ఫోన్ జబ్బు


అవసరం మేరకు వాడితే ఏ వస్తువైనా క్షేమమే. హద్దు దాటితే మాత్రం ఏదైనా ప్రమాదకరమే. దురదృష్టం ఏమిటంటే సెల్‌ఫోన్ వినియోగం అనేది యువతలో అవసరానికి మించి జరుగుతోంది. బెంగుళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసెన్సైస్ 'సెల్‌ఫోన్ అధిక వినియోగం-దుష్పరిణామాలు' అనే అంశంపై ఇటీవల ఒక నివేదికను వెలువరించింది. దీని ప్రకారం 'నోమో ఫోబియా'కు గురవుతున్న యువత రోజురోజుకూ పెరుగుతూ పోతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే, సెల్‌ఫోన్ తనకు దూరమై పోతుందనే భయమే - 'నోమోఫోబియా.' లక్షణాలు: ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడానికి ఇష్టపడరు. తరచుగా మిస్‌డ్ కాల్స్, మెసేజ్‌లను చెక్ చేసుకుంటారు. ఫోన్ రీఛార్జీలో ఉందా, లేదా అనేది తరచుగా చెక్ చేసుకుంటారు. బాత్‌రూమ్‌లోకి కూడా సెల్‌ఫోన్ తీసుకువెళతారు. సెల్‌ఫోన్ రింగ్ అవుతున్నట్లు భ్రమ పడుతుంటారు. పంపిన ఎస్.ఎం.ఎస్‌కు ఎప్పుడు సమాధానం వస్తుందా అని అదే పనిగా ఎదురుచూస్తుంటారు. ఏ పని చేస్తున్నా దృష్టి మాత్రం సెల్‌ఫోన్ మీదే ఉంటుంది. సెల్‌ఫోన్ రెండు నిమిషాల పాటు కనిపించకపోయినా.దాన్ని ఎవరో దొంగిలించినట్లు ఆందోళన పడిపోతారు. ఏ విషయం మీదా దృష్టి నిలపలేకపోవడం, సమూహంలో ఒంటరి కావడం, అకారణ ఆందోళనకు గురికావడం లాంటి ఎన్నో సమస్యలు 'నోమోఫోబియా'వల్ల వస్తున్నాయి. రానున్న కొద్దిరోజుల్లో మానసిక రుగ్మతల జాబితాలో ఈ నోమోఫోబియా ఎక్కనుంది. అంటే, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 'అవసరం మేరకు వాడండి' అని నిపుణులు చెబుతున్న మాటను తు.చ. తప్పకుండా పాటించండి. నోమోఫోబియాకు దూరంగా ఉండండి.

Followers