మిషన్ కాకతీయ, తెలంగాణ హరితహారం


చెరువులు... పాడి పంటలకు పట్టుకొమ్మలు. కాకతీయుల కృషితో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో గొలుసు కట్టు చెరువులు అభివృద్ధి చెందాయి. అనంతర కాలంలో పాలకుల నిర్లక్ష్యం, పూడిక, ఆక్రమణలు ఫలితంగా చెరువులు తమ ప్రాభవాన్ని కోల్పోయాయి. ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ కాకతీయ’తో చెరువులు తిరిగి జల సిరులను సంతరించుకుంటున్నాయి. ఇందులో భాగంగా తొలి దశలో రూ. 2,611 కోట్లు ఖర్చు చేసి, 8,217 చెరువులను పునరుద్ధరించారు. 2016, జనవరి నుంచి జూన్ వరకు రెండో దశ మిషన్ కాకతీయ చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
కృత్రిమ పద్ధతులను ఉపయోగించి, పంట పొలాలకు నీటి వసతిని కల్పించడాన్ని నీటిపారుదల అంటారు. తెలంగాణలో నీటిపారుదలకు సంబంధించి కాకతీయులు విశేష కృషి చేశారు. కాకతీయ రాజులు 12వ శతాబ్దంలో చిన్న, చిన్న నదులకు ఆనకట్టలు కట్టడం ద్వారా నీటి పారుదల సౌకర్యాలు కల్పించారు. అంతేకాకుండా వారు పెద్ద సంఖ్యలో చెరువులను కూడా తవ్వించారు.
కాకతీయులు రామప్ప చెరువు, పాకాల, లక్నవరం చెరువులు వంటి పెద్ద చెరువులనే కాకుండా చిన్న చెరువులను కూడా తవ్వించారు. కాకతీయుల అనంతరం నిజాం పరిపాలన కాలంలో నిర్మించిన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్, నిజాంసాగర్ వంటి నీటిపారుదల ప్రాజెక్టులు ప్రజల తాగు, సాగునీటి అవసరాలను తీరుస్తున్నాయి.

చెరువుల పుట్టిల్లు తెలంగాణ
  • దక్కన్ పీఠభూమిలో ఉన్న తెలంగాణ రాష్ర్టం చెరువుల నిర్మాణానికి అనువైన ప్రాంతం.
  • శాతవాహనుల కంటే ముందే తెలంగాణలో చెరువుల నిర్మాణం ఉందనడానికి చారిత్రక ఆధారాలున్నాయి.
  • కాకతీయుల కాలంలో మాత్రం చెరువుల నిర్మాణం అత్యున్నత ప్రమాణాలతో సాగినట్లు తెలుస్తోంది.
  • కాకతీయులు నిర్మించిన రామప్ప, పాకాల, లక్నవరం, ఘనవరం, బయ్యారం వంటి అనేక పెద్ద చెరువులు నేటికీ సేవలు అందిస్తున్నాయి.
  • కాకతీయుల తర్వాత తెలంగాణను పాలించిన కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీలు, వివిధ సంస్థానాధీశులు చెరువుల నిర్మాణాన్ని కొనసాగించి, వ్యవసాయ విస్తరణకు తోడ్పడ్డారు.
  • తెలంగాణలో ప్రతీ ఊరికి ఒక చెరువు తప్పనిసరిగా ఉండేది. ఒకటి కంటే ఎక్కువ చెరువులు ఉన్న గ్రామాలు తెలంగాణలో చాలా ఉన్నాయి.
  • ప్రత్యేక తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ర్ట ప్రభుత్వం పునర్నిర్మాణంపై దృష్టి సారించింది.
  • పునర్నిర్మాణం ప్రధానంగా సాగునీటి రంగంపై ఆధారపడి ఉందని భావించిన ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణకు ప్రత్యేక కార్యచరణ ప్రకటించింది.
  • చెరువుల పునరుద్ధరణ జరిగితే తెలంగాణలో వలసలు తగ్గుతాయి. గ్రామాల్లో అనేక కులవృత్తుల ప్రజలకు జీవనోపాధి లభిస్తుంది.
  • చెరువులను పునరుద్ధరించి వాటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా వ్యవసాయాభివృద్ధి సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది.
మిషన్ కాకతీయ
  • తెలంగాణలో వేల సంఖ్యలో చెరువులను తవ్వించిన కాకతీయుల స్ఫూర్తిగా రాష్ర్ట ప్రభుత్వం మిషన్ కాకతీయను ప్రారంభించింది.
  • తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 2015, మార్చి 12న నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం పాత చెరువులో ‘మిషన్ కాకతీయ’ పైలాన్‌ను ప్రారంభించారు.
  • ఈ కార్యక్రమం ద్వారా చెరువులను పునరుద్ధరించి కాకతీయుల కాలం నాటి శోభను తిరిగితెచ్చేందుకు ప్రభుత్వం దృఢసంకల్పంతో ముందుకు సాగుతోంది. మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా 46 వేలకు పైగా చెరువులను పునరుద్ధరించనున్నారు. దీని కోసం ప్రభుత్వం భారీ మొత్తంలో వ్యయం చేయనుంది.
  • 2014-15 నుంచి దశల వారీగా చెరువుల పనరుద్ధరణ జరగనుంది. ఏడాదికి ఐదో వంతు చొప్పున మొత్తం 46,531 చెరువులను పునరుద్ధరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. ఇందులో భాగంగా ‘మిషన్ కాకతీయ’ కోసం 20 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. అన్ని చెరువులను 5 ఏళ్లలో అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
జిల్లాల వారీగా చెరువుల సంఖ్య
1) మెదక్ 7,941
2) మహబూబ్‌నగర్ 7,480
3) కరీంనగర్ 5,939
4) వరంగల్ 5,839
5) నల్గొండ 4,762
6) ఖమ్మం 4,517
7) ఆదిలాబాద్ 3,951
8) నిజామాబాద్ 3,251
9) రంగారెడ్డి 2,851
మొత్తం 46,531

