బ్రెజిల్‌లోని రియో నగరంలో ఈ ఏడాది సెప్టెంబర్ 7 నుంచి 18 వరకు 15వ
పారాలింపిక్స్ క్రీడలు జరిగాయి. ఒలింపిక్స్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ
పారాలింపిక్స్‌ను నిర్వహించారు. శారీరక అంగవైకల్యం, పాక్షిక అంధత్వం,
పక్షవాతం కలిగిన అథ్లెట్‌లు పారాలింపిక్స్‌లో పాల్గొంటారు. భారత్ 1968
నుంచి (1976, 1980 తప్ప ) పారాలింపిక్స్‌లో పాల్గొంటూ వస్తోంది. రియోలో
జరిగిన పారాలింపిక్స్‌తో కలిపి మొత్తం 11 పారాలింపిక్స్‌లలో భారత్
పాల్గొన్నది. రియో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడానికి భారత అథ్లెట్‌లు నానా
కష్టాలు పడ్డారు. పతకం తెస్తారని ఆశలు పెట్టుకున్న క్రీడాకారులు ఒకరి
తర్వాత ఒకరు వరుసగా వెనుదిరుగుతూ నిరాశపరిచారు. అయితే పారాలింపిక్స్‌లో
మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. సకల సౌకర్యాలు ఉండి, అత్యుత్తమ శిక్షణ
పొందిన అతిపెద్ద క్రీడాబృందం నిరాశపరిచిన వేదికపైనే భారత దివ్యాంగుడు
మరియప్పన్ తంగవేలు అద్భుతం చేశాడు. హైజంప్‌లో స్వర్ణం సాధించి చరిత్ర
సృష్టించాడు. దేవేంద్ర జఝారియా జావెలిన్ త్రో వ్యక్తిగత విభాగంలో రెండోసారి
స్వర్ణం సాధించడంతోపాటు ప్రపంచ రికార్డులు నెలకొల్పా డు. మహిళా అథ్లెట్
దీపా మాలిక్ షాట్‌పుట్‌లో రజతం సాధించారు. వైకల్యాన్ని జయించి ప్రపంచ
క్రీడా వేదికపై సత్తాచాటారు మన పారా అథ్లెట్‌లు. 11 రోజులపాటు ఉత్సాహంగా
సాగిన పారాలింపిక్స్‌లో చివరిరోజు విషాదం చోటుచేసుకుంది. ఇరాన్ అథ్లెట్
బహ్మాన్ గోల్బార్నిజాద్.. సైక్లింగ్ రేసులో ప్రమాదవశాత్తు జారిపడి ప్రాణాలు
కోల్పోయాడు.
పారాలింపిక్స్ విశేషాలు
-ఆరంభం, ముగింపు వేదిక - మారకాన స్టేడియం (బ్రెజిల్)
-క్రీడలు జరిగిన తేదీలు - సెప్టెంబర్ 7 నుంచి 18 వరకు
-మొత్తం జరిగిన రోజులు - 11
-క్రీడా ప్రారంభకులు - మైఖేల్ టైమర్ (బ్రెజిల్ అధ్యక్షుడు)
-మస్కట్ - వీనిసియస్, టామ్
-నినాదం - ఒక కొత్త ప్రపంచం
-పాల్గొన్న దేశాలు - 159 + ఇండిపెండెంట్ పారాలింపిక్స్ అథ్లెట్స్ టీమ్
-పాల్గొన్న క్రీడాకారులు - 4,342
-క్రీడలు - 22
-క్రీడా విభాగాలు - 528
-మొత్తం స్వర్ణాలు - 529
-మొత్తం రజతాలు - 529
-మొత్తం కాంస్యాలు - 539
-మొత్తం పతకాలు - 1,597
-పారాలింపిక్స్‌లో చేర్చిన క్రీడలు - కనోయింగ్, ట్రయథ్లాన్
-మార్చ్‌పాస్ట్‌లో తొలి దేశం - ఇండిపెండెంట్ పారాలింపిక్స్ అథ్లెట్స్ టీమ్
-మార్చ్‌పాస్ట్‌లో భారత్ - 73వ దేశం
-మార్చ్‌పాస్ట్‌లో చివరి దేశం - బ్రెజిల్
-భారత్ నుంచి పాల్గొన్న క్రీడాకారులు - 19 మంది (16 మంది పురుషులు, ముగ్గురు మహిళలు)
-భారత్ పాల్గొన్న క్రీడలు - 5
-ప్రారంభ వేడుకల్లో భారత త్రివర్ణ పతాకధారి - దేవేందర్ (జావెలిన్ త్రోయర్)
-తొలి స్వర్ణ పతక విజేత - వెరోనికా (స్లోవేకియా) 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో 208 స్కోర్‌తో స్వర్ణం సాధించింది.
