బయో కెమిస్ట్రీ ఇంజినీరింగ్...


ఎంసెట్ కౌన్సెలింగ్‌కు మరికొంత వ్యవధి ఉంది. ఈ సమయంలో సంప్రదాయ బ్రాంచీలు కాకుండా ఇంజినీరింగ్‌లో విభిన్న శాఖల గురించి తెలుసుకొంటున్నాం. ఈ వారం కెమిస్ట్రీ, బయాలజీతో ముడిపడి ఉన్న ఇంజినీరింగ్ శాఖలు, వాటితో భవిష్యత్‌లో ఉపాధి అవకాశాలపై నేటి ప్రత్యేకం.... ఎన్నో ఇంజినీరింగ్ శాఖలు వున్న మన విద్యా విధానంలో మనం ఇంత వరకు మ్యాథ్స్, సైన్స్ ప్రాముఖ్యంగా ఉన్న విభాగాలను గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు కెమిస్ట్రీ, బయాలజీ ప్రధానంగా ఉన్న శాఖలను చూద్దాం. వీటిని బైపీసీ సంబంధిత శాఖలని అనుకోవద్దు. కెమికల్, బయాలజీ అంశాలు కేవలం బైపీసీ చదివిన వారికే సొంతం కాదు. బయోటెక్నాలజీ విభాగంలో బైపీసీ విద్యార్థులు నేర్చుకునేది ఈ అంశాలను ఏ పరిమాణాల్లో ఉపయోగించి పదార్థాలను తయారుచేయాలనే విధానం అయితే, ఇంజినీరింగ్‌లో దీనికి ప్రాధాన్యత వేరుగా ఉంటుంది. ఇంజినీరింగ్‌లో ఈ పదార్థాల ఉత్పత్తికి అవసరమైన ప్రణాళిక, విశ్లేషణ, పరికరాలను, పద్ధతులను, విధానాలను నేర్చుకుంటాం. ఒక ఇంజినీర్ మార్గాన్ని చూపిస్తే ల్యాబ్ అసిస్టెంట్స్ ఆ మార్గంలో ఉత్పత్తి చేస్తారు. మనం ఇప్పుడు ఇందులోని వివిధ శాఖలను, పాఠ్యాంశాలను, సర్టిఫికేషన్స్, పీజీ, ఉద్యోగ, పారిశ్రామిక అవకాశాలను పరిశీలిద్దాం. బయో టెక్నాలజీలో కనీసం ఆరు శాఖలు ఉన్నాయి. బయో టెక్నాలజీ, బయో-మెడికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, బయో కెమికల్, బయో మెడికల్, బయోటెక్ కెమికల్ మొదలైనవి. ఒకదానిలో మెడికల్ ప్రాముఖ్యమైతే ఇంకోదానిలో కెమికల్ అలాగే బయాలజీ, మైక్రో బయాలజీ వంటి అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. బయోటెక్ ఇంజినీరింగ్: పరిశోధన, విశ్లేషణా రంగానికి సరిపడ బయాలజీ, కెమిస్ట్రీ అంశాలను నేర్చుకుని, బయోకెమిస్ట్, బయోటెక్నాలజిస్ట్ అని పిలువబడే ప్రొఫెషనల్స్‌గా ఈ విద్యార్థులకు అవకాశం ఉంటుంది. జెనిటిక్స్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ వంటి ఎంతో ఆధునికమైన అంశాలను ఇందు లో చదువుతారు. ఇందులో ఉత్తీర్ణులైన విద్యా ర్థులు, అనేక ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో బయో టెక్నాలజిస్ట్‌లుగా ఉద్యోగాలను పొందవచ్చు. అవకాశాల విషయానికి వస్తే, బయో టెక్నాలజీ బాగా ఎదుగుతున్న రంగం. ఇందులో డీఎన్‌ఏ విశ్లేషణ, జీవ రసాయన, మందుల తయారీ రంగాల్లో పరిశోధన, ఉత్పత్తి కంపెనీల్లో టెక్నికల్ అనలిస్ట్, పరికరాల తయారీ, సలహాదారుగా, నియంత్రణ అధికారులుగా ఉద్యోగాలను పొందవచ్చు. ఎన్నో భారతీయ, అంతర్జాతీయ ఫార్మా కంపెనీల్లో వీరికి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ జంతు, వ్యవసాయ శాఖలలో ఉద్యోగాలు ఉన్నాయి. ఫోరెనిక్స్, డీఎన్‌ఏ, ఫింగర్ ప్రింటింగ్, క్లినికల్ పరికరాల అవగాహనలో