సంవత్సరం-ప్రతిపాదించిన చెరువులు (2014-19)
1) 2014 - 15 9,305
2) 2015 - 16 9,308
3) 2016 - 17 9,430
4) 2017 - 18 9,480
5) 2018 - 19 9,008
మొత్తం 46,531
అనుకున్న స్థాయిలో చెరువుల పునరుద్ధరణ జరిగితే 10.17 లక్షల హెక్టార్లకు సాగునీటి వసతి లభిస్తుంది.

చేపట్టనున్న కార్యక్రమాలు
  • చెరువులు, కుంటల్లోని పూడికను తొలగించి వాటి నీటి నిల్వ సామర్థ్యం పెంచడం.
  • చెరువు కట్టలను బలోపేతం చేయడం, చెరువు అలుగు, తూములకు మరమ్మత్తులు చేయడం.
  • చెరువుల్లో పెరిగిన తుమ్మచెట్లను నరికివేయడం, గుర్రపు డెక్క లొట్టపీసు మొక్కల తొలగింపు.
  • గొలుసు కట్టు చెరువులను పునరుద్ధరిస్తారు.
  • తొలగించిన పూడికను రైతుల పంట భూముల్లో చల్లుతారు.
  • చెరువు కట్ట బలోపేతానికి సరిపడా పూడికమట్టిని వాడుకోవడం.
  • అవసరమైన చోట్ల ఫీడర్ చానళ్లను రీసెక్షన్ చేయడంతో పాటు పూడిక ను తొలగిస్తారు.
  • చెరువుల శిఖం భూములను కబ్జాల నుంచి కాపాడటం.
  • మిషన్ కాకతీయ మొదటి దశలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఒక పట్టణ చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేస్తారు.
చెరువుల పునరుద్ధరణలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కార్యక్రమాలు
చెరువుల పునరుద్ధరణ వల్ల రైతులు, వ్యవసాయ కూలీలు ప్రత్యక్షంగా ప్రయోజనం పొందనున్నారు. దీంతో పాటు గ్రామాల్లోని అన్ని వర్గాల ప్రజలకు పరోక్షంగా ప్రయోజనం కలగనుంది. చెరువుల మీద ఆధారపడి జీవించే అనేక కులవృత్తులు... రజకులు, కుమ్మరులు, బేస్తవారు, కల్లు గీత కార్మికులు తదితరులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.