-అత్యధిక స్వర్ణాలు సాధించిన దేశం - చైనా (107)
-అత్యధిక పతకాలు సాధించిన దేశం - చైనా (107 స్వర్ణాలు, 81 రజతాలు, 51 కాంస్యాలు = మొత్తం 239 పతకాలు)
-తొలి పతకం సాధించిన భారత క్రీడాకారుడు - మరియప్పన్ తంగవేలు (తమిళనాడు), హైజంప్
-భారత్ సాధించిన పతకాలు - 4 (2 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యం)
-పారాలింపిక్స్‌లో స్వర్ణాలు సాధించిన దేశాలు - 63
-ఏదో ఒక పతకం సాధించిన దేశాలు - 83
-ఒక్క పతకం కూడా సాధించని దేశాలు - 76
-పతకాల సాధనలో బ్రెజిల్ స్థానం - 8
2 పతకాల సాధనలో భారత్ స్థానం - 43
-16వ పారాలింపిక్స్ క్రీడలను నిర్వహించేది - జపాన్ (టోక్యో)
-అంతర్జాతీయ పారాలింపిక్స్ ఏర్పడినది - 1989, సెప్టెంబర్ 22
-అంతర్జాతీయ పారాలింపిక్స్ సంఘం గౌరవ అధ్యక్షుడు - జాక్వెస్ రోగె
-అంతర్జాతీయ పారాలింపిక్స్ సంఘం అధ్యక్షుడు - ఫిలిప్ క్రావెన్
-భారత పారాలింపిక్స్ సంఘం ఏర్పడినది - 1992
-సంఘం అధ్యక్షుడు - రాజేష్ తోమర్
-సంఘం ప్రధాన కార్యదర్శి - జె. చంద్రశేఖర్
పారాలింపిక్స్ - 2016 ప్రత్యేకతలు
-పారాలింపిక్స్
చిహ్నం టామ్. బ్రెజిల్ వాయిద్యకారుడు టామ్ జొబిమ్‌కు గుర్తుగా ఈ
చిహ్నానికి ఆ పేరు పెట్టారు. బ్రెజిల్‌లోని వృక్ష సంపదను ప్రతిబింబిస్తూ ఈ
చిహ్నాన్ని రూపొందించారు.
-ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ లేకుండా
పారాలింపిక్స్ ప్రారంభమయ్యాయి. ఎందుకంటే ఆయన పశ్చిమ జర్మనీ మాజీ అధ్యక్షుడు
వాల్టర్ అంత్యక్రియల్లో పాల్గొనడానికి వెళ్లాడు.
-డోపింగ్ ఆరోపణల వల్ల రష్యా అథ్లెట్లు ఈ పారాలింపిక్స్‌లో పాల్గొనలేదు.
-పారాలింపిక్స్
ప్రారంభోత్సవం, ముగింపు వేడుకలను భారత్‌లో దూరదర్శన్ సహా ఏ నెట్‌వర్క్
కూడా ప్రసారం చేయలేదు. అయితే 154 దేశాలు వేడుకలను ప్రసారం చేశాయి.
-పారాలింపిక్స్‌లో
స్వర్ణ విజేతలకు రూ. 75 లక్షలు, రజత పతక విజేతకు రూ. 50 లక్షలు, కాంస్య
పతక విజేతకు రూ. 30 లక్షలు ఇస్తామని క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
మరియప్పన్ (21) :
తమిళనాడులోని
సేలం సమీపంలో పెరియవాడగంపట్టి గ్రామంలో 1995, జూన్ 28న జన్మించిన
మరియప్పన్ తంగవేలు.. ఐదేళ్ల వయసులో పాఠశాలకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఓ
బస్సు అతడి కాలుపై నుంచి వెళ్లింది. ప్రమాదంలో అతడి కుడికాలు ఛిద్రమైంది.
మరియప్పన్ తల్లి వైద్యం కోసం రూ.3,00,000 ఖర్చు చేసింది. పేద కుటుంబం
కావడంతో ఆమె కూరగాయలు అమ్ముతూ ఇప్పటికీ ఆ అప్పు చెల్లిస్తోంది.
పారాలింపిక్స్ విజయంతో తమిళనాడు ప్రభుత్వం తంగవేలుకు రూ. 2 కోట్లు
ప్రకటించింది. భారత ఒలింపిక్ సంఘం రూ.75 లక్షలు ఇవ్వనుంది. దీంతో వారి
ఆర్థిక కష్టాలన్నీ తీరినట్లే. మరియప్పన్ తంగవేలు 14వ ఏట తొలిసారి ఎలాంటి
శారీరక వైకల్యం లేని వారితో నేషనల్ అథ్లెటిక్ మీట్‌లో పాల్గొని రజతం
గెలిచాడు. 2013లో 18 ఏళ్ల వయసులో జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో
పాల్గొనేటప్పుడు కోచ్ సత్యనారాయణ.. మరియప్పన్ ప్రతిభను గుర్తించాడు.
