తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం



పరిచయం: అసమానత్వం అశాంతికి చిహ్నం. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక వెనుకబాటుతనం ప్రశాంతతను భంగపరుస్తుంది. అది ప్రజల ఆకాంక్షలను సంతృప్తిపర్చదు. ఆ అసంతృప్తి, అన్యాయంపై పోరాడటానికి వారిని ఉద్యుక్తులను చేస్తుంది. తమ ఆస్తిత్వానికి ఎదురుదెబ్బతగిలినప్పుడు ఆ ప్రజల ఆక్రోశం హింసాత్మకంగా మారి సమాజమనుగడను ప్రశ్నిస్తుంది. ఇలాంటి పరిణామాలే తెలంగాణ సమాజంలో చోటు చేసుకున్నాయి. తమ ప్రత్యేక ఉనికిని, గుర్తింపును కాపాడుకునే క్రమంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనోద్యమం ఊపిరిపోసుకుంది. కానీ, పైన చెప్పినట్టు కాకుండా తెలంగాణ ప్రజలు నూతన అహింసాత్మక ఉద్యమరూపాలతో, సుదీర్ఘ శాంతియుత పోరాటంతో తమ లక్ష్యాలను నెరవేర్చుకున్నారు. ఎందరో అమరవీరుల త్యాగాలతో తెలంగాణ ప్రజల చిరకాల కల 2014 జూన్ 2న సాకారమైంది. ఆ రోజున భారతదేశంలో 29వ రాష్ట్రంగా ‘‘ తెలంగాణ’’ నూతనంగా ఆవిర్భవించింది.
ముఖ్యాంశాలు:
  • హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు మొదటి సారిగా 1952లో ఎన్నికలు జరిగాయి. ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు ఎన్నికయ్యారు..
  • మద్రాస్ రాష్ట్రం నుంచి 1953లో విడిపోయిన ఆంధ్రరాష్ట్రం మొదటి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం ఎన్నికయ్యారు.
  • తెలుగు మాట్లాడే ప్రాంతాలు ఒకే రాష్ట్రంగా ఏర్పడాలనే కోరికతో ఆంధ్రరాష్ట్రం నుంచి ‘‘విశాలాంధ్ర’’ ఉద్యమం మొదలైంది.
  • రెండు రాష్ట్రాల నాయకుల మధ్య 1956 ఫిబ్రవరి 20న ‘‘పెద్దమనుషుల ఒప్పందం’’ జరిగి నవంబర్ 1, 1956న ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.
  • ఈ ఒప్పందంపై ఆంధ్రాప్రాంతం నుంచి బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, గౌతులచ్చన్న, అల్లూరి సత్యనారాయణ రాజులు,తెలంగాణ నుంచి బూర్గుల రామకృష్ణారావు, మర్రిచెన్నారెడ్డి, జె.వి. నర్సింగరావు, కె.వి రంగారెడ్డి లు సంతకాలు చేసి 14 అంశాలపైన అంగీకారానికి వచ్చారు.
  • పై ఒప్పందంలోని పలు అంశాలను విస్మరించడం వల్ల 1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైంది. తెలంగాణ వారిని సంతృప్తిపరచడం కోసం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 8 సూత్రాల పథకాన్ని సూచించారు.
  • తెలంగాణ ఉద్యమానికి ప్రతిస్పందనగా సీమాంధ్ర ప్రాంతంలో 1972లో ‘‘జై ఆంధ్ర ఉద్యమం’’ మొదలైంది. అందుకు ప్రతిగా కేంద్ర ప్రభుత్వం 1973లో 6 సూత్రాల పథకం రూపొందించింది. వాటిలోని అంశాలు పెద్ద మనుషుల ఒప్పందానికి వ్యతిరేకంగా ఉండడం వల్ల తెలంగాణ తన ప్రత్యేక అస్తిత్వాన్ని కోల్పోయింది.
  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు అన్యాయానికి గురైయ్యారు. అన్ని వనరులు సీమాంధ్ర ప్రాంతం వారే అనుభవించడం వల్ల తెలంగాణ ప్రజలు అసంతృప్తికిలోనయ్యారు. 1990లో జరిగిన వరంగల్ రైతు కూలీ సంఘం బహిరంగ సభతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తిరిగి ప్రారంభమైంది.
  • 2001 ఏప్రిల్ 27న కె.చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో ‘‘తెలంగాణ రాష్ట్ర సమితి’’ (టీఆర్‌ఎస్) రాజకీయ పార్టీ ఏర్పడింది. ఈ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ప్రధాన ఎజెండాగా ప్రజలను ముందుకు నడిపింది.
  • 2009 నవంబరు 29న కె.చంద్రశేఖర్‌రావు ఆమరణ నిరాహార దీక్ష చేయడంతో ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి 2009 డిసెంబరు 9న ‘‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర’’ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.
  • ఆంధ్ర నాయకుల ఒత్తిడితో 2009 డిసెంబరు 23న కేంద్రం తన డిసెంబరు 9న చేసిన ప్రకటనను ఉపసంహరించుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని పరిణామాలపై అధ్యయనం చేయడానికి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేశారు.
  • ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పక్షాలు, సంస్థలు ఏకమై ‘‘తెలంగాణ ఐక్యకార్యాచరణ కమిటి’’ గా ఏర్పడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని తీవ్ర తరం చేశాయి. దాని ఫలితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రాంతం విడిపోయి 2014 జూన్ 2న కొత్త రాష్ర్టంగా రూపుదిద్దుకుంది.
కీలక పదాలు - నిర్వచనాలు:
  1. భాష ప్రాయుక్త రాష్ట్రాలు: ఒకే భాషను మాట్లాడే ప్రాంతాలన్ని ఒకే రాష్ట్రంగా ఏర్పాటు చేయడం. ఈ ప్రాతిపదికపై ఏర్పడిన తొలి రాష్ట్రం ‘ఆంధ్రరాష్ట్రం’ (1953).
  2. పెద్దమనుషుల ఒప్పందం: ఆంధ్ర రాష్ట్రానికి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన 8 మంది పెద్దమనుషులు (నాయకులు) ఢిల్లీలోని ‘హైదరాబాద్ అతిథి గృహంలో సుధీర్ఘంగా చర్చించి రెండు ప్రాంతాల విలీనానికి 1956 ఫిబ్రవరి 20న ఒప్పందం కుదుర్చుకున్నారు. తెలంగాణ ప్రజల భ్రమలను పోగొట్టడానికి వీరు 14 అంశాలపైన అంగీకారానికి వచ్చారు.
  3. ముల్కీ నిబంధనలు: ముల్కీ అనే ఉర్దూ పదానికి అర్థం ‘స్థానిక’. స్థానికంగా ఉన్న ఉద్యోగాలలో స్థానికులనే నియమించాలని ముల్కీ నిబంధనాన్ని హైదరాబాద్ నిజాం ప్రవేశపెట్టారు. పెద్ద మనుషుల ఒప్పందం కూడా వీటిని ఆమోదించింది. కాని ఆచరణలో ఈ నియమాలను పట్టించుకోకపోవడం వల్ల తెలంగాణ ప్రజలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్యాయం జరిగి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం చెలరేగింది.
  4. జై ఆంధ్ర ఉద్యమం: 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ప్రతిగా సీమాంధ్ర ప్రాంతంలో 1972లో ‘‘జై ఆంధ్ర’’ ఉద్యమం మొదలైంది. తెలంగాణ లోని ముల్కీ నిబంధనల వల్ల తమ అవకాశాలు సన్నగిల్లుతాయని భావించిన సీమాంధ్ర విద్యార్థులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాన్ని కొనసాగించారు. వీరి కోరికలను సంతృప్తి పరుస్తూ 1973లో కేంద్ర ప్రభుత్వం ఆరు సూత్రాల విధానాన్ని ప్రకటించడంతో ఈ ఉద్యమం చల్లారింది.
  5. శ్రీకృష్ణ కమిటి: ఆంధ్రప్రదేశ్‌లోని పరిణామాలను అధ్యయనం చేసి పరిష్కారాలను సూచించడానికి కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు న్యాయమూర్తి బి.ఎన్.కృష్ణ ఆధ్వర్యంలో 2010లో ఫిబ్రవరి 3న ఒక కమిటిని నియమించింది. శ్రీకృష్ణ కమిటి తన 505 పేజీల నివేదికను 2011 జనవరి 6న కేంద్రానికి అందించింది.
  6. సకల జనుల సమ్మె: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు తెలంగాణ లోని అన్ని వర్గాల ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు, రైతులు అనేక రకాలుగా నిరసనలు తెలిపి సమ్మె చేశారు. ఇది సకల జనుల సమ్మెగా ప్రసిద్ధి చెందింది. సెప్టెంబరు 13, 2011 నుంచి 42 రోజుల పాటు శాంతియుతంగా జరిగిన ఈ సకల జనుల సమ్మె ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగు వేయడానికి దోహదపడింది.
ముఖ్యమైన ప్రశ్నలు - జవాబులు: 4 మార్కులు
1. పెద్ద మనుషుల ఒప్పందంలోని ప్రధానాంశాలను పేర్కొనండి.
జ: పెద్దమనుషుల ఒప్పందం:-
తెలుగు మాట్లాడే రెండు ప్రాంతాలను విలీనం చేసి ఒకే రాష్ట్రంగా మార్చాలని అటు ఆంధ్రరాష్ట్రంలోని నాయకులు ఇటు హైదరాబాద్ రాష్ట్రంలోని కొందరు తెలంగాణ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ఆరంభించారు. కేంద్రం అందుకు ఒప్పుకుని రెండు ప్రాంతాలకు చెందిన ముఖ్యమైన నాయకులైన బి.గోపాల్‌రెడ్డి, ఎన్.సంజీవరెడ్డి, జి.లచ్చన్న, ఎ.సత్యనారాయణరాజు (ఆంధ్ర ప్రాంతం), బి.రామకృష్ణారావు, ఎం.చెన్నారెడ్డి, జి.వి.నర్సింగరావు, కె.వి.రంగారెడ్డి (తెలంగాణ )లను ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో సమావేశపర్చి ఒక అంగీకారానికి రావాలని సూచించింది. 1956 ఫిబ్రవరి 20న వీరు సమావేశమై 14 అంశాలపైన ఒప్పందానికి వచ్చి ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు. ఆ ఒప్పందం ప్రకారమే నవంబరు 1, 1956న ‘ఆంధ్రప్రదేశ్’ అవతరించింది.

