బ్లడ్ క్యాన్సర్‌కి కొత్త పరీక్ష


ఏ రకమైన బ్లడ్ క్యాన్సర్‌ని అయినా ఒకే ఒక రక్తపరీక్షతో కనుక్కోగలగడం ఇప్పుడు సాధ్యమవుతుందంటున్నారు పరిశోధకులు. ప్రస్తుతం ఉన్న రక్తపరీక్ష ద్వారా 60 శాతం కేసులను గుర్తించగలుగుతున్నప్పటికీ మిగిలినవాటికి కారణాన్ని కనుక్కోగలగడం సాధ్యం కాలేదు. అయితే ఇటీవల కేంబ్రిడ్జి యూనివర్సిటీ అధ్యయనంలో మిగిలిన 40 శాతం బ్లడ్ క్యాన్సర్లకు కారణమయ్యే జన్యువును గుర్తించగలిగారు పరిశోధకులు. న్యూజిలాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ఈ పరిశోధనాంశాలు ప్రచురితమయ్యాయి. ఇప్పటివరకు క్రానిక్ బ్లడ్ క్యాన్సర్లను గుర్తించడానికి రకరకాల పరీక్షలు చేయాల్సి వస్తోంది. ఎర్ర రక్తకణాలు, ప్లేట్‌లెట్లు ఎక్కువ సంఖ్యలో తయారు కావడం వల్ల వచ్చే ఈ క్యాన్సర్ల వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడతాయి. తద్వారా గుండెపోటు, స్ట్రోక్ వచ్చి ప్రాణాపాయం కలుగుతుంది. కొంతమందిలో ఈ క్యాన్సర్లు ఉన్నప్పటికీ ఎటువంటి లక్షణాలు కనిపించవు. మరికొందరిలో ఇవి ల్యుకేమియాగా మారవచ్చు. ఇప్పుడు ఒక్క రక్తపరీక్షతో అన్ని రకాల క్యాన్సర్లనూ గుర్తించవచ్చు అని చెప్పారు కేంబ్రిడ్జి యూనివర్సిటీ హెమటాలజీ ప్రొఫెసర్ టోనీ గ్రీన్. ఇప్పుడు కనుక్కున్న సీఏఎల్‌ఆర్ జన్యువు కణస్థాయిలో ప్రభావం చూపిస్తుంది. కణంలో తయారైన ప్రొటీన్లను మెలికలు పడేలా చేస్తుంది. ఈ జన్యుపరీక్ష వల్ల బ్లడ్ క్యాన్సర్లకు ఆధునిక చికిత్సలను కనుక్కోగలిగే వీలుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు కేంబ్రిడ్జి యూనివర్సిటీ అధ్యయనంలో పాల్గొన్న డాక్టర్ జ్యోతి నంగాలియా.




Followers