బెంగళూరులో కఠోర సాధన, శిక్షణతో రాటుదేలి ఏడాది క్రితం సీనియర్ లెవల్
పోటీల్లో అడుగుపెట్టిన మరియప్పన్ అదే ఏడాది ట్యునీషియాలో జరిగిన పారా
అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిలో 1.78 మీటర్ల ఎత్తు ఎగిరి స్వర్ణం గెలిచాడు.
పారాలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఇప్పుడు రియో పారాలింపిక్స్‌లో
హైజంప్‌లో భారత్‌కు స్వర్ణ పతకం సాధించి త్రివర్ణ పతాకాన్ని
రెపరెపలాడించాడు.
దేవేందర్ జఝారియా (35) :
రాజస్థాన్‌లో
1981, జూన్ 10న జన్మించిన దేవేందర్ జఝారియా 8 ఏళ్ల ప్రాయంలో చెట్టు ఎక్కగా
కరెంట్ వైరు తగలడంతో షాక్‌కు గురై ఎడమ చేతిని కోల్పోయాడు. అంగవైకల్యం
వచ్చిందని కుంగిపోకుండా జావెలిన్ త్రోలో కఠోర సాధనచేసి 2004, 2016
పారాలింపిక్స్‌లలో స్వర్ణ పతకాలు సాధించాడు. 2013లో ఫ్రాన్స్‌లోని
లయోన్‌లో, 2015లో ఖతార్‌లోని దోహలో జరిగిన ఐపీసీ అథ్లెటిక్స్ ప్రపంచ
చాంపియన్‌షిప్ పోటీల్లో వరుసగా స్వర్ణం, రజతం సాధించాడు. 2004లో అర్జున
అవార్డు పొందాడు. 2012లో పద్మశ్రీ అవార్డు స్వీకరించి, ఆ అవార్డు అందుకున్న
తొలి పారాలింపియన్‌గా గుర్తింపు పొందాడు.
దీపామాలిక్ :
హర్యానాకు చెందిన దీపామాలిక్ మహిళల షాట్ పుట్ విభాగంలో రజతం సాధించారు. ఈ
ఘనతతో పారాలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా దీప
రికార్డు సృష్టించారు. దీపా మాలిక్ 2011లో న్యూజిలాండ్‌లోని
క్రిస్ట్‌చర్చిలో జరిగిన ఐపీసీ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో
షాట్‌పుట్‌లో రజతం గెలుపొందా రు. ఆమె పట్టుదలను చూసి సైనికాధికారి అయిన
భర్త ప్రోత్సాహం తోడవడంతో దీప ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. 2012లో
అర్జున అవార్డు అందుకున్నా రు. 1999లో వెన్నెముకకు కణితి రావడంతో దీప
శరీరంలోని నడుము కింది భాగం చచ్చుబడిపోయింది. దీంతో ఆరేళ్లపాటు చక్రాల
కుర్చీకే పరిమితమైన ఆమె ఆ తర్వాత పారా అథ్లెట్‌గా మారారు. దీప పేరుమీద
రెండు లిమ్కా బుక్ రికార్డులు ఉన్నాయి. మొదటిది 2008లో కిలోమీటరు దూరం
యమునా నది ప్రవాహాన్ని దాటడం. రెండోది 2013లో ప్రత్యేక బైక్‌పై 58
కిలోమీటర్లు ప్రయాణించడం.
వరుణ్ సింగ్ భాటి:
1995,
ఫిబ్రవరి 13న ఉత్తరప్రదేశ్‌లో జన్మించిన వరుణ్‌సింగ్ భాటి (21) పోలియో
రావడంతో వికలాంగుడిగా మారాడు. 2012లో లండన్‌లో జరిగిన పారాఒలింపిక్స్‌లో
పాల్గొనే అవకాశం కోల్పోయాడు. 2014లో దక్షిణ కొరియాలో జరిగిన ఆసియన్
పారాలింపిక్స్‌లో 5వ స్థానం, అదే ఏడాది చైనాలో జరిగిన ఓపెన్ అథ్లెట్
చాంపియన్‌షిప్‌లో స్వర్ణాన్ని సాధించాడు. 2015లో జరిగిన పారా ప్రపంచ
చాంపియన్ పోటీల్లో 5వ స్థానంలో నిలిచాడు. రియోలో జరిగిన పారాలింపిక్స్‌లో
హైజంప్ విభాగంలో కాంస్యం సాధించాడు.
