది. ఏకంగా 177 దేశాలు యోగా ఔన్నత్యానికి వినమ్రంగా తలవంచాయి. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి నుంచి ఈఫిల్ టవర్ వరకు, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, సియాచిన్ నుంచి దక్షిణ చైనా సముద్రం వరకు యోగా జయకేతనం ఎగురువేసింది. ఆదివారం ఈ చరిత్రాత్మక ఘట్టానికి భారత్ నాయకత్వం వహిస్తూ.. దేశంలో కనీవిని ఎరుగని రీతిలో యోగా కార్యక్రమాలు నిర్వహించింది. ప్రధాని నరేంద్రమోదీ సహా 35వేలమంది ఒకేసారి యోగాభ్యాసం చేయడంతో దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్ యోగాపథ్‌గా మారింది. ఇంత పెద్దఎత్తున ప్రజలు ఒకేసారి యోగా చేయడం, అందులోనూ 84 దేశాలకు చెందిన జాతీయులు పాల్గొనడంతో రెండు గిన్నిస్ రికార్డులు సొంతమయ్యాయి. -రెండు రికార్డులు సొంతం -చరిత్రాత్మక ఘట్టానికి భారత్ నాయకత్వం -ఢిల్లీలో యోగాపథ్‌గా మారిన రాజ్‌పథ్ -దేశవిదేశాల్లో ఉత్సాహంతో యోగాభ్యాసం -ప్రపంచశాంతికి ఇది నాంది: ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్‌లో మైనస్ 4 డిగ్రీల చలిలో కూడా భారత సైనికులు యోగా దినోత్సవాన్ని జరుపుకొన్నారు. యోగా డేను పురస్కరించుకుని ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ ప్రపంచ శాంతి, సమైక్యతను నెలకొల్పడానికి కొత్త శకం ఆరంభమైందన్నారు. ఈ రోజు యోగా దినోత్సవంతో మానవ మేధస్సుకు శిక్షణ అందించే కార్యక్రమానికి నాంది పలికామని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా 200కోట్ల మంది యోగా దినోత్సవాన్ని జరుపుకొనడం గొప్ప విషయమని.. ఇదంతా భారత్ గొప్పతనమేనని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ కొనియాడారు. న్యూఢిల్లీ, జూన్ 21: కుల, మత, వర్ణ, దేశాలు, ప్రాంతీయాల కతీతంగా యోగా ఔత్సాహికులంతా చారిత్రక ఘట్టానికి సాక్ష్యంగా నిలిచారు. అంతర్జాతీయ తొలి యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచమంతా యోగా కేంద్రంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో వర్షాన్ని, వాతావారణ ప్రతికూల పరిస్థితులను, పలు ప్రాంతాల్లో వెల్లువెత్తిన నిరసనల్ని పక్కనబెట్టి ఆదివారం ఉదయమే ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది యోగా ఔత్సాహికులు చాపలు, ఇతర సామాగ్రిని చేతబట్టుకొని ఉత్సాహంతో తమ తమ ప్రాంతాలకు చేరుకున్నారు. పార్కులు, చర్చిలు, నివాసాలు, మిలటరీ స్థావరాలు, గగన తలాలతోపాటు విశ్వవ్యాప్తంగా 44 ఇస్లామిక్ దేశాలతోపాటు 177 దేశాల్లో జరిగిన అంతర్జాతీయ యోగా ఉత్సవాలకు భారత్ నాయకత్వం వహించింది. ప్రాచీన సంప్రదాయ యోగాసనాలు, విన్యాసాలతో ఆకట్టుకున్నారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయం నుంచి ఈఫిల్ టవర్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.., సియాచిన్ నుంచి దక్షిణ చైనా సముద్రం వరకు.. ప్రపంచశాంతిని, సమగ్రత, ఐక్యతను చాటిచెప్పారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు, రాజకీయవేత్తలు, అధికారులు, త్రివిధ దళాలు, రైల్వే, కార్పొరేట్ సంస్థలు, వ్యాపార వర్గాలు మెగా ఈవెంట్‌లో పాలుపంచుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ యోగా డే వేడుకల్ని ప్రారంభించారు. ఆధునిక జీవిన విధానంలో తలెత్తే శారీరక వైకల్యాన్ని అధిగమించే అద్భుతమైన శక్తి యోగాకు ఉందని ప్రణబ్ పేర్కొన్నారు. ఎన్నో శతాబ్దాల నుంచి యోగా సాధనకు భారత్ ప్రధాన కేంద్రమని అన్నారు. దేశరాజధాని ఢిల్లీలో రాజపథ్‌లో 37 వేల మందితో నిర్వహించిన మెగా యోగా ఈవెంట్‌ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన అతిపెద్ద యోగా శిబిరం రెండు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులను సొంతం చేసుకున్నది. భారీ సైజులో ఏర్పాటు చేసిన డిజిటల్ స్కీన్లపై