Showing posts with label News. Show all posts
Showing posts with label News. Show all posts

మహిళా టీచర్ ను చితకబాదిన హెడ్ మాస్టర్..


విద్యార్థులకు బుద్ధిమాటలు చెప్పి స్కూల్ లో అందరికి ఆదర్శంగా ఉండవలసిన హెడ్ మాస్టర్ సహనం కొల్పోయి సాటి మహిళా టీచర్ ను పట్టుకుని అందరి ముందు చితకబాదాడు. చివరికి విద్యార్థులు ఆందోళనకు దిగడంతో పోలీసులు హెడ్ మాస్టర్ ను అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్ లోని 24 పార్గనాస్ జిల్లా జాయ్ నగరలో శ్రీకృష్ణ నగర్ హై స్కూల్ లో అశోక్ నస్కర్ హెడ్ మాస్టర్ గా పని చేస్తున్నాడు. ఇదే స్కూల్ లో సస్వతి కుందు అనే మహిళ లెక్కలు టీచర్ గా పని చేస్తున్నారు. కొంత కాలం నుండి స్పెషల్ క్లాస్ లు తీసుకునే విషయంలో టీచర్ల మధ్య విభేదాలు వచ్చాయి. గురువారం స్పెషల్ క్లాస్ లు తీసుకోవాలని హెడ్ మాస్టర్ అశోక్ నస్కర్ మహిళా టీచర్ సస్వతి కుందుకు చెప్పారు. అందుకు ఆమె నిరాకరించారు. సహనం కొల్పోయిన అశోక్ నస్కర్ స్టాఫ్ రూంలో సస్వతి కుందు చెంప చెల్లుమనిపించాడు. అంతటితో శాంతించకుండ ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లాడు. తరువాత ఆమె మొబైల్ తీసుకుని నేలకేసికొట్టాడు. విషయం తెలుసుకున్న విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సస్వతి కుందు ఫిర్యాదు చెయ్యంతో పోలీసులు అశోక్ నస్కర్ ను అరెస్టు చేశారు. సస్వతికి ఆసుపత్రిలో చికిత్స చేయించామని పోలీసులు తెలిపారు.


రెజ్లింగ్‌ టోర్నీలో భారత మహిళల టీమ్‌ రెండో స్థానంలో నిలిచింది

సీనియర్‌ అంతర్జాతీయ రెజ్లింగ్‌ టోర్నీలో భారత మహిళల టీమ్‌ రెండో స్థానంలో నిలిచింది. యువ రెజ్లర్లు వినీష్‌ (48 కిలోలు), లలిత (55), అనిత (63) అన్ని బౌట్లలో గెలిచారు. అయితే సాక్షి మాలిక్‌ (58) ఓటమిపాలైంది. దీంతో భారత్‌ రజతంతో సరిపెట్టుకుంది. ఆతిథ్య కజకిస్థాన్‌ అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం సాధించగా.. మంగోలియా కాంస్యంతో టోర్నీని ముగించింది.

ఎవ్వరి ఆచారాన్ని కించపరిచినట్లు కాదు, సుప్రీం


పరిక్ష వ్రాసే రోజు బురఖా వేసుకోకుంటే మీ ధర్మానికి, ఆచారాన్ని కించపరిచినట్లు కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. పరిక్షా కేంద్రాలకు బురఖా వేసుకుని వెళ్లి పరిక్ష వ్రాయడానికి అనుమతి ఇవ్వాలని విద్యార్థి సంఘం సమర్పించిన అర్జీని సుప్రీం కోర్టు కొట్టి వేసింది. ఆల్ ఇండియా ఫ్రీ మెడికల్, డెంటల్ టెస్ట్ (ఏఐపీఎంటీ) పరిక్షలు శనివారం మళ్లి నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ పరిక్షలకు హాజరు అయ్యే అమ్మాయిలు బురఖాలు వేసుకుని రావచ్చని కేరళ హై కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. పరిక్ష కేంద్రాలను పర్యవేక్షించే అధికారులకు అనుమానం వస్తే బురఖాలు తీసి పరిశీలించాలని కేరళ హై కోర్టు సూచించింది. అయితే ఈ కేసు వివాదం సుప్రీం కోర్టులోకి వెళ్లింది. బురఖాలు వేసుకుని పరిక్షలు వ్రాయడానికి అనుమతి ఇవ్వాలని ఇస్లామిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (ఎస్ఐఒ) సుప్రీంలో అర్జీ సమర్పించింది. శుక్రవారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్. దత్తు నేతృత్వంలోని ధర్మాసనం అర్జీ విచారణకు స్వీకరించారు. పరిక్షా కేంద్రాలకు ఒక్క రోజు బురఖా వేసుకుని వెల్లకపోతే మీ మతాన్ని, ధర్మాన్ని, ఆచారాన్ని కించపరిచినట్లు కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు


హైకోర్టు విభజన కుదరదు..


రాష్ట్ర విడిపోయిన తరువాత తెలంగాణ ప్రభుత్వానికి, ఆంధ్రా ప్రభుత్వానికి ఏదో విషయంపైన వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ లో అన్ని శాఖలలో దాదాపు విభజన జరిగిన కొన్ని అంశాలమీద ఇంకా ఇరు రాష్ట్రాలు గొడవ పడుతూనే ఉన్నారు. ఇందులో ముఖ్యంగా హైకోర్టు విభజన వివాదం. ఇటు తెలంగాణ రాష్ట్రానికి, అటు ఆంధ్రా రాష్టానికి ఉమ్మడిగా హైకోర్టు విభజనపై ఎప్పటినుంచో మల్లగుల్లాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం కూడా హైకోర్టును విభజించి తీరాల్సిందే అని పట్టుబడుతుంది. దీనికి అప్పట్లో హైకోర్టు కూడా తెలంగాణ వాదులకు ఘాటుగానే సమాధానమిచ్చింది. ఏపీలో హైకోర్టు ఏర్పాటయ్యేంత వరకు విభజించేది లేదని.. ఈ హైకోర్టు బాధ్యతను కేంద్రం పై పెడుతూ.. హైకోర్టు నిర్మాణానికి కావలసిన అనువైన స్థలాన్ని కేంద్రమే చూడాలని.. దానికి అయ్యే వ్యయాన్ని కూడా కేంద్రమే పెట్టుకోవాలని ఆదేశించింది. అయితే ఇప్పుడు మళ్లీ ఈ విషయంపై ఉమ్మడి హైకోర్టులో వాదనలు జరిగాయి. రాష్ట్ర విభజన జరిగి సంవత్సరం గడిచినా న్యాయస్థాన విభజన ఇంకా జరగలేదని.. కింది స్థాయి న్యాయాధికారులను, కోర్టు సిబ్బందిని విభజించాలని కోరుతూ పిటిషన్ దాఖలైన నేపథ్యంలో దానిపై విచారణ జరిపిన హైకోర్టు ఇరు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న హైకోర్టును విభజించడం ఇప్పుడు కుదరదు చెప్పింది. 'ఉమ్మడి హైకోర్టును విభజించడం కాదు... ఆంధ్రప్రదేశ్‌కు హైకోర్టు ఏర్పాటు చేయాలి' అని తేల్చిచెప్పింది. హైకోర్టు విభజన జరగకుండా కింది స్థాయి న్యాయాధికారులను విభజించడం సరికాదని.. ముందు చట్ట ప్రకారం హైకోర్టు విభజన జరగాలని.. ఆ తరువాత న్యాయాధికారులను విభజించడం జరుగుతుందని సూచించారు. ముఖ్యంగా ఏపీ హైకోర్టు నిర్మాణంపై కేంద్రం చొరవ తీసుకోవాలని.. గతంలో సూచించినట్టు ఏపీ హైకోర్టు భవన నిర్మాణానికి ఇంతవరకు ఎన్ని నిధులు కేటాయించారు, ఎప్పుడు కేటాయించారో చెప్పాలని.. దీనికి సంబంధించి కౌంటర్ ను ఈ నెల 30లోగా దాఖలు చేయాలని ఆదేశించింది


కరెన్సీ నోట్లపై రాతలు వద్దు


'karensi notlapai raatalu vaddu'



కరెన్సీ నోట్లపై తెల్లగా ఉండే ప్రాంతం (వాటర్‌మార్క్ విండో) లో ఎలాంటి రాతలూ రాయవద్దని దేశ ప్రజలను భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కోరింది. ఈ ప్రాంతంలో కీలకమైన సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయని గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. 'వాటర్‌మార్క్ ప్రాంతంలో కొందరు నంబర్లు వేస్తుంటారు. మరికొందరు పేర్లు, సందేశాలు రాస్తుంటారు. తద్వారా నోటును ఖరాబు చేస్తుంటారు. నోటు అసలో, నకిలీనో తేల్చిచెప్పే సెక్యూరిటీ ఫీచర్లు వాటర్‌మార్క్ ప్రాంతంలోనే ఉంటాయి. అక్కడి రాతల వల్ల నకిలీ నోట్లను గుర్తించడం సామాన్యులకు కష్టమవుతుంది..' అని ఆర్‌బీఐ ఆ ప్రకటనలో పేర్కొంది







ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎస్.విశ్వనాథన్ కన్నుమూశారు.