చెరువులు - సాంస్కృతిక కేంద్రాలు
తెలంగాణ రాష్ర్టంలో చెరువులు సాంస్కృతిక కేంద్రాలుగా కూడా విలసిల్లుతున్నాయి. తెలంగాణలో వైభవంగా జరుపుకునే బతుకమ్మ పండగను చెరువు కట్టలపైనే జరుపుకుంటారు.
జిల్లా
ఏడాదికి ప్రతిపాదించిన చెరువులు
మొత్తం చెరువులు
2014-15 2015-16 2016-17 2017-18 2018-19
కరీంనగర్ 1188 1210 1220 1200 1121 5939
ఆదిలాబాద్ 790 800 800 800 761 3951
వరంగల్ 1168 1170 1180 1200 1121 5839
ఖమ్మం 903 910 920 930 854 4517
నిజామాబాద్ 650 650 650 650 651 3251
మెదక్ 1588 1590 1600 1610 1553 7941
రంగారెడ్డి 570 500 570 600 611 2851
మహబూబ్‌నగర్ 1496 1500 1510 1510 1464 7480
నల్గొండ 952 978 980 980 872 4762
మొత్తం 9305 9308 9430 9480 9008 46531
తెలంగాణకు హరితహారం (టీకెహెచ్‌హెచ్)

  • తెలంగాణలో అడవుల విస్తీర్ణం 24 శాతంగా ఉంది. రాష్ర్ట భౌగోళిక విస్తర్ణీంలో వృక్షాల విస్తీర్ణ శాతాన్ని 33 శాతానికి పెంచటం లక్ష్యంగా ప్రభుత్వం ‘తెలంగాణకు హరితహారం’ పథకాన్ని ప్రారంభించింది.
  • ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 2015, జూలై 3న రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని ‘చిలుకూరు బాలాజీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ‘సంపంగి’ మొక్కను నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
  • కార్యక్రమంలో భాగంగా బహుళ రహదారుల పక్కన, నదులు, కాలువలు, చెరువుల గట్టుల మీద, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ప్రాంగణాల్లో, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో, హౌసింగ్ కాలనీల్లో, కమ్యూనిటీ భూముల్లో పెద్ద ఎత్తున మొక్కలు పెంచనున్నారు.
  • హరిత హారం కార్యక్రమంలో అందరినీ భాగస్వాములను చేయనున్నారు.ఇందులో భాగంగా సంబంధిత విధానాలు, చట్టాలు, పాలనాపరమైన అంశాల్లో అవసరమైన మార్పులు చేస్తారు.
  • రానున్న మూడేళ్లలో రాష్ర్ట వ్యాప్తంగా 230 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. వీటిలో 130 కోట్ల మొక్కలను నోటిఫైడ్ అటవీ ప్రాంతాలకు వెలుపల నాటాలని ప్రతిపాదించారు. ఇందులో భాగంగా 10 కోట్ల మొక్కలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) పరిధిలో, మిగిలిన 120 కోట్ల మొక్కలను రాష్ర్టంలోని మిగిలిన ప్రాంతాల్లో నాటనున్నారు.
  • అడవులను సంరక్షించటం, లైవ్ రూట్ స్టాక్‌ను ప్రోత్సహించడం ద్వారా నోటిఫైడ్ అడవుల లోపల వంద కోట్ల మొక్కలను పునరుజ్జీవింప చేయాలని నిర్ణయించారు.
  • ‘మన ఊరు - మన ప్రణాళిక (ఏంవీఎంపీ)’ కార్యక్రమం ద్వారా వచ్చే సూచనల ఆధారంగా హరితహారం కార్యక్రమంలో నర్సరీలు, మొక్కలను నాటే ప్రదేశాలను గుర్తిస్తారు.
  • ఇలా గుర్తించిన 3,888 నర్సరీల్లో 2015లో 40 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి అటవీశాఖ, వ్యవసాయ, ఉద్యానవన, గిరిజన సంక్షేమం తదితర శాఖలను కూడా కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తున్నారు.
  • 2016లో మరో 40 కోట్ల మొక్కలను నాటేందుకు భవిష్యత్ ప్రణాళికను రూపొందించారు.
  • చైనా, బ్రెజిల్ తర్వాత తెలంగాణలోనే భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.


తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి - మదింపు ప్రక్రియలు


తెలంగాణ 2014 జూన్ 2న భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది. భౌగోళికంగా ఇది పూర్తిగా దక్కన్ పీఠభూమి మధ్యభాగంలో విస్తరించి ఉంది. రాష్ట్ర విస్తీర్ణం 1,14,840 చదరపు కిలోమీటర్లు. విస్తీర్ణ పరంగా, జనాభా పరంగా ఇది దేశంలో 12వ పెద్ద రాష్ట్రం. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా 3,51,93,978 మంది. రాష్ట్రం స్థూల ఆర్థికాభివృద్ధిలో గణనీయ ఫలితాలు సాధిస్తూ ముందడుగేస్తోంది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులున్నాయి. ఈ ప్రాంత భౌగోళిక, వాతావరణ స్థితిగతులు, సహజ వనరుల లభ్యత, సామాజిక నిర్మితి తదితరాలు ఆర్థికాభివృద్ధికి సోపానాలుగా ఉన్నాయి


ఆర్థిక వ్యవస్థను ప్రధానంగా మూడు రంగాలుగా వర్గీకరించారు. అవి:
1. ప్రాథమిక రంగం (Primary Sector)
2. ద్వితీయ రంగం (Secondary Sector)
3. తృతీయ రంగం (Tertiary Sector)
వీటిని వివిధ ప్రధాన వృత్తుల ఆధారంగా విభజించారు. ఒక దేశంలోని జనాభా వివిధ వృత్తుల్లో పనిచేసే తీరును ఈ వృత్తుల వారీ విభజన తెలుపుతుంది. జాతీయ/ రాష్ట్ర ఆదాయానికి ఏయే రంగాల ద్వారా ఎంత ఆదాయం సమకూరుతుందో తెలుసుకోవడానికి, వాటి అభివృద్ధి, పెరుగుదల శాతాల్లో ఏ విధమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయో అర్థం చేసుకొని తగిన సంస్కరణలు ప్రవేశపెట్టడానికి ఈ విభజన తోడ్పడుతుంది. వివిధ ఆర్థిక రంగ అభివృద్ధి ప్రక్రియలు దేశ పురోభివృద్ధి గమనాన్ని, సామాజిక, ఆర్థిక వ్యవస్థలను అధికంగా ప్రభావితం చేస్తాయి.
ప్రాథమిక రంగంలోని ఉప రంగాలు: వ్యవసాయం, పశుసంపద - పాడి పరిశ్రమ, అడవులు - అటవీ ఉత్పత్తులు, మత్స్య పరిశ్రమ, గనులు, తవ్వకాలు.
ద్వితీయ రంగంలోని ఉప రంగాలు: వస్తూత్పత్తి తయారీ పరిశ్రమలు, నిర్మాణ రంగం, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా.
తృతీయ రంగంలోని ఉప రంగాలు: వ్యాపారం, హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, నిల్వలు, సమాచార వ్యవస్థ, రైల్వేలు, రక్షణ, తపాలా సేవలు, ఫైనాన్సింగ్, బీమా, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, సామాజిక వ్యక్తిగత సేవలు, ప్రజాపరిపాలన, ఇతర సేవలు.
సాధారణంగా వ్యవసాయ రంగాన్ని ప్రాథమిక రంగంగా, పారిశ్రామిక రంగాన్ని ద్వితీయ రంగంగా, సేవా రంగాన్ని తృతీయ రంగంగా పేర్కొంటారు. అయితే ‘గనులు, తవ్వకాలు’ అనే ఉప రంగం లేని ప్రాథమిక రంగంలోని అంశాలను వ్యవసాయ రంగంగా భావిస్తారు. ‘గనులు, తవ్వకాలు’ ఉప రంగంతో కూడిన ద్వితీయ రంగంలోని అంశాలను పారిశ్రామిక రంగంగా గుర్తిస్తారు. తృతీయ రంగంలోని అంశాలన్నీ సేవల రంగం కిందకి వస్తాయి. ఈ ముఖ్య ఆర్థిక రంగాల్లో వివిధ ఉప రంగాల వారీగా ఆదాయం, వృద్ధి, మొత్తం ఆదాయంలో వాటి వాటాను మదింపు చేసి జాతీయాదాయం లేదా రాష్ట్ర ప్రాంతీయాదాయాన్ని తెలుసుకుంటారు. ‘కేంద్ర గణాంక సంస్థ’ (Central Statistical Organisation - CSO) జాతీయాదాయాన్ని అంచనా వేస్తుంది. రాష్ట్ర ఆర్థిక గణాంక సంచాలకులు రాష్ట్ర ఆదాయాన్ని అంచనా వేస్తారు. ఇందులో భాగంగా వీరు వివిధ లెక్కింపు పద్ధతుల ద్వారా గణాంకాలను రూపొందిస్తారు.

