శాఖలవారీగా వివరాలు కోరుతున్న సర్కారు
-నాలుగురోజులుగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న సీఎస్
-1,07,744 ఖాళీలున్నట్లు ప్రాథమిక అంచనా
హైదరాబాద్, నమస్తే తెలంగాణ : కోటి ఆశలతో ఏర్పడిన కొత్త రాష్ట్రంలో ఉపాధి
అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువత ఆశలను తీర్చే ప్రక్రియను తెలంగాణ
ప్రభుత్వం వేగవంతం చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగా రాష్ట్ర
ఉద్యోగుల సంఖ్య తేలనప్పటికీ ఖాళీల భర్తీకి ప్రభుత్వం సమాయత్తమవుతున్నది.
రాష్ట్రంలో 1,07,744 ఖాళీలు ఉన్నాయని ప్రభుత్వం ప్రాథమిక నిర్ధారణకు
వచ్చింది. కేంద్రం ఉద్యోగుల విభజనను ఖరారు చేయగానే మిగిలిన సిబ్బంది సంఖ్య
తెలుస్తుందని, దీంతో వెనువెంటనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం
నిర్ణయించింది. ఈ మేరకు శాఖలవారీగా ప్రస్తుతమున్న ఖాళీల వివరాలను
తెప్పించుకుంటున్నది. ఉద్యోగ నియామకాల కసరత్తు ప్రక్రియలో మొదటి అడుగును
దాటేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ నాలుగురోజులుగా
శాఖలవారీగా నేరుగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఇదే క్రమంలో గురువారంనాడు వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష
నిర్వహించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు
ఖాళీల నియామకాలను భర్తీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన
కార్యదర్శి ఇందుకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ప్రస్తుతం
ఉద్యోగుల విభజన పూర్తికాకపోవడంతో తెలంగాణకు ఎంతమంది మిగులుతారో తేలడం లేదు.
ఎక్కువమంది ఆంధ్రా ఉద్యోగులు వర్క్ టూ ఆర్డర్ కింద తెలంగాణలో పని
చేస్తుండగా, తెలంగాణ ఉద్యోగులు కొంతమంది ఆంధ్రాలో పనిచేస్తున్నారు.
ఉద్యోగుల విభజనకు తుదిరూపం వస్లే ఏ రాష్ట్రంలో ఎంతమంది పనిచేయాలనే లెక్క
తేలుతుందని భావిస్తున్నారు. తెలంగాణలో ఉద్యోగుల ఖాళీలు లక్ష నుంచి లక్షన్నర
వరకు తేలే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నాయకుడొకరు అన్నారు. ప్రస్తుతం ఉన్న
పద్ధతిలోనే శాఖలవారీగా ఖాళీల లెక్కలను సర్కారు తీసుకున్నది. విభజన ప్రక్రియ
పూర్తికాగానే రోస్టర్ పాయింట్లు కూడా నిర్ధారించుకొని వెంటనే నోటిఫికేషన్
విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్నట్టు తెలిసింది.