ఈ ఒప్పందంలోని ముఖ్యాంశాలు:
  • తెలంగాణ లోని రెవెన్యూ మిగులుని తెలంగాణ అభివృద్ధికి మాత్రమే ఉపయోగించాలి.
  • తెలంగాణ లో 12 సంవత్సరాలు నివసిస్తే ముల్కీ నిబంధనలకువారు అర్హులు అవుతారు.
  • తెలంగాణ అభివృద్ధికి 20 మందితో చట్టబద్ధమైన తెలంగాణ ప్రాంతీయ సంఘాన్ని ఏర్పాటు చేయాలి.
  • ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందంలో 40 శాతం తెలంగాణ నుంచి, 60 శాతం ఆంధ్ర ప్రాంతం నుంచి సభ్యులు ఉండాలి.
  • ముఖ్యమంత్రి ఆంధ్ర నుంచి ఉంటే ఉపముఖ్యమంత్రి తెలంగాణ నుంచి ఉండాలి.
  • తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల్లో తెలంగాణ వారికే ప్రవేశాలివ్వాలి.
1969లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ప్రారంభమవడానికి ఈ ఒప్పందం ఏ విధమైన కారణం కాదు. ఈ ఒప్పందంలోని చాలా అంశాలు అమలుపర్చక పోవడం వల్ల, అలాగే ఆంధ్ర ప్రాంతనాయకులు ఈ అంశాలను ఉల్లంఘించడం వల్ల తెలంగాణా ప్రజల్లో వారిపై అపనమ్మకం, వ్యతిరేకత పెరిగి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఉద్భవించింది.

2. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రజల్లో అసంతృప్తి పెరగడానికి దోహదపడిన అంశాలను తెలపండి? (విషయావగాహన)
జ: తెలంగాణ ప్రజల్లో అసంతృప్తికి కారణాలు
:-
  • రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దమనుషుల ఒప్పందంలోని కీలక అంశాలను విస్మరించాయి.
  • జై ఆంధ్ర ఉద్యమాన్ని చల్లార్చాడానికి కేంద్ర ప్రభుత్వం 1973లో రూపొందించిన ‘6 సూత్రాల విధానం’ తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి కమిటిల ఏర్పాటును, ముల్కీ నిబంధనలకు నిలిపివేసింది.
  • ప్రణాళికబద్ధ అభివృద్ధి ఫలాలు తెలంగాణ కంటే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు చేజిక్కించుకున్నాయి.
  • తెలంగాణ లోని వనరులను, ఉపాధి అవకాశాలను సీమాంధ్ర ప్రాంతీయులు సొంతం చేసుకుంటున్నారని తెలంగాణ యువత భావించారు.
  • స్థూల సాగు విస్తీర్ణం 1955-56లో ఆంధ్ర ప్రాంతంలో 4.2 మిలియన్ హెక్టార్లు ఉండగా 2006-07లో 5.3 మి.హె.కు (వృద్ధి 20 శాతం) పెరిగింది. అదే కాలంలో తెలంగాణ లో 4.8 మి.హె. నుంచి 5 మి.హె.కు (వృద్ధి శాతం 5) మాత్రమే పెరిగింది.
  • 1993-94లో రెండు ప్రాంతాల్లోను గ్రామీణ రైతుకు లభించే ఆదాయం 7800 రూపాయలు ఉండాగా 2007-08లో ఆంధ్ర రైతుకు రూ.11,800 ఆదాయం ఉంటే తెలంగాణ రైతు పదివేల రూపాయల ఆదాయం మాత్రమే పొందాడు.
  • అదే కాలంలో తెలంగాణ లో వ్యవపాయ కూలీల సంఖ్య 38 శాతం నుంచి 47 శాతానికి పెరిగితే ఆంధ్రలో 1 శాతం మాత్రమే పెరిగింది.
  • వ్యవసాయంలో సంక్షోభం వల్ల 2004-05లో ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 1068 రైతుల ఆత్మాహత్యలు జరిగితే అందులో 663 మంది తెలంగాణ వారే ఉన్నారు.
  • 2001 లెక్కల ప్రకారం ఆంధ్రలో అక్షరాస్యత 63 శాతం ఉంటే తెలంగాణ లో 53 శాతం మాత్రమే ఉంది.
  • కళాశాల విద్యకు గ్రాంటు తెలంగాణాకు 93 కోట్ల రూపాయలు కేటాయించగా ఆంధ్రకి 224 కోట్ల రూపాయలు ఉంది.
  • వివక్షతతో కూడిన ఈ ముఖ్యమైన కారాణాలతో పాటు అసమాన అభివృద్ధి కూడా తెలంగాణ ప్రజలను కృంగదీసింది. సామాజికంగా, సాంస్కృతికంగా ద్వితియ శ్రేణి పౌరులుగా మారుతున్నామన్న ఆలోచన తెలంగాణ విద్యావంతుల్లో పెరిగిపోయింది. వివక్షతలు లేని తెలంగాణ రూపకల్పనకు ప్రత్యేక రాష్ట్ర సాధన అంతిమ పరిష్కారమని తెలంగాణ ప్రజలు భావించారు.
2 మార్కుల ప్రశ్నలు
1. నూతనంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నీ ఇచ్చే సూచనలేంటి? (సమకాలీన అంశాలపై స్పందన)
జ: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుండడానికి నేనిచ్చే సూచనలు:-
  • తెలంగాణలోని అపార వనరులను ఉపయోగించి అన్ని ప్రాంతాలను, వర్గాలను సమానంగా అభివృద్ధి చేయాలి.
  • ఉపాధి అవకాశాలను పెంచి నిరుద్యోగ యువతను సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలి.
  • నీటి పారుదల వసతులను, విద్యుచ్ఛక్తి సరిపడ అందించి వ్యవసాయ సాగుభూమి విస్తీర్ణాన్ని, ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచాలి.
  • పభుత్వం గామీణ రైతులకు సంఘటితరంగ వ్యవసాయ రుణాలను కాలానుగుణంగా అందించి వారికి ఆర్థిక పరిపుష్టి కలిగించాలి.
  • విద్యా, ఆరోగ్య మౌలిక వసతులను ప్రతి మారుమూల ప్రాంతానికి కల్పించి తెలంగాణ ను ‘విజ్ఞాన తెలంగాణ’ , ‘ఆరోగ్య తెలంగాణ’గా మార్చాలి.
  • ప్రభుత్వ పాలనలో పారదర్శకత పెంచి అశ్రీతపక్షపాతాన్ని, అలసత్వాన్ని, అవినీతిని రూపుమాపాలి.
2. తెలంగాణ ఐక్యకార్యాచరణ కమిటి చేసిన ముఖ్యమైన ఆందోళనలు, అవి జరిగిన తీరు, తేదీలను సేకరించి రాయండి. (సమాచార సేకరణ నైపుణ్యాలు)
:అన్ని రాజకీయ పక్షాలను, సంస్థలను ఏకం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ‘తెలంగాణ ఐక్యకార్యాచరణ సంస్థ’ వివిధ రూపాలలో ఆందోళనలు నడిపింది. అవి:-
1. సహాయ నిరాకరణోద్యమం 2011, ఫిబ్రవరి 17 నుంచి సుమారు 3 లక్షల మంది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు 16 రోజుల పాటు తమ నిరసనలతో ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేశారు.
2. మిలియన్ మార్చ్ 2011, మార్చి 10న 50 వేల మంది ఉద్యమకారులు టాంక్ బండ్ (హైదరాబాద్) పై మిలియన్ మార్చ్‌ను నిర్వహించారు.
3. సకల జనుల సమ్మె సెప్టెంబరు 13, 2011 నుంచి అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు, వృత్తి నిపుణులు 42 రోజుల పాటు సమ్మె చేశారు.
4. సాగర హారం సెప్టెంబరు 30, 2012న సుమారు 2 లక్షల మందితో హుస్సేన్ సాగర్ చుట్టూ మానవహారం నిర్వహించారు.

