Showing posts with label Atal Bihari Vajpayee. Show all posts
Showing posts with label Atal Bihari Vajpayee. Show all posts

వాజపేయి జీవితం దేశానికే అంకితం



వాజపేయికి బంగ్లా ప్రకటించిన యుద్ధ విమోచన గౌరవ అవార్డును అందుకున్న ప్రధాని మోదీ -తనతో సహా ఎంతోమంది రాజకీయనేతలకు వాజపేయి స్ఫూర్తి అని వెల్లడి -ప్రతిపక్ష నేత ఖలీదా జియాతో భేటీ.. ఢాకేశ్వరి ఆలయం, రామకృష్ణ మఠ్‌ను సందర్శించిన మోదీ ఢాకా, జూన్ 7: మాజీ ప్రధాని వాజపేయిని బంగ్లాదేశ్ ప్రతిష్ఠాత్మక అవార్డుతో సత్కరించడం ఎంతో గర్వకారణమని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. బంగ్లాదేశ్ విముక్తికి ప్రతిపక్ష నేత హోదాలో వాజపేయి ఎనలేని కృషి చేశారని వెల్లడించారు. బంగ్లా విముక్తికి క్రియాశీల పాత్రపోషించినందుకు వాజపేయికి బంగ్లాదేశ్ ప్రకటించిన ప్రతిష్ఠాత్మక యుద్ధ విమోచన గౌరవ (లిబరేషన్ వార్ హానర్) పురస్కారాన్ని.. ఆయన తరఫున ప్రధాని నరేంద్రమోదీ అందుకున్నారు. బంగ్లాదేశ్ అధ్యక్ష భవనమైన బంగభవన్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ ఈ పురస్కారాన్ని మోదీకి అందజేశారు. అనంతరం మోదీ ప్రసంగిస్తూ.. తనతో సహా మరెంతోమంది రాజకీయ నేతలకు వాజపేయి స్ఫూర్తిప్రదాత అని కొనియాడారు. ప్రయాణం చేయలేని స్థితిలో ఉన్నందున వాజపేయి ఈ అవార్డు స్వీకరించేందుకు రాలేకపోయారని చెప్పారు. అటల్ బిహారీ వాజపేయి వంటి నాయకుడికి పొరుగుదేశంనుంచి గొప్ప పురస్కారం లభించినందుకు దేశ ప్రజలందరూ గర్వపడాల్సిన రోజు. ఆయన జీవితం మొత్తం దేశసేవకే అంకితమిచ్చారు. రాజకీయ కోణంలో ఆలోచిస్తే.. నాతో సహా దేశంలోని ఎంతోమంది రాజకీయ నేతలకు ఆయన గొప్ప స్ఫూర్తిప్రదాత అని కొనియాడారు. బంగ్లాదేశ్ విముక్తికి వాజపేయి చేసిన పోరాటాన్ని ఆహుతుల హర్షధ్వానాల మధ్య మోదీ గుర్తుచేశారు. నాడు వాజపేయి ప్రతిపక్ష నాయకుడిగా బంగ్లా విముక్తికి సత్యాగ్రహ దీక్ష చేపట్టారని పేర్కొన్నారు. అందులో యువ వలంటీర్‌గా తాను కూడా పాల్గొన్నట్లు చెప్పారు. బంగ్లాదేశ్ ప్రజల కల నిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నామని తెలిపారు. జూన్ 6, 1971న పార్లమెంట్‌లో వాజపేయి ప్రసంగిస్తూ.. బంగ్లాదేశ్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించాలని..
బంగ్లా పోరాట యోధులకు తగిన సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. అనంతరం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మాట్లాడుతూ విముక్తి పోరులో భారత్ అండగా ఉండటం బంగ్లాదేశ్ అదృష్టమని పేర్కొన్నారు. దేశ స్వాతంత్య్రానికి వాజపేయి గొప్ప సహకారం అందించారని ఆమె కొనియాడారు. కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీకి అధ్యక్షుడు హమీద్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు హమీద్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపినట్లు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వికాస్‌స్వరూప్ ట్వీట్ చేశారు. కాగా, భారత కంపెనీలకు రెండు ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటుకు అనుమతిస్తూ బంగ్లాదేశ్ నిర్ణయం తీసుకుంది. మొంగ్లా, భెరమారాలో రెండు సెజ్‌ల ఏర్పాటుకు బంగ్లాదేశ్ అనుమతిచ్చింది. ప్రధాని మోదీ పర్యటనను బంగ్లా మీడియా కీర్తించింది. అన్ని పత్రికలు మోదీ పర్యటనతో కొత్త అధ్యాయం ప్రారంభమైందని కొనియాడాయి. మోదీతో ప్రతిపక్షనేతల భేటీ ప్రధాని మోదీతో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా భేటీ అయ్యారు. బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని.. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలన్న విషయంలో జోక్యం చేసుకోవాలని ఆమె కోరారు. అంతకుముందు బంగ్లాదేశ్ ప్రతిపక్ష నాయకురాలు రౌషన్ ఎర్షాద్ సమావేశమయ్యారు. అనంతరం పలు వామపక్ష పార్టీ నేతలతో భేటీ అయ్యారు. కాగా, భారత్-బంగ్లాదేశ్ మధ్య బస్సు సర్వీసుకు తమకేమీ అభ్యంతరం లేదని ఖలీదా జియాకు చెందిన పార్టీ ప్రకటించింది. అయితే బంగ్లాదేశ్‌కు ఫీజు చెల్లించాలని ఆ పార్టీ నేత ఒకరు పేర్కొన్నారు. బంగ్లా సరిహద్దు వెంట కంచె బంగ్లాదేశ్‌తో ఉన్న నదీ సరిహద్దు వెంట తేలికపాటి కంచె వేయాలని సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) నిర్ణయించింది. నది మధ్యనుంచి ఈ కంచె వేయాలని అధికారులు ప్రణాళికలు రచించారు. ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రజా పనుల విభాగం (సీపీడబ్ల్యూడీ) చేపడుతుందని కోల్‌కతాలో బీఎస్‌ఎఫ్ ఐటీ సందీప్ సలుంకె తెలిపారు. ఢాకేశ్వరి ఆలయంలో మోదీ పూజలు 12వ శతాబ్దానికి చెందిన ఢాకేశ్వరి (ఢాకా దేవత) ఆలయాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు చేశారు. బంగ్లాదేశ్‌లోని అత్యధికమంది హిందువులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. శక్తిపీఠాల్లో ఒకటైన ఈ ఆలయంలో మోదీ 15నిమిషాలపాటు గడిపారు. ఈ సందర్భంగా విమోచన యుద్ధంలో సెక్టార్ కమాండర్ మేజర్ జనరల్‌గా పనిచేసిన సీఆర్ దత్తా మోదీకి తెలుపు, ఎరుపు రంగుల దట్టీ కట్టారు. ఈ దేవత పేరునుంచే ఢాకాకు ఆ పేరు వచ్చిందని కొందరి విశ్వాసం. 1996లో ఈ ఆలయాన్ని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుని.. జాతీయ వారసత్వ సంపదగా ప్రకటించింది. అనంతరం మోదీ రామకృష్ణ మిషన్‌ను సందర్శించారు. ఒప్పందాలను తక్షణమే అమలుచేస్తాం -సంయుక్త ప్రకటనలో ప్రధానులు మోదీ, హసీనా ఢాకా, జూన్ 7: భారత్, బంగ్లాదేశ్ మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాలను తక్షణమే అమల్లోకితెస్తామని రెండు దేశాలు ప్రకటించాయి. చరిత్రాత్మకమైన భూ సరిహద్దు ఒప్పందంతో సహా అన్నింటినీ సహకారాత్మక ధోరణితో అమలు చేస్తామని రెండు దేశాల ప్రధానులు నరేంద్రమోదీ, షేక్ హసీనా ఆదివారం ఢాకాలో సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. పౌర అణు విద్యుత్, పెట్రోలియంతోపాటు పునరుత్పాదక విద్యుత్ రంగంలోనూ కలిసికట్టుగా పనిచేస్తామని కొత్త తరం- కొత్త దిశ పేరిట విడుదల చేసిన ప్రకటనలో ఇద్దరు నేతలు పేర్కొన్నారు. భారత్-బంగ్లా మధ్య కుదిరిన ఒప్పందాలు వెంటనే అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఇద్దరు ప్రధానులు సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ప్రకటన వెల్లడించింది. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు తమ తమ భూభాగాల్లో ఎలాంటి కార్యకలాపాలను అనుమతించబోమని అంగీకరించారు. తీస్తాకు మానవతాకోణంలో పరిష్కారం: మోదీ ఢాకా, జూన్ 7: భారత్-బంగ్లాదేశ్ పక్కనే ఉండటం కాదని.. కలిసి నడుస్తాయి కూడా అని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. తీస్తా నదీ జలాల పంపిణీ రాజకీయ కోణంతో కాకుండా.. మానవతాకోణంలో పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాక్ భారత్‌కు చికాకు వ్యవహారంలా మారిందని ధ్వజమెత్తారు. ఢాకాలోని బంగబంధు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, ఢాకా యూనివర్సిటీలో ప్రసంగిస్తూ.. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో బంగ్లా ప్రధాని షేక్ హసీనా ధీరోదాత్తంగా వ్యవహరిస్తున్నారని కొనియాడారు. అనంతరం మోదీ రెండురోజుల బంగ్లాదేశ్ పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకున్నారు.



Followers