మానవ హక్కుల దివిటీ మాగ్నాకార్టా


maanava hakkula diviti maagnaakaarta

గోరంత దీపం కొండంత వెలుగు..ఇది అక్షర సత్యం. మానవ హక్కుల ఉద్యమాల చారిత్రక, మహోన్నత ప్రయాణానికి మార్గనిర్దేశన చేసిన స్వేచ్ఛాయుత సామాజిక నియమావళే మాగ్నాకార్టా. ఎనిమిది శతాబ్దాల క్రితం అప్పటి ఇంగ్లాండ్ రాజు జాన్ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు ఫలితమే ఈ మహోత్కృష్ట నియమావళి. రాజైనా పేదైనా అందరూ చట్టం ముందు సమానమేనని నాటి ఇంగ్లాండ్ ప్రజానీకం నినదించింది. రాజరికం, నిరంకుశత్వం, అరాచక పాలనలపై తిరుగుబాటు చేసి అనంతర కాలంలో యావత్ ప్రపంచం మానవ హక్కులకు పట్టం కట్టడానికి దోహదం చేసింది. మానవ విలువలంటే ఏమిటో తెలియని..నిరంకుశ పాలనలో బతికేస్తూ రాజులకు సాగిలపడటమే దైనందిన జీవితంగా భావించిన రోజుల్లోనే భావి మానవ హక్కుల మహా ప్రయాణానికి ఈ నియమావళి నాందీ ప్రస్తావన చేసింది. ఆ తిరుగుబాటు మొదట్లో కొందరు వ్యక్తులు తమ హక్కుల కోసం చేసిన పోరాటమే అయినా అది అనంతర కాలంలో ఆధునిక ప్రజాస్వామ్య దేశాకు బలమైన విలువల పునాదిగా మారింది. కింగ్‌జాన్ సంతకం చేసిన మాగ్నాకార్టా ఎన్నో మార్పులకు, చేర్పులకు లోనైనా భారత్ సహా వందకు పైగా దేశాలకు విలువల కరపత్రమే అయింది. రెండు వందల కోట్ల మంది ప్రజల జీవితాలను, జీవనాన్నీ ప్రభావితం చేస్తూనే ఉంది. మానవ,ప్రజాస్వామ్య, వ్యక్తిగత స్వేచ్ఛా హక్కుల పరిరక్షణోద్యమాలకు అనునిత్యం వెలుగుదివ్వెగా భాసిల్లుతోంది. మానవ హక్కులను ఎప్పటికప్పుడు శక్తివంతంగా తీర్చిదిద్దడానికి, సరికొత్త విలువలతో ఉన్నత భావనలను పాదుగొల్పడానికి ఇది ఆధునిక సమాజంలోనూ ఎంతగానో దోహదం చేస్తోంది. స్వేచ్ఛాయుత జీవన హక్కులతో ముడివడి ఉన్న మానవీయ కోణాలను విస్తృతం చేస్తోంది. ఈ ఎనిమిది శతాబ్దాల కాలగతిలో ఎన్నో మార్పులు, ఎన్నో పరిణామాలు, ఎన్నో ఉత్కృష్ఠ ఘట్టాలు చోటుచేసుకున్నాయి. వీటిలో ప్రతీది కూడా మనిషి సాధించిన ఆలోచనాత్మక, విజ్ఞానదాయక పరిణతికి తోడ్పడింది. అందుకే..నిన్న మొన్న జరిగిన పరిణామాలనే మర్చిపోతున్న నేపథ్యంలో 1215 జూన్ 15నాటి మాగ్నాకార్టా ఇప్పటికీ నిరుపమానంగా, జాజ్వల్యంగా వెలుగుతోందంటే..ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించే దేశాలకు స్ఫూర్తిదాయక మార్గదర్శకమైందంటే..దీనికి ఉన్న ప్రాధాన్యత ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెలుగు చిన్నదే అయినా శూన్యాన్ని తరిమికొట్టడంలో అజే య శక్తే అవుతుంది. తిరుగులేని ఇంగ్లాండ్ రాజే చట్టానికి లోబడి వ్యవహరించే అనివార్య పరిస్థితిని ఈ చారిత్రక ఒప్పందం కల్పించింది. ఆ పరిణామంతో నియంతృత్వ, తిరుగులేని అధికారాలు క్రమంగా పలుచబడుతూ ప్రస్తుతం ప్రజలే ఎన్నుకునే ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఆవిర్భావానికి దారితీసింది. ఈ ఎనిమిది శతాబ్దాల్లో మాగ్నాకార్టా ఉద్దేశిత