దక్షిణాదిలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎస్.విశ్వనాథన్ (87) మంగళవారం తెల్లవారుజామున ఇక్కడి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత రెండు వారాలుగా చికిత్స పొందుతున్నారు. 1928 జూన్ 24న కేరళలోని ఇలపులిలో జన్మించిన ఆయన 13 ఏళ్ల వయసులోనే సంగీతంలో మెళకువలు నేర్చుకున్నారు. సి.ఆర్.సుబ్బరామన్‌తో కలిసి 'దేవదాసు' 'లైలామజ్ను' సినిమాలకు పని చేశారు. 'దేవదాసు'లోని 'జగమేమాయ బతుకే మాయ' పాటను ఆయనే స్వరపరిచారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో దాదాపు 1200 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. తెలుగులో 'మరోచరిత్ర' 'అంతులేని కథ' 'గుప్పెడు మనసు' వంటి చిత్రాలకు సంగీతాన్ని అందించారు. 

ఎవరీ బాహుబలి ? బాహుబలుడు రాజ్యం చేసింది తెలంగాణలోనే?...


జైన విష్ణు పురాణాల ప్రకారం ఇక్ష్వాకు వంశానికి చెందిన రిషభదేవుడు లేదా వృషభనాథుడు, సునందల కుమారుడు బాహుబలి, ప్రస్తుత తెలంగాణరాష్ట్రంలోని బోధన్ (పోదనపురం) రాజధానిగా బాహుబలి రాజ్యపాలన చేశాడని కొన్ని సారస్వత ఆధారాలు చెబుతున్నాయి. ఆయన కాలంలో జైనమతం ఇప్పటి రూపాన్ని సంతరించుకోలేదు. నిజానికి అప్పట్లో జైన మతం అనే పేరే లేదు. మొదట్లో అంటే సింధునాగరికతా కాలం వరకు బాహుబలి జీవిత కాలంలో ఆయన తండ్రి స్థాపించిన మతాన్ని రిషభధర్మం అని వ్యవహరించారు. వేదకాలంలో వ్రత్యధర్మం అన్నారు. ఉపనిషత్తుల కాలం వచ్చే నాటికి అర్హంత్‌ ధర్మం అనీ, మౌర్యుల కాలంనాటికి నిగ్రంథి అనీ, ఆ తరువాత కాలంలో జైనం అని పిలిచారని అనేక సారస్వత ఆధారాల వల్ల తెలుస్తోంది. బాహుబలి ఒక చారిత్రక పురుషుడని కానీ, లేక పౌరాణిక పురుషుడని కానీ ఇదమిత్థంగా చెప్పటం సాధ్యం కాదు
బాహుబలి పుట్టుక:
 విష్ణుపురాణం, జైన గ్రంథాలు, ప్రచారంలో ఉన్న కొన్ని కథలను బట్టి బాహుబలి చరిత్రను తెలుసుకోవచ్చు. జైనమతానికి సంబంధించిన మొదటి తీర్థంకరుడుగా పేరుగడించిన రిషభదేవుడు అయోధ్య రాజధానిగా రాజ్యపాలన చేశాడు. ఆయనే ఇక్ష్వాకు వంశాన్ని ప్రారంభించాడని జైన మతస్తులు విశ్వసిస్తున్నారు. సునందాదేవి, యశస్వతీ దేవి (సుమంగళీదేవి అని కొందరు ఉదహరిస్తున్నారు) అనే ఇద్దరు రాకుమార్తెలను రిషభదేవుడు వివాహమాడాడు. సుమంగళకు 99 మంది కుమారులు, బ్రహ్మి అనే కుమార్తె జన్మించారు. కుమారుల్లో పెద్దవాడి పేరు భరతుడు. సునందకు బాహుబలి అనే కుమారుడు, సుందరి అనే కుమార్తె జన్మించారు. (విష్ణుపురాణం భరతుడు, బాహుబలి ఇద్దరే రిషభదేవుని కుమారులని చెబుతోంది). భరతుడు గొప్ప వీరునిగాను, రాజనీతి కోవిదుడుగానూ తయారయ్యాడు. బాహుబలి చాలా పొడగరి. మంచి దేహదారుఢ్యంతో అత్యంత బలశాలిగా తయారయ్యాడు. అతడి భుజబలం అమోఘమయింది. బ్రహ్మి సాహిత్యంలో ప్రావీణ్యం సంపాదించింది. ఆమె పేరు మీదే అప్పట్లో 'బ్రాహ్మీ' లిపిని రిషభదేవుడు కనిపెట్టాడంటారు. అశోకుని కాలంలో దొరికిన తొలి శాసనాలు అత్యధికం బ్రాహ్మి లిపిలోనే ఉండటం ఈ సందర్భంగా గమనార్హం. సుందరి గణితంలో దిట్టయింది. వృషభదేవుడు చాలా కాలం రాజ్యపాలన చేశాడు.ఒకరోజు రాజనర్తకి అయిన 'నీరాంజన' నిండుకొలువులో ప్రభువు సన్నిధిలో నాట్యం చేస్తూ హఠాత్తుగా కిందపడి మరణిస్తుంది. ఈ మృతితో 'జీవితం క్షణభంగురం' అని అర్థమైన ఋషభనాథుడు విరక్తుడవుతాడు. తన రాజ్యంలోని అయోధ్యకు భరతుడిని పట్టాభిషిక్తుణ్ణి చేసి, పోదనపురానికి రాజుగా బాహుబలిని ప్రకటించి- తాను సర్వసంగపరిత్యాగిగా మారి జనారణ్యంలోకి వెళ్లిపోతాడు. తన రాజ్యాన్ని నూరుగురు కుమారులకు పంచిపెట్టాడు. తరువాత సన్యాస దీక్ష తీసుకుని వస్త్రభూషణాదులను త్యజించి అడవులకు వెళ్ళి తపస్సు ప్రారంభించాడు. అనేక ఏళ్ళ తపస్సు అనంతరం ఆయనకు జ్ఞానోదయం అయింది. దీన్నే 'జినత్వం' పొందడం అంటారు. తాను తెలుసుకున్న సత్యాలను దేశాటన చేస్తూ ప్రజలకు తెలియ చేశాడు రిషభుడు. ప్రజల్లో ఆయనకు మంచి ఆదరణ లభించింది. అనేకమంది రాజులు, వ్యాపారులు, సాధార ప్రజలు రిషభుని మతాన్ని స్వీకరించారు.