1 మార్కు ప్రశ్నలు
1. కోస్తా ఆంధ్ర ప్రాంతం అభివృద్ధి చెంది ఉండడానికి ప్రధాన కారణం ఏమిటి? (విషయావగాహన)
జ:
కోస్తా ఆంధ్ర ప్రాంతం తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన ప్రాంతంగా గుర్తింపు పొందింది. అందుకు ప్రధాన కారణాలు:-
  • కోస్తా ప్రాంతం బ్రిటిష్ ప్రత్యక్ష పాలన కింద ఉండడం వల్ల అక్కడ ఆంగ్ల విద్య అందుబాటులోకి వచ్చింది. తద్వారా విద్యావంతులు పెరిగి ఆధునీకీకరణ చెందింది.
  • నదులు ఏర్పరిచిన డెల్టా ప్రాంతం, కాలువల ద్వారా సాగునీటి సదుపాయం ఉండడం వల్ల వ్యవసాయం అభివృద్ధి చెందింది.
  • రైలు రవాణా, ఓడరేవుల సదుపాయాలు, రహదారి వ్యవస్థ విస్తరించి ఉండడం వల్ల కూడా కోస్తా ఆంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందిందిగా గుర్తిస్తున్నారు.
2. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేసిన రాజకీయేతర సంస్థలను తెలపండి? (సమాచార సేకరణ)
జ:
ప్రత్యేక తెలంగాణ  రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన రాజకీయేతర సంస్థలు:-
 - తెలంగాణ జనపరిషత్, తెలంగాణ మహాసభ, తెలంగాణ జనసభ, తెలంగాణ ఐక్యవేదిక.

3. తెలంగాణ ఉద్యమంలోని వివిధ నిరసన రూపాలను తెలపండి? (విషయావగాహన)
జ: ప్రజలను సమీకరించడానికి ప్రత్యక్ష తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సంస్థలు వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తికరించాయి. అవి:

- తెలంగాణ ధూంధాం, తెలంగాణ గర్జన, పాదయాత్రలు, బోనాలు, రహదారులపై వంట వార్పు, మానవహారాలు, సడక్‌బంద్‌లు, రైల్‌రోకోలు, సహపంక్తి భోజనాలు, మిలియన్ మార్చ్, సాగరహారం, చలో అసెంబ్లీ, సకల జనుల సమ్మె మొ॥

అబ్జెక్టివ్
1. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ఏ రోజున ఆవిర్భవించింది... ( a )
a) 2001 ఏప్రిల్ 27
b) 2001 మార్చి 9
c) 2001 మార్చి 30
d) 2002 ఏప్రిల్ 1న

2. హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర భారతదేశంలో విలీనం చేసిన సంఘటనను ఏమని పిలుస్తారు.... ( c )
a)  ఆపరేషన్ సక్సెస్ 
b) ఆపరేషన్ కోబ్రా
c) ఆపరేషన్ పోలో
d) ఆపరేషన్ సైనిక్

3. ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి ......  ( b)
a)  నీలం సంజీవరెడ్డి
b) టంగుటూరి ప్రకాశం పంతులు
c)బెజవాడ గోపాల్‌రెడ్డి
d) బూర్గుల రామకృష్ణారావు

4. హైదరాబాద్ రాష్ట్ర మొదటి, చివరి ముఖ్యమంత్రి.....  ( c )
a) జి.ఎన్.చౌదరి
b) ఎం.కె.వెల్లోడి
c) బూర్గుల రామకృష్ణారావు
d) నీలం సంజీవరెడ్డి

5. పెద్దమనుషుల ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగింది.....  ( a )
 a) ఆంధ్ర, తెలంగాణ నాయకుల మధ్య
 b) ఆంధ్ర, తెలంగాణ, ఢిల్లీ నాయకుల మధ్య
 c) ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య
 d) ఆంధ్ర, తెలంగాణలకు చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకుల మధ్య

6. పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గంలో తెలంగాణ వారు ఎంత శాతం మంది ఉండాలి.......  ( c )
a) 50
b) 60
c) 40
d) 30
 
7. ముల్కీ నిబంధనలు దేనికి సంబంధించినవి...... ( a )
a) ఉద్యోగాలకు
b) నివాసానికీ
c) రాజకీయపదవులకు
d) స్థానికతకు

8. ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ఎవరు.......... ( b )
a) బూర్గుల రామకృష్ణారావు, నీలం సంజీవరెడ్డి
b) నీలం సంజీవరెడ్డి, కె.వి.రంగారెడ్డి
c) మర్రి చెన్నారెడ్డి, దామోదరం సంజీవయ్య
d) బి.గోపాల్‌రెడ్డి, మర్రి చెన్నారెడ్డి

9. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదట ఏ సం॥మొదలైంది..........  ( a )
a) 1969
b) 1971
c) 1973
d) 1974

10. కింది వారిలో తెలంగాణ ప్రజా సమితి నాయకుడు ఏవరు? ......  ( c )
a) ఆలే నరేంద్ర
b) కె.చంద్రశేఖర్‌రావు
c) మర్రి చెన్నారెడ్డి
d) విజయశాంతి

11. ఆంధ్రప్రదేశ్‌లోని పరిణామాలను అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటి.......... ( c )
a) ఫజల్‌ఆలీ కమిటి
b) వాంభూ కమిటి
c) కృష్ణ కమిటి
d) కమలనాథన్ కమిటి

12. వరంగల్‌లోని మేధావులు ‘తెలంగాణ విద్రోహదినాన్ని’ ఏ రోజున పాటించారు.....(  a )
a) నవంబరు 1, 1996
b) నవంబరు 1, 2000
c) నవంబరు, 2001
d) నవంబరు, 2009

13. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రకటనను ఏ రోజున చేసింది...... (  b )
a) డిసెంబర్ 7
b) డిసెంబర్ 9
c) డిసెంబర్16
d) డిసెంబర్23

14. 2009 నవంబర్ 29న కె.చంద్రశేఖర్‌రావు తన ఆమరణ నిరాహార దీక్షను ఎక్కడ నిర్వహించారు .....( d )
a) సిద్దిపేట
b) హైదరాబాద్
c) వరంగల్
d) ఖమ్మం

15. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటున్నాము...... ( b )
a) జనవరి 4
b) జూన్ 2
c) జూన్ 14
d) డిసెంబరు 9


Tags:  తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం  తెలంగాణ ఉద్యమం చరిత్ర  తెలంగాణ ఉద్యమ చరిత్ర  తెలంగాణ చరిత్ర pdf  తెలంగాణ కవులు  తెలంగాణ ఉద్యమ పాటలు  తెలంగాణ ఉద్యమం పాటలు  తెలంగాణ సంస్కృతి  తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం

Followers