సర్టిఫికేషన్లు కూడా ఎన్నో ఉన్నాయి. అమెరికా, యూకే వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఉద్యోగావకాశాలు, పీజీ అవకాశాలు చాలా ఉన్నాయి. బయోకెమికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్: ఇవి రెండు వినూత్నమైన విభాగాలు. కెమికల్ విభాగంలో కాల్కులస్, కెమికల్ సమీకరణాలు, ఫిజియాలజీ, బయోమెకానిక్స్, బయోఫిజిక్స్ వంటి ఎంతో ఆధునిక పాఠ్యాంశాలు నేర్చుకుంటారు. ఇన్‌స్ట్ట్రుమెంటేషన్ విభాగంలో చదివిన విద్యార్థులు థెరపీ పరికరాలు, మెడికల్ ఇమేజింగ్, శక్తిని ఒక పరిమాణం నుంచి వేరే పరిమాణంలోకి మార్చే పరికరాలు (ఉదాహరణకి థర్మామీటర్), ప్రాథమిక పరికరాల నుంచి అత్యాధునిక వెంటిలేటర్ల వంటి పరికరాల వరుకు ఎలా పనిచేస్తాయి, ఎటువంటి నియంత్రణ అవసరం లాంటి అంశాలను నేర్చుకుంటారు. బయోకెమికల్ ఇంజినీరింగ్ చేసినవారు, బయోటెక్ ఇంజినీర్లతో సమానంగా పీజీ, సర్టిఫికేషన్స్ చేయవచ్చు. ఉద్యోగావకాశాలు కూడా అక్కడ ప్రస్తావించిన విధంగానే వుంటాయి. ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగం విద్యార్థులు పరికరాలపై పరిజ్ఞానం సంపాదించడం వల్ల వారికి పరికర అవగాహనపై సర్టిఫికేషన్ లేదా ఒక ల్యాబ్ ఉపకరణం పైనా పరిశోధనా సర్టిఫికేషన్ లేదా డిప్లొమా చేయవచ్చు. దీంతో జాతీయ, అంతర్జాతీయ ల్యాబ్, ఉత్పాదనా సంస్థల్లో విశ్లేషణా, నాణ్యతా నియంత్రణా వంటి విభాగాలలో ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉన్నాయి. అయితే ఇటువంటి రంగంలో ప్రవేశించే విద్యార్థులు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటంటే, కాలేజీలో సరైన ఉపాధ్యాయులు, ల్యాబ్, పరికరాలు ప్రయోగశాలలో సరిపడా ఉన్నాయా లేవా అని చూసుకొని చేరాలి. ఉత్తీర్ణత మార్కుల్లో మాత్రమే కాకుండా అంశాలపై పరిపూర్ణమైన అవగాహన కూడా ఉండాలి. శాస్త్రీయ నైపుణ్యం, సాంకేతిక పరిఙ్ఞానం, ఓపికగా పద్ధతులను పాటిస్తూ పనిచేయగల సామర్థ్యం, డాటా ఎనాలసిస్ వంటి అంశాలను అర్థం చేసుకున్న విద్యార్థులు మాత్రమే ఉద్యోగార్హులు అవుతారు. పీహెచ్‌డీ చేసినట్లయితే ఇదే ఇంజినీర్లు ప్రొఫెసర్లుగానూ, ఉత్పాదన, పరిశోధనా సంస్థల్లో సలహాదారులుగానూ వెళ్లవచ్చు.ఇందులో మరో కొత్త విభాగాలు ఆగ్రో బయోటెక్నాలజీ, నానో బయోటెక్నాలజీలు. ఈ ఇంజినీరింగ్ విభాగాలు మన రాష్ట్రంలో లేవు కానీ ఇతర రాష్ర్టాలకు వెళ్లి చదువుకోగల విద్యార్థులకు ఇది ఎంతో మంచి అవకాశం. నో టెక్నాలజీ రాబోయే రోజుల్లో ఎంతో అభివృద్ధి చెందనున్న అంశం. దీనిలో విస్తారమైన అంశాలపై పఠనం ఉండటం వల్ల పీజీ లేదా డిప్లొమా చేయాలనుకునే విద్యార్థులకు ఎంచుకోడానికి ఎన్నో అంశాలు వున్నాయి. వీటిలో ఉద్యోగాలు కూడా అంతర్జాతీయ సంస్థల్లో ఎక్కువగా వుండటం గమనార్హం. విశ్లేషణా, పరిశోధనా అంశాలపై ఆసక్తి కలిగిన విద్యార్థులు మాత్రమే ఈ విభాగాలను ఎంచుకుంటే మంచిది.

Followers