'లయన్' 2015 రివ్యూ

'layan' (14-May-2015)

సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా తర్వాత వచ్చే మూవీ విషయంలో స్టార్ హీరోలు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా 'లెజెండ్' లాంటి కొత్త రికార్డులు సృష్టించిన సినిమా తర్వాత అంటే... ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ 'లయన్' కు దర్శక నిర్మాతలు ఆ జాగ్రత్తలు తీసుకున్నారా? సమ్మర్ స్పెషల్ గా వచ్చిన 'లయన్' పేరుకు తగ్గట్టు బాక్సాఫీస్ వద్ద గర్జించిందో లేదో తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే... ముంబాయిలోని రామ్ మనోహర్ హాస్పిటల్ లో కోమాలో ఉన్న గాడ్సే ఎనిమిది నెలల తర్వాత స్పృహలోకి వస్తాడు. అయితే తాను గాడ్సే కాదని, తన పేరు బోస్ అని చెబుతాడు. అంతేకాదు... తన తల్లిదండ్రుల్ని, భార్యను కూడా గుర్తు పట్టలేకపోతాడు. గానీ నువ్వు మా అబ్బాయివే అంటూ అతని తల్లిదండ్రులు రుజువులు చూపిస్తారు. అయినా నమ్మశక్యం కాని బోస్ తానెవరో తెలుసుకోవడానికి హైదరాబాద్ బయలుదేరతాడు. అక్కడ తన తల్లిదండ్రులను చూసి దగ్గరవుతాడు. కానీ వాళ్ళేమో నువ్వు మా అబ్బాయివి కావంటారు... గాడ్సే అని రూఢీ చేసే ఆధారాలు ఒకవైపు... కాదని మనసు చెప్పే మాట ఇంకోవైపు అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. ఇంతలో హైదరాబాద్ లో అతనికి ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఇక బోస్ విషయానికి వస్తే... మాజీ ముఖ్యమంత్రి అచ్యుత రామయ్య అనుమానాస్పద మృతిపై ఈ సిన్సియర్ సిబిఐ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. అది ప్రస్తుత ముఖ్యమంత్రి భరద్వాజకు ఏ మాత్రం నచ్చదు. అటువంటి పరిస్థితుల్లో బోస్ అదృశ్యమౌతాడు. మరి... ముంబై హాస్పిటల్ లో కోమాలోంచి బయటకు వచ్చింది గాడ్సేనేనా? లేక బోసా? వీరిద్దరికి అసలు ఏమిటి సంబంధం? ఎవరి పాత్రలోకి ఎవరు పరకాయ ప్రవేశం చేశారు? ఈ చిక్కుముడులను విప్పేదే మిగిలిన సినిమా! స్టార్ హీరో సినిమా కథలో కొత్తదనం లేకపోయినా... కథనం ఆకట్టుకునేలా ఉంటే... తప్పకుండా విజయం సాధిస్తుంది. కానీ ప్రయోగం పేరుతో ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ... కొత్తగా చూపాలనుకుంటే పరాజయం తప్పదు. ఓ మామూలు కథను, కొత్తగా చూపించాలనే నూతన దర్శకుడు సత్యదేవ తాపత్రయం ఈ సినిమాకు శాపంగా మారింది. మాస్ ఆడియెన్స్ కోరుకునే అన్ని హంగులకూ నిజానికి ఈ కథలో చోటు ఉంది. దాని మీద ఇంకాస్తంత హోమ్ వర్క్ చేసి ఉంటే 'లయన్' మంచి సినిమానే అయ్యేది. అయితే... డిఫరెంట్ స్ర్కీన్ ప్లే తో తెరకెక్కించాలనే దర్శకుడి ఆలోచన... అనుభవరాహిత్యం కారణంగా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. అయితే బాలకృష్ణ పోషించిన గాడ్సే పాత్ర ఆయన అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సిబిఐ ఆఫీసర్ బోస్ పాత్రను కూడా అరుపులు, కేకలకు పరిమితం చేయకుండా ఇంకాస్త పకడ్బందీగా చేసి ఉండాల్సింది. బాలకృష్ణ సరసన తొలిసారి హీరోయిన్ గా నటించి త్రిష కేవలం గ్లామర్ డాల్ గానే మెప్పించింది. ఇక రాధికా ఆప్టేకు ఉన్న అవకాశం తక్కువే. ప్రతినాయకులుగా ప్రకాశ్ రాజ్, ప్రదీప్ రావత్ బాగానే నటించారు. పోసాని కనిపించేది కాసేపే అయినా తనదైన మేనరిజంతో మెప్పించాడు. మిగిలిన నటీనటులంతా పాత్రల పరిధి మేరకు చేశారు. చాలాకాలం తర్వాత బాలకృష్ణ సినిమాకు సంగీతం సమకూర్చిన మణిశర్మ బాణీలు ఏమంత ఆకట్టుకోలేదు. అయితే నేపథ్య సంగీతంతో చాలా సన్నివేశాలకు ఆయన జీవం పోశారు. సీనియర్ ఎడిటర్ గౌతంరాజు మరి కాస్తంత చొరవ చూపి అన్ వాంటెండ్ సీన్స్ కు కత్తెర వేయాల్సింది. రంపచోడవరంలో చిత్రీకరించిన పోరాట సన్నివేశం సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆ క్రెడిట్ రామ్ లక్ష్మణ్ కు దక్కుతుంది. ఈ సినిమాలో ప్రేమ సన్నివేశాలే కాదు... కామెడీ సైతం పండకపోవడం ప్రధానమైన లోటు. స్వతహాగా బాలకృష్ణ అభిమాని అయిన నిర్మాత రుద్రపాటి రమణారావు ఖర్చుకు వెరవకుండా 'లయన్'ను నిర్మించారు. అందువల్ల తెర మీద ప్రతి సన్నివేశం గ్రాండ్ గా ఉంది. గాడ్సేగా బాలకృష్ణ అభినయం, ఆయన చెప్పిన పంచ్ డైలాగ్స్ నందమూరి అభిమానులకు ఊరటనిస్తాయి. 'సింహా', 'లెజెండ్' వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత వచ్చే ఏ సినిమా అయినా పోలికకు గురి అవుతుంది. దీనిని దృష్టి లో పెట్టుకుని మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది. కానీ అలాంటి ప్రయత్నం చేసినట్టు కనిపించదు. ఏతావాతా 'లయన్' బాలకృష్ణ మార్కు సినిమా అని చెప్పొచ్చు! రేటింగ్...3/5


Followers