చక్రరత్న ఆయుధం

రిషభుడు లేదా రిషభదేవుడు అడవులకు వెళ్ళిన తరువాత అతని కుమారుడు భరతుడు ఓ గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించడం కోసం బలమైన సైన్యాన్ని నిర్మించడంతో పాటు కొత్త కొత్త ఆయుధాలను తయారుచెయ్యడం ప్రారంభించాడు. అతడి సైన్యం 'చక్రరత్న' అనే ఆయుధాన్ని తయారు చేసింది. దీన్ని భరతుడే ప్రయోగిస్తాడు. ఇది గురితప్పదు. అప్పటి ప్రపంచంలో భరతుని చేతుల్లో ఉన్న ఆయుధాలు మరెవరి దగ్గరాలేవు. అందుకే అతడు పాలిస్తున్న అయోధ్య చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నీ లొంగిపోయాయి. చివరికి తన 98 మంది సోదరుల రాజ్యాలను కూడా ఆక్రమించుకున్నాడు. తమ్ముళ్ళందరూ తమ రాజ్య భాగాలను అన్నగారికి అప్పగించి తమ తండ్రి ఉంటున్న అడవులకు వెళ్ళి ఆయన శిష్యులుగా మారారు. ఇలా మహా సామ్రాజ్యం స్థాపించడం వల్లనే ఈ భరతుని పేరుమీదుగా భారతదేశానికి ఆ పేరు వచ్చింది అని జైనమతం ఆధారంగా చెపుతారు. శకుంతల,దుశ్యంతుల కుమారుడైన భరతుని పేరుమీదుగా ఈ పేరు రాలేదన్నది ఈ వాదనలోని ముఖ్యాంశం అయితే భరతుని జైత్ర యాత్రను అడ్డుకుంటూ ముందుకు వచ్చిన వీరుడు మాత్రం బాహుబలి

భరతుడు, బాహుబలి ల యుద్ధం


భరతుడు బాహుబలి ఇద్దరూ బలశాలురే, ఇద్దరి బలగాలూ బలమైనవే కాబట్టి ఈ యుద్ధంలో ప్రాణ నష్టాన్ని నివారించేందుకు మంత్రులు ఒక ఒప్పందం చేసారు. యుద్ధరంగంలో పోరుకు సిద్ధమైన అన్నదమ్ముల దగ్గరకు వచ్చి తమ ఒక ప్రతిపాదన వారి ముందు ఉంచారు. ఇరు సైన్యాలు తలపడితే అపార ప్రాణ నష్టం జరుగుతుందని కాబట్టి, సైన్యాలను యుద్ధంలో దించకుండా అన్నదమ్ములిద్దరే యుద్ధం చెయ్యాలని, ఆ యుద్ధంలో ఎవరు ఓడిపోతే వారి రాజ్యం గెలిచినవారికి ఇచ్చివెయ్యాలనేది మంత్రుల ప్రతిపాదన సారాంశం. ఈ ప్రతిపాదనకు ఇద్దరూ సమ్మతించారు. వీరిద్దరి మధ్య దృష్టి యుద్ధం, జలయుద్ధం, మల్ల యుద్ధం (ద్వంద్వ యుద్ధం) అనే మూడు రకాల యుద్ధాలు జరగాలని మంత్రులు నిర్ణయించారు. అయితే ఎవ్వరూ ఆయుధం ప్రయోగించరాదనే షరతు విధించారు. ఆయుధాలు లేకుండా పోరాడి విజయం సాధించిన సమరం మానవచరిత్రలో ఇదే మొదటిది. అందుకే దీన్ని 'నిశస్త్రీకరణ' అన్నాడు. దీన్నే ఈరోజుల్లో మనం 'నిరాయుధీకరణ'గా అంటున్నాం.
ముందుగా దృష్టి యుద్ధం ప్రారంభమయింది. ఈ యుద్ధ నియమం ప్రకారం ఒకరి కళ్ళలోకి ఒకరు తీక్షణంగా చూస్తూ ఉండాలి. కళ్ళార్పకూడదు. ఎవరు ముందు కళ్ళు ఆర్పుతారో వారు ఓడిపోయినట్లు లెక్క. బాహుబలి తన అన్న భరతుని కళ్ళలోకి తీక్షణంగా చూస్తున్నాడు. అతడిలో ఏవేవో ఆలోచనలు చెలరేగుతున్నాయి. చిన్నప్పటి నుంచి తాను చూస్తున్న ఈ కళ్ళలోకి క్రోధాగ్నుల్ని ఎలా విరజిమ్మడం... అనుకుంటూ ప్రసన్నవదనంతో అన్నగారి కళ్ళలోకి చూస్తున్నాడు బాహుబలి. భరతుని పరిస్థితీ అలాగే ఉంది. తమ్ముడి ముఖంలో కనిపిస్తున్న ప్రేమ మమకార వాత్సల్యాలకు తనలో ఉన్న కోపాన్ని మరిచిపోయి ప్రశాంత చిత్తుడై కళ్ళు మూసుకున్నాడు. అంతే భరతుడు దృష్టి యుద్ధంలో ఓడిపోయినట్లు మధ్యవర్తులు ప్రకటించారు. కళ్ళుమూసి తెరిచేలోపల ఓటమి పాలవ్వడంతో భరతుడు నివ్వెరపోయాడు. రెండవదైన జలయుద్ధం ప్రారంభమయింది. నదిలో దిగి ఒకరిపై ఒకరు నీటిని చిమ్ముకోవడం ఈ యుద్ధం ప్రత్యేకత. యుద్ధం ప్రారంభమైన కొంతసేపటికి భరతుడు అలిసిపోయాడు. ఈసారి కూడా అమేయ భుజబల సంపన్నుడైన బాహుబలినే విజయం వరించింది.
రెండు యుద్ధాల్లో ఓడిపోయిన భరతుడు మల్ల యుద్ధంలోనైనా గెలవాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు. ఆ యుద్ధమూ ప్రారంభమయింది. ముందుగా భరతుడు బాహుబలునిపై పిడిగుద్దులు కురిపించాడు. రెండో గుద్దుకే బాహుబలి కిందపడిపోయాడు. తమ్ముడు కిందపడిపోవడంతో కంగారు పడ్డాడు భరతుడు. తమ్ముడు మరణిస్తున్నాడేమోనని బాధపడ్డాడు. ఇంతలో తెప్పరిల్లి పైకి లేచాడు బాహుబలి. ఇప్పుడు గుద్దే వంతు అతడిదే. అన్నను రెండు చేతుల్తో పైకి లేపి గిరగిరా తిప్పి జాగ్రత్తగా కిందకు దించాడు. గట్టిగా గుద్దటానికి చెయ్యి పైకి లేపాడు. ఈ దెబ్బతో భరతుడు చనిపోవడం ఖాయమని అక్కడ చేరిన వారందరూ హాహాకారాలు చేశారు. భరతుడు కూడా ప్రాణ భయంతో ఒణికిపోయాడు. ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఆయుధాన్ని వాడరాదనే నియమాన్ని పక్కనబెట్టి తన చక్రరత్న ఆయుధాన్ని ప్రయోగించడానికి ప్రయత్నించాడు. కానీ అది పనిచెయ్యలేదని జైన గ్రంథాలు చెబుతున్నాయి. నియమ విరుద్ధంగా ఆయుధాన్ని ప్రయోగించాడనే కోపంతో బాహుబలి అన్నను గుద్దటానికి పిడికిలి ఎత్తాడు. చెయ్యి ఎత్తిన వెంటనే అతడి మనసులో రకరకాల ఆలోచనలు చెలరేగాయి. నేనేం చేస్తున్నాను. నా తండ్రి తృణప్రాయంగా భావించి త్యజించిన రాజ్యాధికారం కోసమా తోబుట్టువును చంపబోతున్నాను...తుచ్ఛమైన ఈ రాజ్య భోగభాగ్యాలు వద్దు. తండ్రిగారు, తమ్ముళ్ళ లాగే నేనూ సన్యాసం స్వీకరించి శాశ్వితానందాన్ని విశ్వప్రేమను పొందుతాను... ఇలా సాగింది బాహుబలి ఆలోచన. అంతే తనను క్షమించమని అన్న భరతుని కోరాడు. తన రాజ్య భాగాన్ని కూడా అన్నగారికి ఇస్తున్నట్లు ప్రకటించాడు. అప్పటికప్పుడు సన్యాస దీక్ష తీసుకుంటున్నట్లు చెప్పి ఆభరణాలు, దుస్తులను తొలగించుకుని వెంట్రుకలను చేత్తో పీక్కున్నాడు. (జైన మతంలో దీక్ష తీసున్నవారు వెంట్రుకలను పీకడం ద్వారా తొలగించడం ఇప్పటికీ చూడవచ్చు). భరతుడు ఎంత వారిస్తున్నా వినకుండా బాహుబలి దీక్ష తీసుకున్నాడు.
తెలంగాణలో బాహుబలి

బాహుబలుడు రాజ్యం చేసింది  తెలంగాణలోనే. ప్రస్తుతం నిజామాబాద్‌ జిల్లాలో ఉన్న బోధన్‌ను పూర్వం పౌదన్యపురం అనీ, పోదన పురం అనీ పిలిచేవారు. ఇదే బాహుబలుని రాజధాని. ఈ విషయాన్ని చెప్పే కొన్ని ఆధారాలు అందుబాటులో ఉన్నాయి. పోదనపురం గురించి మహాభారతంలో కూడా ఉంది. అక్కడ జైన, బౌద్ధ, వైదిక మతాలు సమానంగా విలసిల్లాయి. అటువంటి పట్టణాన్ని బాహుబలుడు తన రాజధానిగా చేసుకున్నట్లు జైన గ్రంథాలు, విష్ణుపురాణం చెబుతున్నాయి. బోధన్‌లో అనేక జైన విగ్రహాలు, ఆలయాలు కనిపించడంతో బాహుబలుని రాజధానిగా నిజంగానే ఈ పట్టణం విలసిల్లిందేమో అని కొందరు చరిత్రకారులు అంటున్నారు.


