ఆరోగ్య హక్కు



కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన జాతీయ ఆరోగ్య విధానం- 2015 ముసాయిదా ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తించాలని సూచించడం హర్షణీయం. సూచనలను స్వీకరించడానికి ఈ ముసాయిదాను ప్రజల ముందు పెట్టడం వల్ల చర్చకు ఆస్కారం ఏర్పడింది. రాజ్యాంగం పౌరుడి జీవించే హక్కును గుర్తిస్తున్నది. ఆరోగ్య పరిరక్షణ ఇందులో భాగమే. అంతర్జాతీయ ఒడంబడికలు, న్యాయస్థానాల తీర్పులు, వివిధ దేశాలలో పోకడలు అన్నీ ఆరోగ్య హక్కును గుర్తించక తప్పని పరిస్థితిని కల్పిస్తున్నాయి. సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలను అందుకోవాలని భావిస్తున్న నేపథ్యంలో ఆరోగ్య రక్షణకు, వైద్య వసతుల కల్పనకు చర్యలు తీసుకోవలసిందే. సూత్రప్రాయంగా ఆరోగ్య విధాన ముసాయిదా ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పూచీ ఇస్తున్నప్పటికీ ఈ సదాశయం ఆచరణలో ఎంత వరకు ప్రతిఫలిస్తుందనే సందేహం కలుగుతున్నది. ఆరోగ్యాన్ని హక్కుగా గుర్తిస్తే ప్రభుత్వం దీనిని అందించలేక పోవడం నేరంగా మారుతుంది. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం కూడా ఉంటుంది. ఆరోగ్య విధాన ముసాయిదాలో ఉన్న మరో ప్రధాన అంశం- అనారోగ్యం కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం. పరిశుభ్రత, పోషకాహారం, పొగాకు మద్య సేవనాన్ని అరికట్టడం, కాలుష్య నియంత్రణ, మహిళలపై హింసను నిరోధించడం మొదలైన ఏడు అంశాలతో కూడిన స్వాస్థ్య నాగరిక అభియాన్ సామాజిక ఉద్యమాన్ని చేపట్టాలని ముసాయిదా సూచిస్తున్నది. విద్యా సెస్ మాదిరిగా ఆరోగ్య నిధులను సేకరించాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నది. ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా ఉచిత వైద్య పరీక్షలు, మందులు, సూచనలు ఇవ్వాలని ముసాయిదా నిర్దేశిస్తున్నది. అయితే ప్రైవేటు రంగ విపరీత పోకడలను అరికట్టడంపై ఆరోగ్య విధాన ముసాయిదాలో స్పష్టత లేదు. పైగా ఈ నియంత్రణ లైసెన్స్ రాజ్‌కు దారి తీస్తుందనే ఆందోళనను ప్రస్తావించింది. అట్టడుగు వర్గాలకు ఉచిత వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత. అయితే స్థోమత ఉన్న వారు ప్రైవేటు వైద్యాన్ని ఆశ్రయిస్తే వారు మోసపోకుండా చూడవలసిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంటుంది. ఆరోగ్య బీమాను విస్తరింప చేయడంతో తమ బాధ్యత తీరుతుందని ప్రభుత్వం భావించకూడదు. వైద్య విద్యను గగన కుసుమంగా మార్చడం ఈ సమస్యలకు ఒక కారణం. వైద్య విజ్ఞానాన్ని మరింత విస్తృతం చేస్తే, వైద్యం వ్యాపారంగా కాకుండా సేవారంగంగా మిగులుతుంది. ఆయుర్వేద, హోమియోపతి వంటి వైద్య విధానాలపై కేంద్ర ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నదని ముసాయిదాను బట్టి తెలుస్తున్నది. వైద్య రంగంలో ఆధునిక విజ్ఞానాభివృద్ధిని ఆయుర్వేదానికి కొనసాగింపుగా అర్థం చేసుకొని రెండింటినీ మిళితం చేయాల్సింది. కానీ ఆయుర్వేదాన్ని ముతక విధానంగా ఆలోపతిని ఆధునికతకు చిహ్నంగా మార్చారు. విజ్ఞానాన్ని ఈ విధంగా విడదీయడమే పొరపాటు. వైద్య పరిజ్ఞానాన్ని సమగ్రమైందిగా తీర్చిదిద్దకుండా పరస్పర అవగాహన లేని వైద్యులను తయారు చేయడం మంచి పద్ధతి కాదు. ముసాయిదాలో సమగ్రత దిశగా అడుగు వేయాలనే ఆలోచన వ్యక్తమైనప్పటికీ స్పష్టత లేదు. ఆరోగ్య విధాన ముసాయిదాను అర్థం చేసుకునే ముందు క్షేత్ర స్థాయి పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవడం అవసరం. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ విధానాలు అమలయిన తరువాత- గ్రామీణ ప్రాంతంలో ప్రజారోగ్య వ్యవస్థ బలహీనపడ్డది. ఆరోగ్యశ్రీ వంటి పథకాలు పైకి గొప్పగా పనిచేసినా ఆ నిధులు ప్రైవేటు ఆస్పత్రులను బలోపేతం చేయడానికి ఉపయోగపడ్డాయి. ఇప్పుడు జిల్లా స్థాయిలో కూడా తగినంత వైద్య సదుపాయాలు ప్రభుత్వ రంగంలో లేవు. దీనికి తోడు ప్రైవేటు రంగంపై నియంత్రణ లేక పోవడం పెద్ద సమస్యగా మారింది. ఆస్పత్రులు, వైద్యులు, మందుల కంపెనీలు కుమ్మక్కు కావడం, నగర ఆస్పత్రులు గ్రామీణ వైద్యులు అవగాహనకు రావడం మొదలైన వికృత పోకడల వల్ల పేదలు మందులపై అవసరం లేని శస్త్ర చికిత్సలపై వ్యయం చేయవలసి వస్తున్నది. సహజంగా జరిగే ప్రసవానికి బదులు శస్త్ర చికిత్స చేయడం, అనేక మంది మహిళలకు అవసరం లేకున్నా గర్భసంచి తీసివేయడం వంటి ఈ వికృత పోకడల దుష్ఫలితాలే. ఈ పరిస్థితిని చక్కదిద్దాలంటే తగిన నియంత్రణా వ్యవస్థ ఉండాలె. స్వీయ నియంత్రణ వల్ల మార్పు సాధ్యమనే వాదన ఉన్నప్పటికీ, ఆ దిశగా కొన్ని ప్రయత్నాలు సాగుతున్నప్పటికీ, ఇప్పటి పరిస్థితుల్లో ప్రభుత్వం పటిష్టమైన నియంత్రణ విధానాన్ని అవలంబించడం అవసరం. ప్రభుత్వం సదుద్దేశంతో, సమర్థవంతంగా వ్యవహరించినప్పుడు నియంత్రణ చక్కగా సాగుతుంది, లైసెన్స్‌రాజ్ మళ్ళా వ చ్చిందనే ఆరోపణలకు తావుండదు. ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టపరచడం, మంచినీటి వసతి కల్పించడం, పారిశుధ్య చర్యలు చేపట్టడం వంటి కనీస బాధ్యతను ప్రభుత్వాలు నిర్వర్తిస్తే చాలా వరకు ఆరోగ్య హక్కును పరిరక్షించినట్టవుతుంది.


Followers