ఆదాయ మదింపు పద్ధతులు
సాధారణంగా జాతీయ లేదా రాష్ట్ర ఆదాయాన్ని 3 రకాల పద్ధతుల్లో లెక్కిస్తారు. అవి:
1. ఉత్పత్తి లేదా నికర ఉత్పత్తి పద్ధతి
2. ఆదాయ పద్ధతి (నికర ఆదాయ పద్ధతి)
3. వ్యయ పద్ధతి
ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ మూడు పద్ధతులనే అనుసరిస్తున్నారు. మన దేశంలో (అన్ని రాష్ట్రాల్లోనూ) ఉత్పత్తి, ఆదాయ మదింపు పద్ధతుల ఆధారంగా జాతీయదాయాన్ని గణిస్తున్నారు.
ఉత్పత్తి మదింపు పద్ధతి
దీన్ని విలువ జోడించిన పద్ధతి (Value Added Method), Industrial Origin Method, Inventory Method అని కూడా అంటారు. ప్రముఖ ఆర్థికవేత్త సైమన్ కుజినెట్స్ ఈ పద్ధతిని ‘ఉత్పత్తి సేవా పద్ధతి’గా పేర్కొన్నాడు. ఆర్థిక వ్యవస్థలో ఏడాది కాలంలో జరిగే అంతిమ వస్తు సేవల ఉత్పత్తిని కలిపితే ‘నికర ఉత్పత్తి’ వస్తుంది. ఈ విలువను జాతీయాదాయం లేదా రాష్ట్ర ప్రాంతీయాదాయంగా భావిస్తారు. ఆర్థిక వ్యవస్థలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల్లో జరిగిన ఉత్పత్తిని కలిపితే మొత్తం ఉత్పత్తి వస్తుంది. అయితే ఒక రంగంలో జరిగిన ఉత్పత్తిని మరో రంగంలో ఉత్పత్తి కారకాలు (మాధ్యమిక వస్తువులు)గా ఉపయోగించవచ్చు. కాబట్టి వాటి విలువను లెక్కలోకి తీసుకోకూడదు. అంటే ఒకే వస్తువును రెండుసార్లు లెక్కించకూడదు. ఈ పద్ధతిలో.. జాతీయాదాయం = కారకాల దృష్ట్యా నికర దేశీయోత్పత్తి + నికర విదేశీ కారకాల ఆదాయాలు.
ఆదాయ మదింపు పద్ధతి
దీన్ని కారక చెల్లింపు పద్ధతి (Factor Payment Method), వాటాల పంపిణీ పద్ధతి (Distributed Share Method), ఆదాయ చెల్లింపు పద్ధతి (Income Paid Method), ఆదాయ గ్రాహక పద్ధతి (Income Received Method) అని పిలుస్తారు. ఈ పద్ధతిలో జాతీయ/ రాష్ట్ర ఆదాయాన్ని పంపిణీ కోణం నుంచి లెక్కిస్తారు. వివిధ ఉత్పత్తి కారకాలు.. అంటే శ్రమపై వచ్చే వేతనాలు, భూమిపై వచ్చే అద్దె, మూలధనంపై వచ్చే వడ్డీ, పరిశ్రమ వ్యవస్థాపకుడికి వచ్చే లాభాలు, వీటన్నింటి ప్రతిఫలాల మొత్తం విలువతో పాటు నికర విదేశీ ఆదాయాలను కలిపితే వచ్చేదే జాతీయాదాయం. ఈ పద్ధతిలో వివిధ ఉత్పత్తి కారకాల మధ్య జాతీయాదాయం ఏ విధంగా పంపిణీ అయిందో తెలుసుకోవచ్చు. దీంతో పాటు వివిధ వర్గాల ప్రజలకు ఎంతెంత ఆదాయం వస్తుందో అంచనా వేయవచ్చు. ఆదాయ మదింపు పద్ధతిలో.. జాతీయాదాయం = వేతనం + భాటకం + వడ్డీ + లాభాలు + నికర విదేశీ ఆదాయాలు.
వ్యయాల మదింపు పద్ధతి
ఇది ఆధునిక పద్ధతి. దీన్ని ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాల్లో అనుసరిస్తున్నారు. భారతదేశంలో ఇది అంతగా వినియోగంలో లేదు. ఈ పద్ధతిలో వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వం ఒక ఏడాది కాలంలో అంతిమ వస్తు సేవలపై చేసే మొత్తం వ్యయాన్ని లెక్కించడం ద్వారా జాతీయాదాయాన్ని గణిస్తారు. జాతీయాదాయ లెక్కింపు పద్ధతులన్నింటిలో ఇది చాలా కచ్చితమైంది. దీన్ని వినియోగ - పెట్టుబడి పద్ధతి అని కూడా అంటారు. ఈ వ్యయ మదింపు పద్ధతిని ప్రఖ్యాత ఆర్థికవేత్త జే.ఎం. కీన్‌‌స రూపొందించారు. ఈ పద్ధతిలో జాతీయాదాయం = గృహ సంబంధ వ్యయాలు + సంస్థల వ్యయాలు + ప్రభుత్వ వ్యయాలు.
 