ఏకధాటిగా వీడియో గేమ్ ఆడిన వ్యక్తి మృతి


ekadhaatiga vidiyo gem aadina  vyakti


ఈ విషాద ఘటన తైవాన్‌లో చోటు చేసుకుంది వీడియో ఆడుతూ ఓ వ్యక్తి మృతి చెందడం ఇది రెండోసారి తైవాన్: మూడు రోజులపాటు ఏకధాటిగా వీడియో గేమ్ ఆడిన ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాద ఘటన తైవాన్‌లో చోటు చేసుకుంది. తైవాన్‌లోని తైపీకి చెందిన సెయ్(32) అనే వ్యక్తి స్థానిక ఇంటర్నెట్ కేఫ్‌లో మూడు రోజులపాటు ఏకధాటిగా వీడియో గేమ్ ఆడుతూ మృతి చెందాడు.మొదట గమనించిన ఆ కేఫ్ సిబ్బంది అతడు నిద్రపోతున్నాడని భావించారు. కొంతసేపటి తర్వాత అనుమానం వచ్చి అతడ్ని పరికించి చూశారు. అతనికి శ్వాస ఆడకపోవడంతో వెంటనే అతడ్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు.అతనికి అనారోగ్య లక్షణాలు ఏవీ లేవని.. అయితే నిరంతరాయంగా వీడియో గేమ్ ఆడటం వల్ల గుండె ఆగిపోయి ఉంటుందని చెప్పారు. కాగా, సెయ్ తరచూ తమ కేఫ్‌కి వస్తూ ఉంటాడని ఆ కేఫ్ యజమాని తెలిపారు. వచ్చిన ప్రతీసారీ ఇదే విధంగా ఎక్కువ గంటలు వీడియో గేమ్ ఆడుతూ ఉండేవాడని చెప్పారు. సెయ్ మృటి చెందిన విషయాన్ని అతని కుటుంబసభ్యులకు ఆ కేఫ్ సిబ్బంది చేరవేశారు. కాగా, తైవాన్‌లో వీడియో ఆడుతూ ఓ వ్యక్తి మృతి చెందడం ఇది రెండోసారి.






అశ్లీల వెబ్‌సైట్లను నిరోధించలేం


నిస్సహాయత వ్యక్తం చేసిన సుప్రీం న్యూఢిల్లీ : భారత్‌లో అశ్లీల వెబ్‌సైట్లను నిరోధించేందుకు తాత్కాలిక ఆదేశాలు జారీ చేయాలన్న విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఒక వ్యక్తి తన గదిలో కూర్చుని అశ్లీల చిత్రాలు చూడాలనుకునే ఆయన వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన ప్రాధమిక హక్కును ఎవరూ నిలువరించలేరని నిస్సహాయత వ్యక్తంచేసింది. ''అటువంటి తాత్కాలిక ఆదేశాలను ఈ కోర్టు జారీ చేయలేదు. ఎందుకంటే ఎవరో ఒకరు కోర్టుకు వచ్చి మైనారిటీ తీరిన వ్యక్తిని నేను, నా గదిలో కూర్చుని నేను చూస్తుంటే మీరెలా నన్ను నిలువరించగలుగుతారు. ఇది రాజ్యాంగంలోని 21వ అధికరణను ఉల్లంఘించడమే అవుతుందని ప్రశ్నించవచ్చని'' ప్రధాన న్యాయమూర్తి హెచ్‌.ఎల్‌.దత్తు మౌఖికంగా తెలిపారు. న్యాయవాది కమలేష్‌ వాష్వాని వేసిన పిటిషన్‌పై విచారించిన ప్రధాన న్యాయమూర్తి పై విధంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఇంకా స్పందించడం లేదని అందువల్ల కోర్టు కల్పించుకుని తగు చర్యలు తీసుకోవాలని కోరారు. మరిన్ని సంబందిత వార్తలు


127,42,39,769.. ఇది ప్రస్తుత భారత జనాభా


ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని నేషనల్‌ పాపులేషన్‌ స్టెబిలైజేషన్‌ ఫండ్‌(ఎన్‌పీఎస్‌ఎఫ్‌) భారత జనాభా నివేదికను విడుదల చేసింది. ఎన్‌పీఎస్‌ఎఫ్‌ నివేదిక ప్రకారం జులై 11 సాయంత్రం 5 గంటలకు భారత జనాభా 127,42,39,769కు చేరింది. ఇది ప్రపంచ జనాభాలో 17.25 శాతం.* ఏడాదికి 1.6శాతం చొప్పున మనదేశంలో జనాభా పెరుగుతోంది.* ఈ పెరుగుదల ఇలాగే కొనసాగితే 2050 నాటికి భారత్‌ జనాభా 163కోట్లను దాటి అత్యధిక జనాభాతో ప్రపంచంలోనే మొదటిస్థానంలో నిలవనుంది.* ప్రస్తుతం చైనా 137 కోట్లకుపైగా జనాభాతో మొదటిస్థానంలో ఉంది.* 2011 జనాభా లెక్కల ప్రకారం భారత జనాభా 121కోట్లు. అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, జపాన్‌లాంటి దేశాల జనాభా అంతా కలిపితే భారత జనాభాకు సరిసమానం

కరెన్సీ నోట్ల మార్పిడి గడువు పొడిగింపు

2005కు ముందు ఉన్న కరెన్సీ మార్చుకునేందుకు రిజర్వు బ్యాంక్‌ ఇచ్చిన గడువు మరింత పొడిగిం చారు. మరో వారం రోజుల్లో ఈ గడువు ముగియ నుండగా, ఈ ఏదాది చివరి వరకు (డిసెంబర్‌ 31) వరకు పొడిగించారు. ఈలోగా ప్రజలు తమ వద్ద ఉన్న 2005 పూర్వకంగానే కరెన్సీ నోట్లను రూ.500, రూ. 1000 సహా బ్యాంకుల్లో ఇచ్చేసి కొత్తగా మార్పిడి చేసుకునే వీలుంది. 2005 కంటే ముందునాటి రూ.500, రూ.1000 నోట్లను వెంటనే ఆయా బ్యాంకుల్లో ఇచ్చేసి వినియోగ దారులు మార్చుకోవాలని ఇప్పటికే ఆర్‌బిఐ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. గతంలోనే ఈ నిర్ణయాన్ని వెలువరించినా కొన్నికారణాలవల్ల గడు వును రెండుసార్లు పొడిగించారు. జూన్‌ 30లోగా రిజర్వు బ్యాంక్‌ ఆదేశాలు పాటించాలని చెప్పారు. -