సిద్ధాంతాలు, నియమాలూ కాలానుగుణంగా మార్పులు చెందుతూ, హద్దులనూ చెరిపేసుకుని విశ్వ జనీనమైన మానవ హక్కులకు ఊతాన్నిచ్చాయి. న్యాయ, స్వేచ్ఛ, ప్రజాస్వామ్య వ్యవస్థలు, రాజ్యాంగాలూ శక్తివంతం కావడానికి దోహదం చేశాయి. భారత రాజ్యాంగానికి, అందులోని అత్యంత వౌలికమైన ప్రాథమిక హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛ్భావనలకు మాగ్నాకార్టానే స్ఫూర్తిదాయకమని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు. ఒక్క భారత దేశమే కాదు, ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న అమెరికా రాజ్యాంగ రూపకల్పనలోనూ మాగ్నాకార్టా ముద్ర స్పష్టం. మానవ హక్కులు, పౌర హక్కులకు అగ్రరాజ్య రాజ్యాంగం తిరుగులేని పునాదులు వేయగలిగిందంటే..వీటి పరిరక్షణ విషయంలో రాజీలేకుండానే కొనసాగుతోందంటే అందుకు మాగ్నాకార్టా అందించిన స్ఫూర్తే నిదర్శనం. చట్ట పాలన ఎలా ఉండాలో చెప్పడమే కాకుండా, నియంతల అధికారాలకూ ఈ మహా నియమావళి కత్తెర వేసింది. నేడు మనం చెప్పుకుంటున్న మహిళా సమానత్వ హక్కులకూ ఎనిమిది శతాబ్దాల క్రితమే పునాది పడిందన్న నిజం ఈ మహోన్నత హక్కుల పత్రాన్ని విశే్లషిస్తే స్పష్టమవుతుంది. అన్ని విధాలుగా ఎంతో పరిణతి చెందిన ప్రజాస్వామ్య వాతావరణంలో జీవిస్తున్న మానవాళికి హక్కుల పరంగా, అధికారాల పరంగా ఇతరత్రా కూడా వారి స్వేచ్ఛాయుత జీవనానికి గండి కొట్టే అవాంఛనీయ పరిణామాలెన్నో చోటుచేసుకుంటున్నాయి. మహిళలు రక్షణ కోసం, విద్యార్థులు హక్కుల కోసం, కార్మికులు వేతనాల కోసం, నిరుద్యోగులు ఉపాధి కోసం చేస్తున్న చేస్తున్న ఆక్రందనలకు మూలం మాగ్నాకార్టానే. భారత రాజ్యాంగం, పౌర హక్కుల రూపకల్పనలో మాగ్నాకార్టా కనబరిచిన ప్రభావం తిరుగులేనిదే. దేశ ప్రజలకు ప్రాధమిక హక్కులను, స్వేచ్ఛనూ కల్పిస్తున్న రాజ్యాంగ 21వ అధికరణకు మాగ్నాకార్టానే మూలమని ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు స్పష్టం చేసిన విషయాన్ని ఈ నేపథ్యంలో ప్రస్తావించడం ఎంతైనా సముచితం. 'న్యాయపాలనలో జాప్యం జరుగకూడదు.ఎవరికీ అన్యాయం జరుగకూడదు.న్యాయం అమ్ముడు పోకూడదు'అన్న ఉదాత్త భావనలను నాడే ప్రోదిచేసుకున్న మాగ్నాకార్టా ప్రపంచ హక్కుల ఉద్యమాలన్నింటికీ దివిటీగానే పని చేసింది. ప్రజాస్వామ్య ప్రస్థానాలనూ, రాజ్యాంగాల ఆవిర్భావాన్ని, అత్యంత వౌలికమైన మానవీయ భావనలను బలంగా పాదుగొల్పే ప్రయత్నంలో మార్గదర్శనే కాదు, నిర్దేశనా చేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ప్రజల ప్రాథమిక హక్కులకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో, రాజ్యాంగ పరమైన, పాలనాపరమైన విధానాలను మానవీయ కోణంలో రూపొందించుకోవాల్సిన అవసరమూ అంతే ఉంటుంది. భారత దేశ చట్ట, న్యాయ పాలనకు సంబంధించి అనేక కోణాల్లో మాగ్నాకార్టా స్ఫూర్తిదాయకమే అయింది. మిగతా దేశాల మాట ఎలా ఉన్నా మాగ్నాకార్టా భారత స్వాతంత్య్రోద్యమానికి