తెలంగాణ ప్రభుత్వ అధికారాలకు కత్తెర వేసి, దొడ్డిదారిన అధికారం
చెలాయించాలన్న సీమాంధ్ర పాలకుల కుట్రను తెలంగాణ ప్రజా ప్రతినిధులు భగ్నం
చేయగలిగారు. గవర్నర్‌కు అధికారాలు కట్టబెట్టాలంటూ వచ్చిన లేఖపై తెలంగాణ
ప్రభు త్వం తీవ్రంగా స్పందించింది. మరోవైపు పార్లమెంటులో తెలంగాణ ప్రజా
ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు. దీంతో తమ లేఖ సలహా
పూర్వకమైనది మాత్రమే అని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంటులో
చెప్పడం గమనార్హం. తెలంగాణ ఎంపీల అభ్యంతరాల మూలంగా ఈ సర్క్యులర్‌ను పక్కన
పెట్టడానికి హోం మంత్రి అంగీకరించారు.
తెలంగాణ ఎంపీలతో చర్చలు జరపడానికి సిద్ధపడ్డారు. కానీ కేంద్రంలోని
సీమాంధ్ర మంత్రి మాత్రం ఆనాడు తెలంగాణ ఆవిర్భావ సంబురాలు జరుపుకున్నప్పుడు
చూసుకోలేదా? అంటూ వెటకారమాడుతున్నారు. తెలంగాణలోని బీజేపీ, టీడీపీ నాయకులు
కూడా ఆనాడు సంబురాలు ఎందుకు జరుపుకున్నారంటూ తెలంగాణవాదులను
ప్రశ్నిస్తున్నారు. ఈ నాయకులు ఆనాడు విభజన చట్టంలోని లోపాలను నిలదీసిన వారు
కాదు. ఇప్పుడు విభజన చట్టంలో లేని నిబంధనలను తెలంగాణపై ఎందుకు
రుద్దుతున్నారని తమ నాయకులను అడగడమూ లేదు.
తెలంగాణ ప్రభుత్వ అధికారాలను
కాపాడడానికి అంతా ఒక్కటిగా నిలవాల్సిన సమయంలో వీరు సీమాంధ్ర పెత్తందారులకు
వంత పాడడం అభ్యంతరకరం. సీమాంధ్ర పాలకులకు తమ రాష్ట్ర ఆవిర్భావ
దినోత్సవాన్ని సంబురంగా జరుపుకునే నైతిక శక్తి కూడా లేదు. అందుకనే తెలంగాణ
రాష్ట్ర ఆవిర్భావ సంబురాల పట్ల అక్కసు వెళ్ళగక్కుతున్నారు. వారికి తెలంగాణ
నాయకులే కొందరు మద్దతు పలకడమెందుకు? కేంద్రం పంపిన సర్క్యులర్‌లో
పేర్కొన్నట్టు- హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు, రంగారెడ్డి ఎస్పీ
కొద్ది రోజులకొకసారి గవర్నర్‌కు నివేదికలు సమర్పించడం, ఐజీ ఆధ్వర్యంలో
ప్రత్యేక సెల్ ఏర్పాటు, పోలీసు సర్వీస్ బోర్డు ఏర్పాటు చేసి పోలీసు
అధికారుల బదిలీలు, నియామకాలు దీనికి అప్పగించడం మొదలైనవన్నీ విభజన చట్టంలో
లేనే లేవు. అందువల్ల విభజన చట్టం చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదనీ,
సంబురాలు ఎందుకు జరుపుకున్నారని అడగడం అర్థ రహితం.
రాష్ట్ర విభజన బిల్లు రూపకల్పన జరిగినప్పుడే అందులో సీమాంధ్ర దుష్ట
శక్తులు పెట్టిన కొర్రీలను తెలంగాణవాదులు గుర్తించి వ్యతిరేకించారు. ఈ
కొర్రీల మూలంగా తెలంగాణవారు బిల్లును అడ్డుకుంటే రాష్ట్ర విభజనే
ఆగిపోతుందని సీమాంధ్ర నేతలు అనుకున్నారు. కానీ తెలంగాణవారికి కూడా తమకంటూ
ఎత్తుగడలు ఉన్నాయి. వీలైనంత మేర ఈ కొర్రీలను నిర్వీర్యం చేయగలిగారు.