ఆదాయ లెక్కింపు - ప్రామాణిక ధరలు
జాతీయ, రాష్ట్ర ప్రాంతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు సాధారణంగా రెండు రకాల ధరలను ప్రామాణికంగా తీసుకుంటారు.
ప్రస్తుత ధరల్లో జాతీయాదాయం
ప్రస్తుత సంవత్సరం ఆచరణలో ఉన్న వస్తు సేవల ధరల్లో ఆదాయాన్ని లెక్కిస్తే దాన్ని ‘ప్రస్తుత ధరల్లో ఆదాయం’ లేదా ‘నామమాత్రపు ఆదాయం’ అంటారు.
ఉదా: 2014-15 జాతీయాదాయన్ని లెక్కించేటప్పుడు 2014-15లోని ధరలనే ప్రామాణికంగా తీసుకోవడం.
ప్రస్తుత ధరల్లో ఆదాయాన్ని లెక్కించినప్పుడు.. గతేడాది, ప్రస్తుత సంవత్సరం జాతీయాదాయాలను సరిపోలిస్తే ఉత్పత్తి పెరగనప్పటికీ ధరలు అధికమవడం వల్ల జాతీయదాయం పెరిగినట్లు ఫలితాలు రావచ్చు. ఎందుకంటే వస్తు సేవల ధరలు అనేక కారణాల వల్ల రోజురోజుకూ పెరుగుతుంటాయి. ధరలు పెరగడం వల్ల ఆదాయం అధికమైనట్లు గోచరిస్తుంది. ఈ కారణంగా వాస్తవ వస్తు సేవల ఉత్పత్తులను అంచనా వేయలేం. అందువల్ల ఈ పద్ధతిలో వాస్తవ జాతీయాదాయాన్ని లెక్కించడం వీలు కాదు.
స్థిర (ప్రామాణిక) ధరల్లో జాతీయాదాయం
ఏ విధమైన సామాజిక, రాజకీయ, ఆర్థిక, ప్రకృతి పరమైన ఒడుదొడుకులు లేకుండా ఉత్పత్తి మంచిగా జరిగిన ఒకానొక సంవత్సరాన్ని ఆధార సంవత్సరం (బేస్ ఇయర్)గా తీసుకొని ఆ ధరల ఆధారంగా జాతీయాదాయాన్ని లెక్కిస్తే దాన్ని ‘స్థిర ధరల్లో ఆదాయం’ లేదా ‘వాస్తవ ఆదాయం’ అంటారు.
ఉదా: 2014-15 జాతీయాదాయాన్ని లెక్కించేటప్పుడు 2004-05 ధరలను ప్రామాణికంగా తీసుకోవడం.
స్థిర ధరల్లో జాతీయాదాయాన్ని లెక్కించడానికి కేంద్ర గణాంక సంస్థ (సీఎస్‌వో) ఎప్పటికప్పుడూ ఆధార సంవత్సరాన్ని నిర్ధారిస్తుంది. మన దేశంలో ఇప్పటివరకూ 1948-49, 1960-61, 1970-71, 1980-81, 1993-94, 1999-2000, 2004-05లను ఆధార సంవత్సరాలుగా తీసుకున్నారు.
ప్రస్తుత ధరల్లో ఆదాయాన్ని గణించినప్పటికీ దాన్ని ‘ధరల సూచీ’ (Price Deflator) ఆధారంగా స్థిర ధరల్లోకి మార్చవచ్చు.
స్థిర ధరల్లో ఆదాయం = (ప్రస్తుత ధరల్లో ఆదాయం / ధరల సూచీ) × 100
స్థూల రాష్ట్రోత్పత్తి (జీఎస్‌డీపీ)
ఒక రాష్ట్ర భౌగోళిక హద్దుల మధ్య, నిర్ణీత కాల వ్యవధిలో (సాధారణంగా ఒక సంవత్సరం) ఉత్పత్తి చేసిన వస్తువుల, సేవల మొత్తం విలువను స్థూల రాష్ట్రోత్పత్తి (Gross State Domestic Product - GSDP) అంటారు. జీఎస్‌డీపీ నుంచి ‘తరుగుదల’ను తీసేస్తే ‘నికర రాష్ట్రోత్పత్తి (Net State Domestic Product - NSDP) వస్తుంది. సాధారణంగా జీఎస్‌డీపీనే రాష్ట్ర ఆదాయంగా పరిగణిస్తారు. కానీ, ఆర్థిక పరిభాషలో రాష్ట్ర ఆదాయం అంటే ఎన్‌ఎస్‌డీపీ. వీటిని గణించేటప్పుడు ఒక రాష్ట్రంలోని వారు ఇతర రాష్ట్రాల్లో సంపాదించిన ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోరు.
రాష్ట్ర తలసరి ఆదాయం = ఎన్‌ఎస్‌డీపీ ÷ రాష్ట్ర జనాభా
స్థూల జిల్లా ఉత్పత్తి (జీడీడీపీ)
ఒక జిల్లాలో ఏడాది కాలంలో ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు సేవల మొత్తం విలువను ‘స్థూల జిల్లా ఉత్పత్తి’ (Gross District Domestic Product - GDDP) అంటారు.