తిరుగులేని శక్తిని అందించింది. ఆంగ్ల పాలకులపై రాజకీయ స్వేచ్ఛ కోసం మహాత్మాగాంధీ సాగించిన పోరాటానికి మాగ్నాకార్టానే మూలం. రాజకీయ హక్కుల సాథన, స్వేచ్ఛ సముపార్జన తమకు ముఖ్యమని చాటిచెప్పిన గాంధీ ఆ దశగానే దేశాన్ని ముందుకు నడిపించారు. ఆ మహోద్యమం ఫలించి భారతావని సర్వసత్తాక గణతంత్య్ర ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవించడానికి మూలం కూడా మాగ్నాకార్టానే. మూడువేల పదాలు, ఎన్నో నిబంధనలతో కూడిన మాగ్నాకార్టా నుంచే భారత రాజ్యాంగం మానవ హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రజాసామ్య విలువల వంటి ఉన్నత భావనలను పుణికి పుచ్చుకోగలిగింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో అమలులో ఉన్న రాజ్యాంగాలను క్రోడీకరించే దేశ రాజ్యాంగాన్ని నిర్మించుకున్నా..ఈ మొత్తం ప్రయత్నం వెనుక మాగ్నాకార్టా ప్రభావం చాలా స్పష్టం. 12శతాబ్ద కాలం నాటి సామాజిక, ఆర్థిక,రాజరిక, నిరంకుశ పరిస్థితుల పరీక్షలు నెగ్గి ఎప్పటికప్పుడు పునీతమవుతున్న మాగ్నాకార్టా తరగని వెలుగు దివ్వె. మానవ జాతి ఉన్నంత వరకూ, ఆక్రమణలు, అణచివేతలు, హక్కుల ఉల్లంఘనలు పేట్రేగుతున్నంత వరకూ ఇది తిరుగులేని స్ఫూర్తి మంత్రమే అవుతుంది. అంతిమంగా మానవ జాతి నాగరికంగా పరిణతి చెందడానికి, మానవీక కోణంలో రాణించడానికీ మాగ్నాకార్టా సాగించిన శతాబ్దాల ప్రయాణం నిరంతరం వెలుగుబాటను పట్టిస్తూనే వచ్చింది. మార్పు గుణాత్మకమైతే అది విలువలను ప్రోది చేస్తుంది. పరివర్తనాయుతమైన జీవన విధానానికి ప్రేరణ అవుతుంది. మాగ్నాకార్టాను ఈ కోణంలోనే పరిగణించాలి. అందులో ప్రవచించిన ప్రతి నిబంధన, ప్రతి డిమాండ్ ఆధునిక నాగరిక ప్రపంచావిష్కరణకు విశేషంగానే దోహదం చేసింది. మానవాళి చరిత్రలో ఎన్నో మధుర ఘట్టాలున్నాయి. ఎన్నో ఉత్కృష్ఠ పరిణామాలూ ఉన్నాయి. వీటిలో కొన్ని మాయని మచ్చలుగా మిగిలిపోతే ఇంకొన్ని సరికొత్త చరిత్రనే సృష్టించాయి. చారిత్రక గమనాన్ని నిర్దేశించడమే కాదు..అసలు ఉన్నతమైన జీవన ప్రమాణం ఏమిటో ప్రబోధించాయి. అదే క్రమంలో విలువలతో కూడిన ఉన్నత భావనలకూ ఉద్దీపనగా నిలిచాయి. ఇలాంటి ఘట్టాలెన్నింటినో తనలో ఇముడ్చుకుంటూ, ఎప్పటికప్పుడు నిగ్గుదేలుతూ సాగిన మానవ హక్కుల మహా ప్రయాణమే మాగ్నాకార్టా. కాలమేదైనా, పాలనా విధానమేదైనా..పాలకుల ధోరణులు ఒక్కటే రీతిలో ఉంటాయి. నాటి నిరంకుశ పాలకుడు కింగ్‌జాన్‌పై జరిగిన తిరుగుబాటుకు హక్కుల సాధనే కార ణం. చట్టాలు అందరికీ సమానమన్నదే మూ లం. నేడూ అలాంటి పరిస్థితులు,సవాళ్లనే మానవాళి ఎదుర్కొంటోంది. దేశమేదైనా హక్కులకు దిక్కులేని పరిస్థితులు నేడూ అన్ని చోట్లా కనిపిస్తున్నాయి. ఎనిమిది శతాబ్దాలను పూర్తి చేసుకుంటున్న మాగ్నాకార్టానే ఇలాంటి హక్కుల ఉద్యమాలకు స్ఫూర్తి. ప్రాథమిక హక్కుల సాధనకు ఎనలేని దీృప్త. చిత్రం... మాగ్నాకార్టాపై సంతకం చేస్తున్న కింగ్ జాన్

Followers