గవర్నర్‌కు అధికారాలు అప్పగిస్తూ రాజ్యాంగ సవరణ జరపాలన్న కుట్ర సాగకుండా
నివారించగలిగారు. దీంతో విభజన చట్టంలో గవర్నర్‌కు అధికారాలు కట్టబెట్టడం
అనే నిబంధన బలహీనంగా మారిపోయింది. గవర్నర్‌కు అధికారాలు కట్టబెడుతూ విభజన
చట్టం లో ఉన్న నిబంధనలే కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి పంపిన సర్క్యులర్‌లో
ఉన్నాయని చెప్పడం పచ్చి అబద్ధం.
ఇది సీమాంధ్ర నాయకులు, వారి తాబేదారులు సాగిస్తున్న తప్పుడు ప్రచారం.
హైదరాబాద్‌లోని ఉమ్మడి రాజధాని ప్రాంతంలో శాంతి భద్రతలు కాపాడే బాధ్యత
గవర్నర్‌కు ఉంటుందని విభజన చట్టంలో ఉన్నది. అయితే ఈ నిబంధన మూలంగా గవర్నర్
పదవి అత్యంత శక్తిమంతంగా మారదు. గవర్నర్ మంత్రి మండలి నుంచి సూచనలు పొంది
నిర్ణయం తీసుకోవాలని కూడా విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నది. మంత్రిమండలిని
సంప్రదించిన తరువాత గవర్నర్ సొంత నిర్ణయం తీసుకోవచ్చు అనేది అసాధారణ
పరిస్థితులలో మాత్రమే. అదనపు బలగాలు కోరడం వంటి చర్యలు ఎటువంటి
పరిస్థితులలో తీసుకుంటారో ఏ మాత్రం బుద్ధీ జ్ఞానం ఉన్నవారికైనా
అర్థమవుతుంది.
రాష్ట్రపతి మాదిరే గవర్నర్ తీసుకునే నిర్ణయం హేతుబద్ధంగా ఉండాలనేది
ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే
అధికారం కేంద్రానికి ఉన్నప్పటికీ ఇష్టారీతిన వ్యవహరించలేదు. అదే మాదిరిగా
గవర్నర్ అధికారాల నిబంధన కూడా అసాధారణ పరిస్థితికి మాత్రమే వర్తిస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వాన్ని పక్కన పెట్టి గవర్నర్‌కు రోజువారీ కార్యనిర్వాహక
అధికారాలు అప్పగించాలన్నా, పోలీసు వ్యవస్థను చేతుల్లో పెట్టాలన్నా
రాజ్యాంగాన్ని సవరించ వలసి ఉంటుంది. కేంద్ర సర్క్యులర్‌లో పేర్కొన్నట్టుగా
గవర్నర్‌కు అధికారాలు అప్పగించడం రాజ్యాంగ విరుద్ధం కనుక న్యాయస్థానాలలో
కూడా చెల్లదు.
గవర్నర్‌కు కొన్ని బాధ్యతలు అప్పగించడమే కాదు, విభజన చట్టంలో ఇంకా అనేక
లోపాలున్నాయి. ఉమ్మడి రాజధానితోపాటు ఉమ్మడి అడ్మిషన్లు, ఉమ్మడి న్యాయ
వ్యవస్థ వంటివి ఇంకా చీకాకు కలిగిస్తున్నాయి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం తమంత
తాము పెట్టినవి కాదు. సీమాంధ్ర లాబీ ఒత్తిడి చేసి పెట్టించినవి. ఇవి
తెలంగాణకే కాదు, సీమాంధ్ర ప్రజలకు కూడా ఇబ్బందికరంగానే పరిణమిస్తాయి.
సీమాంధ్ర పెత్తందారులు ప్రజల సంక్షేమం కన్నా తమ ప్రయోజనాలే ప్రధానంగా
భావించడం వల్ల వచ్చిన సమస్యలు ఇవి. తెలంగాణ రాష్ట్రం ఈ సమస్యలను
పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నది. తెలంగాణ బీజేపీ, టీడీపీ నాయకులు ఈ
దిశగా తమ సీమాంధ్ర నాయకులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తే
మంచిది.