నోబెల్‌ రేసులో రఘురాం రాజన్‌

ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కార గ్రహీతల రేసులో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు క్లారివేట్‌ అనలిటిక్స్‌ విడుదల చేసిన జాబితాలో రాజన్‌ పేరు కూడా ఉంది. భౌతిక, రసాయన, వైద్యం, సాహిత్యం, శాంతి, ఆర్థిక రంగంలో విశేష కృషి చేసిన వారికి ఏటా నోబెల్‌ పురస్కారాలు అందిస్తారు. 2017గానూ ఇప్పటికే ఐదు రంగాల్లో అవార్డులను ప్రకటించగా.. అక్టోబర్‌ 9 సోమవారం ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ పురస్కారం ప్రకటించనున్నారు. స్వీడన్‌లోని స్టాక్‌హోంలో జరిగే కార్యక్రమంలో గ్రహీత పేరును వెల్లడిస్తారు. అయితే ఈసారి నోబెల్‌ గ్రహీతల రేసులో రాజన్‌ కూడా ఉన్నారట.
క్లారివేట్‌ అనలిటిక్స్‌ అనే సంస్థ నోబెల్‌ అవార్డులపై అధ్యయనం చేస్తుంది. నోబెల్‌ కమిటీ అధికారికంగా ప్రకటించడానికి కొద్ది రోజుల ముందు గ్రహీతల రేసులో ఉన్నవారితో జాబితాను రూపొందిస్తుంది. దీని ప్రకారం.. ఈ ఏడాది ఆర్థికశాస్త్రంలో పురస్కారం అందుకోబోయే రేసులో ఆరుగురు ఉండగా.. అందులో ఒకరు ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రాజన్‌ కావడం విశేషం. ఈ మేరకు క్లారివేట్‌ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. గత 15ఏళ్లుగా క్లారివేట్‌ ఎంపిక చేసిన 45 మందికి నోబెల్‌ పురస్కారాలు వరించాయి. ఒక ఏడాది అయితే ఏకంగా క్లారివేట్‌ జాబితాలోని 9 మంది నోబెల్‌ అందుకున్నారు.
మూడేళ్ల పాటు రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌గా పనిచేసిన రాజన్‌ సెప్టెంబర్‌ 4, 2016న పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఆర్థికవేత్త అయిన రాజన్‌ ఈ రంగంలో ఎన్నో అధ్యయనాలు చేశారు. పుస్తకాలు రాశారు. ప్రస్తుతం ఆయన అమెరికాలోని చికాగో యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

Followers