వనితా.. శతకోటి వందనం!


వనితా.. శతకోటి వందనం! 

 


ఎన్నెన్ని ఆశలో.. ఎన్నెన్ని అంచనాలో.. ఆ ఆశలు, అంచనాలు కుప్పకూలిపోతున్న వేళ.. ఎంత నైరాశ్యమో.. ఎన్ని నిట్టూర్పులో! అంచనాలు 'పతకాల' స్థాయి నుంచి 'పతకం' వరకు పడిపోయి.. అసలు రియోలో భారత్‌ ఖాతా అయినా తెరుస్తుందా అని సందేహంగా చూస్తున్న సమయంలో.. పతక కరవు తీర్చేదెవరని ఆశగా చూస్తున్న తరుణంలో.. ఒకరికి ఇద్దరు వచ్చారు.. ధీర వనితలు! ఒకరు దేశం గాఢ నిద్రలో ఉన్న సమయంలో అసాధారణ పోరాట పఠిమను ప్రదర్శిస్తూ భారత్‌ను పతకాల పట్టిక ఎక్కిస్తే.. ఇంకొకరు దేశమంతా కళ్లు విచ్చుకుని చూస్తుండగా ఉర్రూతలూగించే ఆటతో పతకానందాన్ని రెట్టింపు చేశారు. ఒక్క పతకం.. ఒక్క పతకం..
అంటూ పన్నెండు రోజుల పాటు నిట్టూర్చిన భారతావని.. ఒక్క రోజు వ్యవధిలోనే రెండు పతక ప్రదర్శనలతో మురిసిపోయింది. 'పతక' ఆకలితో నకనకలాడుతున్న భారత క్రీడాభిమానులకు ఆమె దాహం తీరిస్తే.. ఈమె విందే చేయించింది.

హరియాణా కుస్తీ నారి సాక్షి మలిక్‌ అసామాన్యమైన 'పట్టు'దల.. హైదరాబాదీ బ్యాడ్మింటన్‌ తార పూసర్ల వెంకట సింధు అసాధారణ 'రాకెట్‌' వేగం.. రియో ఒలింపిక్స్‌లో భారత్‌ను పతక సంబరంలో ముంచెత్తాయి. సాక్షి అద్భుత పోరాటంతో కాంస్యం గెలిస్తే..

మన తెలుగు తేజం సింధు మరింత గొప్ప ప్రదర్శనతో కనీసం రజతం ఖాయం చేసింది. ఒలింపిక్స్‌లో 'కంచు'ను మించిన ప్రదర్శన చేసిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించిన సింధును స్వర్ణమూ వూరిస్తోంది. ఆమె ప్రదర్శన ఇంకా అయిపోలేదు. శుక్రవారమే పసిడి పోరు.

గురువారం మైదానంలో సింధు కసి.. ఆమె ఆధిపత్యం చూస్తే.. పసిడి అత్యాశేమీ కాదనిపిస్తోంది. మరి మన సింధు మరో అద్భుతం చేస్తుందా..

భారత క్రీడా చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖిస్తుందా?


Followers