జగమంత యోగా.. గిన్నిస్‌లో జాగా


jagamanta  yoga.. ginnislo  jaaga

యోగా.. ప్రపంచమంతా పఠిస్తున్న జపం. 5 వేల ఏండ్లకింద భారత్‌లో ఆవిర్భవించిన ఈ శక్తి.. అంతర్జాయతీయ యోగా దినోత్సవంతో విశ్వమంతా వ్యాపించింది. ఏకంగా 177 దేశాలు యోగా ఔన్నత్యానికి వినమ్రంగా తలవంచాయి. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి నుంచి ఈఫిల్ టవర్ వరకు, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, సియాచిన్ నుంచి దక్షిణ చైనా సముద్రం వరకు యోగా జయకేతనం ఎగురువేసింది. ఆదివారం ఈ చరిత్రాత్మక ఘట్టానికి భారత్ నాయకత్వం వహిస్తూ.. దేశంలో కనీవిని ఎరుగని రీతిలో యోగా కార్యక్రమాలు నిర్వహించింది. ప్రధాని నరేంద్రమోదీ సహా 35వేలమంది ఒకేసారి యోగాభ్యాసం చేయడంతో దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్ యోగాపథ్‌గా మారింది. ఇంత పెద్దఎత్తున ప్రజలు ఒకేసారి యోగా చేయడం, అందులోనూ 84 దేశాలకు చెందిన జాతీయులు పాల్గొనడంతో రెండు గిన్నిస్ రికార్డులు సొంతమయ్యాయి. -రెండు రికార్డులు సొంతం -చరిత్రాత్మక ఘట్టానికి భారత్ నాయకత్వం -ఢిల్లీలో యోగాపథ్‌గా మారిన రాజ్‌పథ్ -దేశవిదేశాల్లో ఉత్సాహంతో యోగాభ్యాసం -ప్రపంచశాంతికి ఇది నాంది: ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్‌లో మైనస్ 4 డిగ్రీల చలిలో కూడా భారత సైనికులు యోగా దినోత్సవాన్ని జరుపుకొన్నారు. యోగా డేను పురస్కరించుకుని ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ ప్రపంచ శాంతి, సమైక్యతను నెలకొల్పడానికి కొత్త శకం ఆరంభమైందన్నారు. ఈ రోజు యోగా దినోత్సవంతో మానవ మేధస్సుకు శిక్షణ అందించే కార్యక్రమానికి నాంది పలికామని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా 200కోట్ల మంది యోగా దినోత్సవాన్ని జరుపుకొనడం గొప్ప విషయమని.. ఇదంతా భారత్ గొప్పతనమేనని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ కొనియాడారు. న్యూఢిల్లీ, జూన్ 21: కుల, మత, వర్ణ, దేశాలు, ప్రాంతీయాల కతీతంగా యోగా ఔత్సాహికులంతా చారిత్రక ఘట్టానికి సాక్ష్యంగా నిలిచారు. అంతర్జాతీయ తొలి యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచమంతా యోగా కేంద్రంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో వర్షాన్ని, వాతావారణ ప్రతికూల పరిస్థితులను, పలు ప్రాంతాల్లో వెల్లువెత్తిన నిరసనల్ని పక్కనబెట్టి ఆదివారం ఉదయమే ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది యోగా ఔత్సాహికులు చాపలు, ఇతర సామాగ్రిని చేతబట్టుకొని ఉత్సాహంతో తమ తమ ప్రాంతాలకు చేరుకున్నారు. పార్కులు, చర్చిలు, నివాసాలు, మిలటరీ స్థావరాలు, గగన తలాలతోపాటు విశ్వవ్యాప్తంగా 44 ఇస్లామిక్ దేశాలతోపాటు 177 దేశాల్లో జరిగిన అంతర్జాతీయ యోగా ఉత్సవాలకు భారత్ నాయకత్వం వహించింది. ప్రాచీన సంప్రదాయ యోగాసనాలు, విన్యాసాలతో ఆకట్టుకున్నారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయం నుంచి ఈఫిల్ టవర్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.., సియాచిన్ నుంచి దక్షిణ చైనా సముద్రం వరకు.. ప్రపంచశాంతిని, సమగ్రత, ఐక్యతను చాటిచెప్పారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు, రాజకీయవేత్తలు, అధికారులు, త్రివిధ దళాలు, రైల్వే, కార్పొరేట్ సంస్థలు, వ్యాపార వర్గాలు మెగా ఈవెంట్‌లో పాలుపంచుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ యోగా డే వేడుకల్ని ప్రారంభించారు. ఆధునిక జీవిన విధానంలో తలెత్తే శారీరక వైకల్యాన్ని అధిగమించే అద్భుతమైన శక్తి యోగాకు ఉందని ప్రణబ్ పేర్కొన్నారు. ఎన్నో శతాబ్దాల నుంచి యోగా సాధనకు భారత్ ప్రధాన కేంద్రమని అన్నారు. దేశరాజధాని ఢిల్లీలో రాజపథ్‌లో 37 వేల మందితో నిర్వహించిన మెగా యోగా ఈవెంట్‌ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన అతిపెద్ద యోగా శిబిరం రెండు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులను సొంతం చేసుకున్నది. భారీ సైజులో ఏర్పాటు చేసిన డిజిటల్ స్కీన్లపై హిందీ, ఆంగ్ల భాషల్లో యోగాసనాలకు సంబంధించిన సూచనల్ని ఇచ్చారు. ఈ కార్యక్రమం సందర్భంగా రిపబ్లిక్ పరేడ్ వేడుకల మాదిరిగానే రాజ్‌పథ్ చుట్టుపక్కల దాదాపు ఐదువేల మంది భద్రతాసిబ్బందితో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఆంక్షల్ని విధించారు. రాజ్‌పథ్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గొన్నారు. రంజాన్ ఉపవాసాలు పాటిస్తున్నా.. ఈ వేడుకకు హాజరుకావడం విశేషం. యోగా దినోత్సవం సందర్భంగా ఆయుష్‌శాఖ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో తపాల బిళ్లలను, రూ.10, రూ.100 నాణేలను ప్రధాని మోదీ విడుదల చేశారు. పలురాష్ర్టాల్లో కేంద్ర మంత్రులు: తెలంగాణ, ఏపీ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, పలు రాష్ర్టాల్లో నిర్వహించిన వేడుకల్లో భారీసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. రాష్ర్టాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో కేంద్రమంత్రులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హైదరాబాద్‌లో సంజీవయ్యపార్కులో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్రమంత్రులు జేపీ నడ్డా, దత్తాత్రేయ, లక్నోలో హోంమంత్రి రాజ్‌నాథ్, కోచీలో రైల్వేమంత్రి సురేశ్ ప్రభు, కోల్‌కతాలో హర్షవర్థన్, రవిశంకర్ ప్రసాద్, చెన్నైలో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ప్రధాని మోదీ వేసిన ఆసనాలు ఇవే... ఉదయమే చాపతో రాజ్‌పథ్‌కు వచ్చిన ప్రధాని మోదీ మొత్తం 21 అసనాలు వేశారు. పాదహస్త ఆసనం, అర్థచక్ర ఆసనం, త్రికోణాసనం, దండాసనం, అర్థ ఉష్ట్రాసనం, వజ్రాసనం, శశాంకాసనం, విక్రాసనాలను వేశారు. సెల్ఫీలకు ప్రధాని నో...: ఏ కార్యక్రమం జరిగినా.. సందర్శకులతో ఎప్పుడూ మొబైల్ ఫోన్లలో సెల్ఫీ ఫోటోలకు ఫోజిచ్చే ప్రధాని మోదీ ఈసారి అలాంటి కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. తన ప్రసంగం తర్వాత యోగా కోసం ముందు వరుసలో ఏర్పాటు చేసిన తన స్థానానికి చేరుకున్న మోదీ.. ఓ మహిళా వాలంటీర్ సెల్ఫీ దిగడానికి రాగా.. ముకులిత హస్తాలతో ఆమె విజ్ఞప్తిని నిరాకరించారు. సియాచిన్‌లో సైనికుల యోగా విన్యాసాలు ఏడాది పొడుగునా మంచు దుప్పటి పరుచుకున్నట్లు కనిపించే సియాచిన్ యుద్ధ స్థావరంలో త్రివిధ దళాలకు చెందిన భారత సైనికులు యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. సముద్ర మట్టానికి 18800 అడుగుల ఎత్తైన ప్రదేశంలో.. మైనస్ 4 డిగ్రీల వాతావారణాన్ని తట్టుకునేలా ప్రత్యేక దుస్తులు ధరించి సైనికులు యెగా కార్యక్రమాల్ని నిర్వహించారు. లడఖ్, కార్గిల్‌తోపాటు దక్షిణ చైనా సముద్ర ప్రాంతమంతా విస్తరించిన సైనిక దళాలకు చెందిన సిబ్బంది యోగాసనాలు వేశారు. మెగా ఈవెంట్‌కు రెండు గిన్నిస్ రికార్డులు రాజ్‌పథ్‌లో నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమానికి గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు లభించింది. ఒకే ప్రదేశంలో 84 దేశాలకు చెందిన జాతీయులతోపాటు 35,985 మంది పాల్గొన్న ఈ కార్యక్రమం రెండు రికార్డు సొంతం చేసుకున్నది. ఈ రికార్డులను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్సు వెరిఫికేషన్ గ్లోబల్ హెడ్ మార్కో ఫ్రిగట్టి ధ్రువీకరించారు. ఒకే రోజు రెండు రికార్డులను సొంతం చేసుకోవడం దేశానికి గర్వ కారణమని కేంద్ర ఆయుష్‌శాఖ మంత్రి శ్రీపాదనాయక్ మీడియాతో అన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరిని మోదీ అభినందించారు. 2005 నవంబర్ 19న గ్వాలియర్‌లోని జీవాజి వర్సిటీలో వివేకానంద కేంద్రం పర్యవేక్షణలో 362 పాఠశాలలకు చెందిన 29,973 మంది విద్యార్థులు 18 నిమిషాలపాటు యోగాసనాల కార్యక్రమం గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కింది.