రాష్ట్ర స్థూల ఉత్పత్తి - దృగ్విషయాలు
జీఎస్‌డీపీ లెక్కింపునకు అనువుగా ఉండటానికి రాష్ట్రంలో మూడు రంగాలను తొమ్మిది విభాగాలుగా విభజించారు. ఈ పద్దులను కింది విధంగా వర్గీకరించారు.
  1. వ్యవసాయ రంగం
    1.1 (ఎ) వ్యవసాయం
    1.1 (బి) జీవోత్పత్తులు (పశు సంపద - పాడి పరిశ్రమ)
    1.2 అటవీ ఉత్పత్తులు, కలప
    1.3 మత్స్య సేకరణ
  2. పారిశ్రామిక రంగం
    2. గనులు, తవ్వకాలు
    3. వస్తూత్పత్తి
    4. విద్యుచ్ఛక్తి, గ్యాస్, నీటి సరఫరా
    5. నిర్మాణాలు
  3. సేవల రంగం
    6. వాణిజ్యం, హోటళ్లు, రెస్టారెంట్లు
    7.1 రైల్వేలు
    7.2 రవాణా, నిల్వ చేయడం
    7.3 సమాచార సంబంధాలు
    8. రుణ సహాయం (ఫైనాన్సింగ్), బీమా, స్థిరాస్తులు, వ్యాపార సేవలు
    9. సామూహిక, సామాజిక, వ్యక్తి స్థాయి సేవలు, ఇతర సేవలు
వీటిలో మొదటి మూడు అంశాలను ఉత్పత్తి మదింపు పద్ధతి; 4, 6, 7, 8, 9లోని అంశాలను ఆదాయ మదింపు పద్ధతి; 5వ అంశాన్ని (నిర్మాణ రంగం) వ్యయ మదింపు పద్ధతి ద్వారా గణిస్తున్నారు
Tags: Telangana Gross Production Telangana Economic System Telangana Economy Study Material TSPSC Groups Study Material

Followers