బ్యాంకు మిత్ర ఎవరు? ప్రధానమంత్రి జన్ ధన్ యోజనకు ఎలా సాయం చేస్తారు?


byaanku mitra evaru? pradhaanamantri jan dhan

ప్రధాని నరేంద్రమోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన్ ధన్ యోజన పథకం విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 'బ్యాంకు మిత్ర' పనిచేస్తున్నారు. బ్యాంకు సేవలు లేని గ్రామాల్లో బ్యాంకుల గురించి ప్రజలకు తెలియజేసే ఏజెంటే 'బ్యాంకు మిత్ర'. బ్యాంకులు, ఏటీఎమ్‌లు లేని ప్రాంతాల్లో వీరి చేస్తున్న కృషి అభినందనీయం. జన్ ధన్ యోజన పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను చేర్చించడంలో వీరి కృషి అమోఘం. బ్యాంకుల్లో ఖాతాలు తెరిచేందుకు గాను ప్రజల వద్ద నుంచి డాక్యుమెంట్స్ తీసుకుని వాటిని సరైనవిగా ధృవీకరించుకుని బ్యాంకుల్లో ఇస్తుంటారు. బ్యాంకుల్లో అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో, అప్లికేషన్స్ ఎలా నింపాలో కస్టమర్లకు తెలియపరుస్తుంటారు. ప్రజలకు బ్యాంకు ఖాతాల్లో నగదు ఏవిధంగా డిపాజిట్ చేయాలి, ఏవిధంగా నగదు విత్ డ్రా తీసుకోవాలి లాంటి విషయాలు చెప్తుంటారు. వీటితో పాటు భారత్‌లో బ్యాంకింగ్ అనుభవం లేనటువంటి ప్రజలకు, బ్యాంకులకు మధ్య అనుసంధాన కర్తగా ఈ బ్యాంక్ మిత్ర పనిచేస్తుంటారు. బ్యాంకుకు సంబంధించిన విషయాలు, నియమాలు ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తుంటారు. 'బ్యాంకు మిత్ర' గా ఎవరు కాగలరు? బ్యాంకు లావాదేవీల గురించి తెలిసిన వారిని బ్యాంకు మిత్రగా తీసుకుంటారు. సాధారణంగా పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ సైనిక ఉద్యోగులు, చిన్న మొత్తాల పొదుపు సంస్ధలకు చెందిన ఉద్యోగులు బ్యాంకు మిత్రగా ఉండేందుకు అర్హులు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం గురించి: భారతదేశంలోని పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు బ్యాంకింగ్ రంగం సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రధాని నరేంద్రమోడీ "ప్రధానమంత్రి జన్ ధన్ యోజన" (పీఎంజేడీవై) పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా బ్యాంకు ఖాతా తెరవడం వల్ల రుణాలు, కాల పరిమితి డిపాజిట్ల వంటి సౌకర్యాలు పొందవచ్చు. ఈ పథకం ద్వారా కనీస మొత్తం డిపాజిట్ చేయనవసరం లేకుండానే ఖాతాలను తెరవచ్చు. ఖాతా తెరిచిన ఆరు నెలల పాటు సక్రమంగా నడిపితే బ్యాంకు ఒక వెయ్యి రూపాయల పరిమితితో ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కల్పించడం తోపాటు రుణ పరిమితిని రూ. 5వేల వరకు పెంచుతారు. ఖాతాను తెరిచిన 42 రోజుల నుంచి లక్ష రూపా యల బీమా సౌకర్యం కల్పించనున్నారు. బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అనుసంధానం చేస్తారు. తద్వారా లబ్ధిదారులకు వంటగ్యాస్, వృద్ధాప్య పింఛన్, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ, ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలు నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి.

Followers