మళ్లీ ఎమర్జెన్సీ రాదని చెప్పలేం...... బీజేపీ నేత అద్వానీ పరోక్ష వ్యాఖ్యలు


malli emarjensi raadani cheppalem



ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులు బలపడుతున్నాయ్ -మోదీ సర్కారుపై బీజేపీ నేత అద్వానీ పరోక్ష వ్యాఖ్యలు -అద్వానీ చెప్పింది అక్షర సత్యం: విపక్షాలు -ఆయన వ్యవస్థ గురించి చెప్పారు.. వ్యక్తుల గురించి కాదు: 2015 జూన్ 18: బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో మరోసారి అత్యవసర పరిస్థితి వచ్చే వాతావరణం కనిపిస్తున్నదంటూ కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వ విధానాలపై పరోక్ష విమర్శలు గుప్పించారు. బీజేపీ మాతృసంస్థ ఆరెస్సెస్ చేతిలో ప్రధాని మోదీ కీలుబొమ్మగా మారారనే అర్థం స్ఫురించేలా మాట్లాడారు. దేశంలో రాజకీయ నాయకత్వం బలహీనపడిందని, దాంతో ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసే శక్తులు బలపడుతున్నాయని పేర్కొన్నారు. బీజేపీ మార్గదర్శక మండలి సభ్యుడుగా కూడా ఉన్న అద్వానీ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. అద్వానీ మాటలు నూటికి నూరుపాళ్లు నిజమని విపక్షాలు పేర్కొన్నాయి. బీజేపీ ప్రభుత్వ తీరుపై ఆ పార్టీ నుంచే తీర్పు వెలువడిందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. అయితే, బీజేపీ, ఆరెస్సెస్ మాత్రం ఆచితూచి స్పందించాయి. అద్వానీ వ్యక్తుల గురించి మాట్లాడలేదని, వ్యవస్థ గురించి చెప్పారని అభిప్రాయపడ్డాయి. విధ్వంసకర శక్తులు బలపడ్డాయి దేశంలో రాజకీయ నాయకత్వం బలహీనం కావటంతో విధ్వంసకర శక్తులు బలపడ్డాయని అద్వానీ అన్నారు. ఈ పరిణామం వ్యవస్థల ధ్వంసానికి దారితీయవచ్చని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆందోళన వ్యక్తంచేశారు. ప్రస్తుతం దేశంలో రాజ్యాంగ, చట్ట రక్షణ వ్యవస్థల కంటే ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసే శక్తులు బలంగా ఉన్నాయి. రాజకీయ నాయకత్వంలో పరిణతి లేదని చెప్పను. కానీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మరోసారి అత్యవసర పరిస్థితి రాదన్న నమ్మకంలేదు. మన రాజకీయ వ్యవస్థలోని అత్యున్నత నాయకత్వం నుంచి ఆ మేరకు భరోసా రావటంలేదు. ప్రజాస్వామ్యం పట్ల నిబద్ధత లోపించింది. రాజకీయ నాయకత్వం బలహీనంగా మారటంతో నాకు దానిపై నమ్మకం పోయింది. అత్యవసర పరిస్థితి విధించటం అంత తేలికేం కాదు. కానీ, ఆ పరిస్థితి రాదని మాత్రం చెప్పలేను అని పేర్కొన్నారు. ఇంధిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 1975 నుంచి 1977 వరకు దేశంలో మొదటిసారి అత్యవసర పరిస్థితి విధించారు. ప్రతిపక్ష నేతలందరినీ జైళ్లలో పెట్టారు. నాటి ఎమర్జెన్సీకి త్వరలో 40 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా అద్వానీ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. 2013లో నరేంద్రమోదీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన అద్వానీ, ఆ తర్వాత బీజేపీలో దాదాపు ఒంటరయ్యారనే అభిప్రాయం ఉంది. ఆయన గతంలోకూడా మోదీ ప్రభుత్వ తీరును పరోక్షంగా తప్పుపట్టారు. బీజేపీ, ఆరెస్సెస్ నేతలు తరుచూ మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుండటం, ఘర్‌వాపసీ పేరుతో ఆరెస్సెస్ శాఖలు మత మార్పిడులకు పాల్పడుతుండటంతో మోదీ సర్కారుపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అద్వానీ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. అద్వానీ వ్యాఖ్యలు మోదీ సర్కారుపై కాదు: బీజేపీ, ఆరెస్సెస్ అద్వానీ ఎమర్జెన్సీ వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించినవి కాదని బీజేపీ, ఆరెస్సెస్ ప్రకటించాయి. బీజేపీ మార్గదర్శక మండలి సభ్యుడైన అద్వానీ ప్రధాని మోదీకి ఈ విధంగా సందేశం ఇస్తారని తాను భావించటంలేదని ఆరెస్సెస్ సిద్ధాంతకర్త ఎంజీ వైద్య అన్నారు. ఏమైనా చెప్పదలిస్తే ఆయనకు నేరుగా మోదీని కలిసే స్థాయి ఉందని తెలిపారు. ఆయనకు ఏదో సందేశం ఇవ్వాలన్న ఉద్దేశం కనిపించటంలేదని పేర్కొన్నారు. అద్వానీ వ్యాఖ్యలు వ్యక్తులను ఉద్దేశించినవి కావని, వ్యవస్థల గురించే ఆయన మాట్లాడారని బీజేపీ ప్రతినిధి ఎంజే అక్బర్ అభిప్రాయపడ్డారు. అద్వానీ అభిప్రాయాలను నేను గౌరవిస్తాను. కానీ, దేశంలో ప్రస్తుతం ఎమర్జెన్సీ విధించే పరిస్థితులు లేవు. ఆ యుగం ముగిసిపోయింది. ఇప్పుడు భారత ప్రజాస్వామ్యం ఎంతో శక్తిమంతమైంది అని పేర్కొన్నారు. అద్వానీ మాటలు అక్షర సత్యాలు: ప్రతిపక్షాలు ఎల్‌కే అద్వానీ వ్యాఖ్యలను ప్రతిపక్ష పార్టీలన్నీ సమర్థించాయి. మోదీ ప్రభుత్వ విధానాల తీరును అద్వానీ పరోక్షంగా వెల్లడించారని పేర్కొన్నాయి. -మోదీ పాలనలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడ్డాయని అద్వానీ చెప్పకనే చెప్పారు. ఆయన ఇంటర్వ్యూ చదివితే ఎవరికైనా ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఆయన పాలనపై అధికార పార్టీ నుంచే తీర్పు వెలువడింది. ఎవరి గురించి మాట్లాడుతున్నారో.. ఇక్కడ ఎవరి ప్రభుత్వం ఉందో.. ప్రధాని ఎవరో.. అన్నీ ఆయనకు తెలుసు. బీజేపీలో అద్వానీ రాజనీతి నిపుణుడు. ఆయన చెప్పింది పూర్తిగా నిజం. -టామ్ వాదక్కన్, కాంగ్రెస్ ప్రతినిధి -బీజేపీలో అత్యంత సీనియర్ నాయకుల్లో అద్వానీ ఒకరు. ఆయన ఆందోళనను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. బీహార్ రాష్ట్రం ప్రతిరోజూ ఎమర్జెన్సీ పరిస్థితులనే ఎదుర్కొంటున్నది. - నితీశ్‌కుమార్, బీహార్ ముఖ్యమంత్రి. -దేశంలో మరోసారి అత్యవసర పరిస్థితి విధించే అవకాశాన్ని కొట్టిపారేయలేమని అద్వానీజీ సరిగ్గానే చెప్పారు. మోదీ సర్కారు మొదటి ప్రయోగం ఢిల్లీయేనా? - అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి. -అద్వానీ సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయన మాటల్లోని అంతరార్థం స్పష్టంగా అర్థమవుతున్నది. మోదీ ప్రభుత్వంలో అధికార దర్పం ఛాయలు కనిపిస్తున్నాయి. -సీతారాం ఏచూరి, సీపీఎం జాతీయ కార్యదర్శి -అద్వానీ లేవనెత్తిన విషయంపట్ల ఆయన సీరియస్‌గా ఉంటే సూటిగానే చెప్పాలి. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు ప్రతిపక్షాల నుంచి విమర్శలెదుర్కొన్నారు. కానీ, ఇప్పుడు అధికారపక్షం నుంచి ఆందోళన వ్యక్తమవుతున్నది. మోదీ ప్రభుత్వం పార్లమెంటును, ఇతర వ్యవస్థలను బలహీనపరుస్తున్నది


ఆ కాలమ్ ఎందుకు చేర్చలేదు?


యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల్లో థర్డ జెండర్ కాలమ్ ను చేర్చకపోవడంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై మంగళవారం జస్టిస్ ముక్త గుప్తా, పీఎస్ తేజీలతో కూడిన న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వం, యూపీఎస్ ఈలకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై సుప్రీం స్పష్టమైన తీర్పు ఉన్నప్పటికీ తగిన చర్యలు తీసుకోకపోవడంపై కోర్టు మండి పడింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ట్రాన్స్ జెండర్ల పట్ల వివక్ష తగదని కోర్టు పేర్కొంది. జెండర్ కారణంగా ట్రాన్స్ జెండర్స్ ను ఎలా అడ్డుకుంటారని కోర్టు ప్రశ్నించింది. కాగా ఆగస్టు 23 న జరిగే ఈ పరీక్షకోసం ఇచ్చిన ప్రకటనలో్ థర్డ్ జెండర్ కాలమ్ లేకపోవడంపై దాఖలైన పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. దీనిపై జూన్ 17 లోపు దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని యూపీఎస్ సీని ఆదేశించింది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు జూన్ 19తో ముగియనుంది కనుక ఈ లోపుగానే వివరణ ఇవ్వాలని కోర్టు కోరింది. కాగా ట్రాన్స్ జెండర్ లను మనుషులుగా గుర్తించాలని, విద్యా, ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించాలని దాఖలైన పిటిషన్ పై ఏప్రిల్ 15, 2014 సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పును వెలువరించింది. సామాజికంగా,ఆర్థికంగా వెనుకబడిన వారిని వెనుబడిన తరగతులవారికి వర్తించే అన్ని రిజర్వేషన్స్ వర్తింప చేయాలని, వారికోసం ప్రత్యేకంగా థర్డ్ జెండర్ కాలమ్ ను చేర్చాలని కేంద్రం ప్రభుత్వం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కొన్ని సంస్థలు స్పందించిన ఈ ఆదేశాలను అమలు చేస్తున్నాయి కూడా.


ప్రముఖ రచయిత దాశరథి రంగాచార్య కన్నుమూత


ప్రముఖ రచయిత దాశరథి రంగాచార్య ఈరోజు (08/06/2015) ఉదయం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమాజీగూడలోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ఆయనకు ముగ్గురు సంతానం. చిల్లర దేవుళ్లు, మోదుగుపూలు, జానపదం నవలలు రచించి సాహితీ రంగంలో విశేష ప్రశంసలు అందుకున్నారు. తెలంగాణ సాయుధ పోరాటం నాటి స్థితిగతులు, ఆ కాలంలోని దారుణమైన బానిస పద్దతులను ఆయన తన నవలల్లో చిత్రీకరించారు.రంగాచార్య జీవిత విశేషాలు...* 1928లో వరంగల్‌ జిల్లా చినగూడూరులో జన్మించారు.* నిజాంకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు.* 1951-57 మధ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారు.* 1957-88 మధ్య సికింద్రాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌లో ఉద్యోగం చేశారు.* 'చిల్లర దేవుళ్లు' నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.* తెలుగు సాహిత్య చరిత్రలోనే తొలిసారిగా నాలుగు వేదాలను తెలుగులోకి అనువదించారు.* శ్రీమద్రామాయణం, శ్రీమహాభారతాలను సరళంగా తెలుగులో రచించారు.* 'జీవనయానం' పేరుతో ఆత్మకథను
రచించారు.* అభినవ వ్యాసుడిగా బిరుదు పొందారు.* దేహదాసు ఉత్తరాలు, శ్రీ మహాభారతము, జీవనయానం, చతుర్వేద సంహిత, అమృత ఉపనిషత్తు, అమృతంగమయ తదితర రచనలు చేశారు.కేసీఆర్‌ సంతాపందాశరథి రంగాచార్య మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగాఢ సంతాపం తెలిపారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన గొప్ప వ్యక్తి రంగాచార్య అని ఆయన కొనియాడారు. తన రచనల ద్వారా సామాజిక స్ఫూర్తిని ప్రదర్శించారన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన దాశరథి:
చంద్రబాబుప్రముఖ సాహితీవేత్త దాశరథి రంగాచార్య మృతిపట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర సంతాపం ప్రకటించారు. సాహితీ ప్రక్రియల్లో దాశరథి చేసిన కృషి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిందని కొనియాడారు.


తుది దశకు ఉద్యోగుల విభజన.

ఉద్యోగుల తాత్కాలిక విభజన ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. శుక్రవారం జరిగిన కమల్‌నాథన్‌ కమిటీ భేటీలో పలు అంశాలపై క్లారిటీ వచ్చింది. 4 శాఖలు మినహా మిగతా అన్ని శాఖల్లోనూ... ఉద్యోగుల విభజన దాదాపుగా పూర్తయింది. ఈ నెలాఖరులోపు 90 శాతం వరకు ఉద్యోగుల పంపిణీ పూర్తవుతుంది. ఇవాళ మరోసారి కమలనాథన్ కమిటీ భేటీ కానుంది. పలు శాఖలపై ఏకాభిప్రాయం.. ఉద్యోగుల తాత్కాలిక విభజనపై కమల్‌నాథన్ కమిటీ కసరత్తులు చేసింది. తెలంగాణ సచివాలయంలో ఇరు రాష్ట్రాల సీఎస్‌లు... కమిటీతో శాఖల వారీగా ఉద్యోగుల విభజనపై చర్చించారు. మొత్తం పదిశాఖల విభజనపై ఏకాభిప్రాయం కుదరింది. హోం, అగ్రికల్చర్, ప్లానింగ్, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, రెయిన్ షాడో ఏరియా డెవలప్‌మెంట్‌ , వికలాంకుల సంక్షేమం, కుటుంబ సంక్షేమశాఖ, భూగర్భజల, గ్రామీణ నీటిపారుదల శాఖల్లో ఉద్యోగుల విభజనపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. మరో 16 శాఖలపై రానున్న క్లారిటీ.. ఈ రోజు జరిగే భేటీలో మరో 16 శాఖల ఉద్యోగుల విభజనపై క్లారిటీ ఇవ్వనుంది. సంక్షేమశాఖ, పాఠశాల విద్య, పంచాయతీరాజ్‌, విద్యుత్, దేవాదాయ, ఉద్యానవనశాఖ, ఢిల్లీలోని ఏపీభవన్‌ వంటి కీలక శాఖల గురించి సీఎస్‌లు చర్చించనున్నారు. ఇది పూర్తైతే 60 శాఖల ఉద్యోగుల విభజన పూర్తైనట్లే. ఐతే ఉద్యోగుల సంఖ్య తేలని పోలీసు, టాస్క్‌ఫోర్స్, మెడికల్ అండ్ హెల్త్, ప్రొటోకాల్‌ శాఖల్లో మాత్రం ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరటం లేదు. దీంతో ఆయా శాఖల విభజన మరింత ఆలస్యమయ్యే అవకాశముంది. ఐతే ఉద్యోగుల సంఖ్యను తేల్చేందుకు ఈ నెల 12న కమల్‌నాధన్‌ కమిటీ ప్రత్యేకంగా భేటీ కానుంది. జూన్ చివరికల్లా పూర్తికానున్న తాత్కాలిక విభజన.. ఈ నాలుగు శాఖలు మినహా అందరు ఉద్యోగుల విభజనను జూన్ చివరికల్లా పూర్తి చేయనుంది. ఈ నాలుగు శాఖల్లో జిల్లాల వరకు ఏ సమస్యా రాకున్నా హైదరాబాద్‌లో పనిచేసే ఉద్యోగుల్లో మాత్రం సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఆయా శాఖలను రాష్ట్రపతి ఉత్తర్వుల్లో రాష్ట్రస్థాయి శాఖలుగా పరిగణించాల్సి ఉంది. కాని విభజన చట్టంలోని 18జీ, 18ఎఫ్‌లలో మాత్రం ఎక్కడి ఉద్యోగులు అక్కడే పనిచేయాలని పేర్కొన్నారు. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరితే తప్ప విభజన ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చేలా లేదు. సూపర్‌ న్యూమరి పోస్టులపై క్లారిటీ కరువు.. అంతేగాక సూపర్‌ న్యూమరీ పోస్టులపై కూడా ఇరురాష్ట్రాలు క్లారిటీ ఇవ్వటం లేదు. మొదట్లో ఇద్దరు సీఎంలు ఒక అవగాహనకు వచ్చినా.. కమిటి భేటీలో మాత్రం భిన్న వాదనలు వినిపిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఉత్పన్నమైన ఖాళీల్లో... ప్రస్తుతం ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులను భర్తీ చేసేందుకు తెలంగాణ సర్కార్ ఓకే చెప్పింది. కాని అందుకు ఏపీ ప్రభుత్వం మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ వివాదంపై కమల్‌నాథన్ కమిటీ తదుపరి సమావేశాల్లో చర్చించనుంది. జులైలో అభ్యంతరాల స్వీకరణ.. ఇక ఉద్యోగుల విభజనపై జులైలో అభ్యంతరాలను స్వీకరిస్తామని కమిటీ స్పష్టం చేసింది. మొత్తానికి ఎన్నో చర్చలు, మరెన్నో గందరగోళాల మధ్య.... ఉద్యోగుల విభనన తుదిదశకు చేరుకుది. ఐతే తాత్కాలిక విభజనకే ఏడాది సమయం పడితే...శాశ్వత విభజనకు, కోర్టు వివాదాల పరిష్కారానికి మరెంత కాలం పడుతుందోనని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బంగ్లాతో మైత్రికి బలమైన సందేశం

ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ప్రత్యేకడెహ్రాడూన్‌: భారత్‌-బంగ్లా భూ సరిహద్దు ఒప్పందం బిల్లు పార్లమెంటు ఉభయసభల్లో ఏకగ్రీవంగా ఆమోదం పొందడం... ఆ దేశంతో భారత్‌ మైత్రికి బలమైన సందేశమని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై దేశమంతా ఏకతాటిపై నిలుస్తుందని ఇది సూచించిందని పేర్కొన్నారు. సోమవారమిక్కడ ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశవ్యాప్తంగా చట్టసభల పనిదినాలు తక్కువగా నమోదవుతుండటంపట్ల ఆందోళన వ్యక్తంచేసిన ఆయన... సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించకూడదంటూ శాసనకర్తలకు సూచించారు. పార్లమెంటు, రాష్ట్ర శాసనవ్యవస్థలు ఏటా 100 రోజుల పనిదినాలను కలిగిఉండాలన్నారు. ప్రజాస్వామ్యంలో 'త్రీడీ': ప్రజాస్వామ్యంలో డిబేట్‌(చర్చ), డిస్సెంట్‌(భిన్నాభిప్రాయం), డెసిషన్‌(నిర్ణయం) అనే మూడు 'డీ'లు ఉండాలని ప్రణబ్‌ పేర్కొన్నారు. డిస్‌రప్షన్‌(అంతరాయం) అనే 'డీ' ఉండకూడదన్నారు. ప్రజలే తమ ప్రభువులన్న విషయాన్ని శాసనకర్తలు గుర్తుంచుకోవాలన్నారు.

బంగ్లాదేశ్‌తో సరిహద్దు ఒప్పందానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర

దిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ఈ వారం బంగ్లాదేశ్‌ పర్యటన చేపట్టనున్న నేపథ్యంలో భారత్‌-బంగ్లాదేశ్‌ భూ సరిహద్దు ఒప్పందం(ఎల్‌.బి.ఎ.)పై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. పొరుగు దేశంతో సంబంధాలు బలపరచుకునేందుకు ఇది ఉపకరిస్తుందని భావిస్తున్నారు. సరిహద్దుల్ని కొంతమేర మార్చుకునేందుకు 1974లోనే ఒప్పందంపై సంతకాలు జరిగాయి. బంగ్లాదేశ్‌ పార్లమెంటు దీనికి వెంటనే ఆమోదం తెలపగా, భారత పార్లమెంటు మాత్రం గత నెలలోనే ఆమోదించింది. ఇది రాజ్యాంగ సవరణ బిల్లు అయినప్పటికీ 50% రాష్ట్రాల శాసనసభలు ఆమోదం తెలపాలనే నిబంధన దీనికి వర్తించదని అధికార వర్గాలు తెలిపాయి. సరిహద్దుల్ని నిర్ణయించుకోవడంతో పాటు భారత్‌ నుంచి బంగ్లాదేశ్‌కు 17,160 ఎకరాల భూమి బదలాయింపునకు ఒప్పందం వీలు కల్పిస్తుంది. బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు 7110 ఎకరాల భూమి లభిస్తుంది.

రేవంత్‌రెడ్డికి 14రోజుల రిమాండ్‌


మ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థికి ఓటు వేయాలని నామినేటెడ్‌ ఎమ్మెల్యేను ప్రలోభపెట్టిన కేసులో అరెస్టయిన తెదేపా నేత రేవంత్‌రెడ్డికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతించాల్సిందిగా రేవంత్‌రెడ్డి చేసిన విజ్ఞప్తిని న్యాయమూర్తి అంగీకరించారు. రేవంత్‌రెడ్డితో పాటు సెబాస్టియన్‌, ఉదయ్‌సింహలకు కూడా 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు.ఓటుహక్కు వినియోగించుకున్న రేవంత్‌రెడ్డితెదేపా ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. పోలీసులు రేవంత్‌ను అసెంబ్లీకి తీసుకువచ్చిన వెంటనే తెదేపా, భాజపా ఎమ్మెల్యేలు ఆయన్ని పలకరించారు. అనంతరం వారితో కలిసి లోనికి వెళ్లి ఓటు వేశారు.చంచల్‌గూడ జైలుకు తరలింపుఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్న అనంతరం పోలీసులు రేవంత్‌రెడ్డిని అసెంబ్లీ నుంచి చంచల్‌గూడ జైలుకు తరలించారు. దీంతో జైలు వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటుచేశారు. రేవంత్‌తో పాటు సహ నిందితులు సెబాస్టియన్‌, ఉదయసింహాను కూడా చంచల్‌గూడ కేంద్ర కారాగానికి తరలించారు. రేవంత్‌రెడ్డికి చంచల్‌గూడజైలు అధికారులు హైసెక్యూరిటీ బ్యారక్‌ను కేటాయించారు.బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసిన న్యాయవాదులురేవంత్‌రెడ్డి బెయిల్‌ కోసం ఆయన తరపు న్యాయవాదులు సిటీ సివిల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన తరపు న్యాయవాది మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి నిర్దోషని స్పష్టంచేశారు. రేవంత్‌రెడ్డి అరెస్టును రాజకీయకుట్రగా అభిప్రాయపడ్డారు. ఆయన బయట ఉన్నప్పుడు ఏసీబీ అధికారులు అరెస్టు చేశారన్నారు.

ఓటుహక్కు వినియోగించుకున్న 118 మంది ఎమ్మెల్యేలు

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో...హైదరాబాద్‌: తెలంగాణలో శాసనమండలి ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. తెలంగాణ అసెంబ్లీలో నామినేటెడ్‌ సభ్యుడితో కలిసి 120 మంది ఎమ్మెల్యేలు ఉండగా వారిలో మధ్నాహ్యం వరకు 118 మంది శాసనసభ్యులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మధ్యాహ్నం 2 గంటల సమయంలో అసెంబ్లీకి వచ్చి తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. మరోవైపు ఇద్దరు వామపక్ష సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. సాయంత్రం ఐదు గంటల నుంచి కౌంటింగ్‌ నిర్వహించనున్నారు.



Followers