బహ్మాన్ గోల్బార్నిజాద్:
ఇరాన్‌కు
చెందిన ఈ సైక్లిస్ట్ 1980లో జరిగిన యుద్ధంలో కాలు కోల్పోయాడు. ఈ
పారాలింపిక్స్‌లో పురుషుల రోడ్ రేస్ సీ-4, 5 విభాగాల్లో పాల్గొన్న బహ్మాన్
సైకిల్‌పై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. దవాఖానకు తరలిస్తున్న
తరుణంలో గుండెపోటుతో మృతిచెందాడు. ఇలా పారా ఒలింపిక్స్‌లో ఒక అథ్లెట్
మరణించడం ఇదే మొదటిసారి. బహ్మాన్ మృతికి సంతాప సూచకంగా రియో ముగింపు
వేడుకల్లో కొన్ని క్షణాలు మౌనం పాటించారు.
పారాలింపిక్స్‌లో పెను సంచలనం
నలుగురు
పారా అథ్లెట్లు ఏ వైకల్యం లేని ఆటగాళ్లని తలదన్నేలా పరుగెత్తి ప్రపంచాన్ని
నివ్వెరపరిచారు. 1500 మీ. (టీ-13 క్లాస్) పరుగులో తొలి నాలుగు స్థానా ల్లో
నిలిచిన అథ్లెట్లు.. ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన అథ్లెట్ కంటే
అత్యుత్తమ టైమింగ్‌ను నమోదు చేశారు. అబ్దెల్లతీఫ్ బాకా (అల్జీరియా) 3
నిమిషాల 48.29 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తిచేసి స్వర్ణం
చేజిక్కించుకున్నాడు. ఇథియోపియాకు చెందిన తమిరు డొమిసెస్ (3 నిమిషాల 48.59
సెకన్లు) రజతం సాధించగా, కెన్యాకు చెందిన హెన్రీ కిర్వా (3 నిమిషాల 49.59
సెకన్లు) కాంస్యం గెలుచుకున్నాడు. అబ్దెల్లతీఫ్ సోదరుడు ఫౌద్‌బాకా (3
నిమిషాల 49.84 సెకన్లు) నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ నలుగురు పారా
అథ్లెట్లు.. ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన అమెరికా రన్నర్ మాథ్యూ
సెంట్రోవిజ్ (3 నిమిషాల 50 సెకన్లు) కంటే వేగంగా రేసును పూర్తిచేశారు.
-జర్మనీకి
చెందిన మార్సర్ రెమ్ కృత్రిమ కాలుతో లాంగ్‌జంప్‌లో 8.40 మీటర్లు దూకి
స్వర్ణం సాధించాడు. ఒలింపిక్స్‌లో అమెరికా అథ్లెట్ జెఫ్ హెండర్సన్ 8.38
మీటర్లు దూకి స్వర్ణం సాధించాడు. హెండర్సన్ కంటే మార్సర్ దూకిన ఎత్తు
ఎక్కువ కావడం విశేషం.
పారాలింపిక్స్‌లో భారత్
-మొదటిసారి 1968లో పారాలింపిక్స్‌లో పాల్గొన్నది.
-మధ్యలో జరిగిన 1976, 1980 పారాలింపిక్స్‌లో పాల్గొనలేదు.
-ఇప్పటివరకు 11 సార్లు పారాలింపిక్స్‌లో పాల్గొన్నది.
-1972 పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం వచ్చిం ది. మురళీకాంత్ షెట్కర్ స్విమ్మింగ్‌లో స్వర్ణం సాధించాడు.
-రియో పారాలింపిక్స్‌లో షాట్ పుట్ విభాగంలో దీపా మాలిక్ రజతం సాధించారు. ఈమె పారాలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళ.
-వ్యక్తిగత విభాగంలో రెండు పారాలింపిక్స్‌లో (2004, 2016) స్వర్ణాలు సాధించిన అథ్లెట్ దేవేందర్ జఝారియా (జావెలిన్ త్రో).
-జోగిందర్‌సింగ్
బేడీ వ్యక్తిగత విభాగంలో ఒకే పారాలింపిక్స్‌లో వేర్వేరు క్రీడల్లో మూడు
పతకాలు సాధించాడు. న్యూయార్క్‌లో జరిగిన పారాలింపిక్స్‌లో రజతం (షాట్
పుట్), కాంస్యం (జావెలిన్ త్రో), కాంస్యం (డిస్కస్ త్రో) గెలుచుకున్నాడు.
-ఇప్పటి వరకు జరిగిన పారాలింపిక్స్‌లో భారత్‌కు 12 పతకాలు వచ్చాయి. వాటిలో 4 స్వర్ణాలు, 4 రజతాలు, 4 కాంస్యాలు ఉన్నాయి.