ప్రాణాలను కాపాడే కృత్రిమ మూత్రపిండాలు

హీమోడయాలిసిస్‌ విధానంలో మూత్రపిండాలు నిర్వహించాల్సిన అతి ముఖ్యమైన విధులను కృత్రిమ మూత్రపిండాలు నిర్వహి స్తాయి. కృత్రిమ మూత్రపిండాలు ప్రధానంగా రెండు విధులను నిర్వర్తిస్తాయి. మొదటిది - శరీరంలో అధికంగాఉన్న ద్రవాలను మూత్ర రూపేణా తొలగించి, ద్రవాల సమతౌల్యాన్ని కాపాడటం.  రెండవది - వ్యర్థపదార్థాలను తొలగించి, రక్తంలోని విషపూరిత రసాయనాల శక్తిని సమతుల్యం చేయడం. అల్ట్రాఫిల్టరేషన్‌ అనే ప్రక్రియ ద్వారా అధిక ద్రవాలను వెలుపలికి పంపితే, విషపూరిత రసాయనాల శక్తిని సమతుల్యం చేయడానికి ఉపకరించే ప్రక్రియను డిఫ్యూజన్‌ అంటారు. ఈ రెండు ప్రక్రియలను అనుసంధానిస్తూ, కృత్రిమ మూత్ర పిండాలు శరీరంలోని ద్రవాల, రసాయనాల సమతుల్యతను కాపాడుతాయి.

కృత్రిమ మూత్రపిండం లేదా డయలైజర్‌ రెండు అరలతో కూడిన సాధనం. మొదటి అరలోకి రక్తం ప్రవేశిస్తుంది. దీనిని రక్తపు అర అనీ లేదా బ్లడ్‌ కంపార్ట్‌మెంట్‌ అనీ అంటారు. అక్కడ ఉన్న పాక్షిక పారగమ్యత పొర (సెమి పర్మియబుల్‌ మెంబ్రేన్‌) ద్వారా ప్రవహిస్తుంది. దీనికి వెలుపల డయాలిసేట్‌ అర ఉంటుంది. ఈ అరలో స్వచ్ఛమైన డయాలిసేట్‌ ద్రావకం ఉంటుంది. ఈ ద్రావకం వ్యర్థ పదార్థాలను తొలగించి, రసాయనాలు సమతూకంలో ఉండేలా చూస్తుంది. డయలైజర్‌లో ఉన్న పొర డయాలిసేట్‌ ద్రావకంలోకి రక్తం చేరకుండా నివారిస్తూ, శరీరంలోని ద్రవాల సమతుల్యం (ఫ్లూయిడ్‌ బాలెన్స్‌) కోసం అల్ట్రాఫిల్టరేషన్‌ ప్రక్రియను, రసాయనాల సమతుల్యం (కెమికల్‌ బాలెన్స్‌) కోసం డిఫ్యూజన్‌ ప్రక్రియను నిర్వహిస్తూ, అతి సూక్ష్మ రంధ్రాల ద్వారా వ్యర్థపదార్థాలను తొలగిస్తుంది. ఈ సూక్ష్మ రంధ్రాల ద్వారా కొన్ని పదార్థాలూ పొరకు అటూ ఇటూ తిరుగాడుతాయి. కానీ, ఎర్ర, తెల్ల రక్తకణాలు కానీ, ప్రొటీన్లు, బ్యాక్టీరియా వంటివి కానీ ప్రయాణించడానికి అవకాశం లేనంత చిన్నవిగా ఈ రంధ్రాలు ఉంటాయి. రక్తంలోని ద్రవాలను తొలగించే ప్రక్రియ అల్ట్రాఫిల్ట రషన్‌. పాక్షిక పారగమ్యత పొర ద్వారా రసాయనాలు, ద్రవాలు ఒకవైపునుంచి రెండవ వైపునకు ప్రవహించడాన్ని డిఫ్యూజన్‌ అంటారు. దీనిలో రెండు వేర్వేరు సాంద్రతలున్న ద్రావకాలు ఆ పొరకు అటూ ఇటూ ఉంటాయి. అతి సూక్ష్మపదార్థాలు లేదా అణువులు ఆ పొరను దాటి అటూ ఇటూ ప్రయాణిస్తూ రెండు ద్రావకాల సాంద్రతను సమానం చేస్తాయి. ఈ విధానాన్ని కొంత సేపు అలాగే కొనసాగిస్తే ద్రావకం-ఎ నుంచి అణువులు ద్రావకం- బిలోకి, అలాగే బినుంచి ఎలోకి ప్రయాణిస్తాయి. ఈ ప్రక్రియను డిఫ్యూజన్‌ అంటారు.
అమెరికాలో తరచుగా ఉపయోగిస్తున్న డయాలిసిస్‌ ప్రక్రియ ఈ  హీమో డయాలిసిస్‌. రోగికి ఇతర చికిత్సావిధానాల కంటే హీమోడయాలిసిస్‌ను వైద్యులు సూచిస్తారా? అనే ప్రశ్నకు సమాధానం ఆయా రోగుల ఆరోగ్యం, మూత్ర పిండాలు దెబ్బతినడానికిగల కారణం, వయస్సు, జీవనశైలి, మూత్రపిండాల దాతలు లభ్యమవుతారా? వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. చికిత్సా విధానాన్ని ఎంచుకోవడంలో రోగికి స్వేచ్ఛ ఉంటుంది. జీవిన విధానం, వృత్తి తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని రోగి తనకు నచ్చిన చికిత్సావిధానాన్ని ఎంచుకోవచ్చు. అయితే అదే సమయంలో వైద్యులు రోగి ఆరోగ్యావసరాలనుబట్టి ఏ విధానం మంచిదో సూచిస్తారు. మూత్రపిండాలు దెబ్బతిని హీమోడయాలిసిస్‌ చేయించుకునే వారికి ఎదురయ్యే ప్రధానమైన సమస్య - ఎన్నిసార్లు ఈ హీమోడయాలిసిస్‌ చేయించుకోవాలి? అనేది. వారానికి రెండునుంచి మూడుసార్లు చేయించుకోవాల్సి ఉంటుంది. డయాలిసిస్‌ ఎన్నిసార్లు చేయించుకోవాలి? ప్రతిసారి ఈ ప్రక్రియను ఎంతసేపు చేయాలి? అనే అంశాలను చికిత్స చేస్తున్న వైద్యుడు రోగి పరిస్థితి ఆధారంగా నిర్ణయిస్తాడు.

Followers