హిందీ, ఆంగ్ల భాషల్లో యోగాసనాలకు సంబంధించిన సూచనల్ని ఇచ్చారు. ఈ కార్యక్రమం సందర్భంగా రిపబ్లిక్ పరేడ్ వేడుకల మాదిరిగానే రాజ్‌పథ్ చుట్టుపక్కల దాదాపు ఐదువేల మంది భద్రతాసిబ్బందితో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఆంక్షల్ని విధించారు. రాజ్‌పథ్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గొన్నారు. రంజాన్ ఉపవాసాలు పాటిస్తున్నా.. ఈ వేడుకకు హాజరుకావడం విశేషం. యోగా దినోత్సవం సందర్భంగా ఆయుష్‌శాఖ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో తపాల బిళ్లలను, రూ.10, రూ.100 నాణేలను ప్రధాని మోదీ విడుదల చేశారు. పలురాష్ర్టాల్లో కేంద్ర మంత్రులు: తెలంగాణ, ఏపీ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, పలు రాష్ర్టాల్లో నిర్వహించిన వేడుకల్లో భారీసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. రాష్ర్టాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో కేంద్రమంత్రులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హైదరాబాద్‌లో సంజీవయ్యపార్కులో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్రమంత్రులు జేపీ నడ్డా, దత్తాత్రేయ, లక్నోలో హోంమంత్రి రాజ్‌నాథ్, కోచీలో రైల్వేమంత్రి సురేశ్ ప్రభు, కోల్‌కతాలో హర్షవర్థన్, రవిశంకర్ ప్రసాద్, చెన్నైలో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ప్రధాని మోదీ వేసిన ఆసనాలు ఇవే... ఉదయమే చాపతో రాజ్‌పథ్‌కు వచ్చిన ప్రధాని మోదీ మొత్తం 21 అసనాలు వేశారు. పాదహస్త ఆసనం, అర్థచక్ర ఆసనం, త్రికోణాసనం, దండాసనం, అర్థ ఉష్ట్రాసనం, వజ్రాసనం, శశాంకాసనం, విక్రాసనాలను వేశారు. సెల్ఫీలకు ప్రధాని నో...: ఏ కార్యక్రమం జరిగినా.. సందర్శకులతో ఎప్పుడూ మొబైల్ ఫోన్లలో సెల్ఫీ ఫోటోలకు ఫోజిచ్చే ప్రధాని మోదీ ఈసారి అలాంటి కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. తన ప్రసంగం తర్వాత యోగా కోసం ముందు వరుసలో ఏర్పాటు చేసిన తన స్థానానికి చేరుకున్న మోదీ.. ఓ మహిళా వాలంటీర్ సెల్ఫీ దిగడానికి రాగా.. ముకులిత హస్తాలతో ఆమె విజ్ఞప్తిని నిరాకరించారు. సియాచిన్‌లో సైనికుల యోగా విన్యాసాలు ఏడాది పొడుగునా మంచు దుప్పటి పరుచుకున్నట్లు కనిపించే సియాచిన్ యుద్ధ స్థావరంలో త్రివిధ దళాలకు చెందిన భారత సైనికులు యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. సముద్ర మట్టానికి 18800 అడుగుల ఎత్తైన ప్రదేశంలో.. మైనస్ 4 డిగ్రీల వాతావారణాన్ని తట్టుకునేలా ప్రత్యేక దుస్తులు ధరించి సైనికులు యెగా కార్యక్రమాల్ని నిర్వహించారు. లడఖ్, కార్గిల్‌తోపాటు దక్షిణ చైనా సముద్ర ప్రాంతమంతా విస్తరించిన సైనిక దళాలకు చెందిన సిబ్బంది యోగాసనాలు వేశారు. మెగా ఈవెంట్‌కు రెండు గిన్నిస్ రికార్డులు రాజ్‌పథ్‌లో నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమానికి గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు లభించింది. ఒకే ప్రదేశంలో 84 దేశాలకు చెందిన జాతీయులతోపాటు 35,985 మంది పాల్గొన్న ఈ కార్యక్రమం రెండు రికార్డు సొంతం చేసుకున్నది. ఈ రికార్డులను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్సు వెరిఫికేషన్ గ్లోబల్ హెడ్ మార్కో ఫ్రిగట్టి ధ్రువీకరించారు. ఒకే రోజు రెండు రికార్డులను సొంతం చేసుకోవడం దేశానికి గర్వ కారణమని కేంద్ర ఆయుష్‌శాఖ మంత్రి శ్రీపాదనాయక్ మీడియాతో అన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరిని మోదీ అభినందించారు. 2005 నవంబర్ 19న గ్వాలియర్‌లోని జీవాజి వర్సిటీలో వివేకానంద కేంద్రం పర్యవేక్షణలో 362 పాఠశాలలకు చెందిన 29,973 మంది విద్యార్థులు 18 నిమిషాలపాటు యోగాసనాల కార్యక్రమం గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కింది.


Followers