గుండెపోటుతో పాటు సరిసమానంగా ఎక్కువమందిలో కనిపిస్తున్న వ్యాధి పక్షవాతం.
మన అవయవాలకు సంబంధించిన కండరాలను, వాటి కదలికలను నియంత్రించే నాడీకణాలు
పనిచేయలేకపోయినప్పుడు ఎదురయ్యే సమస్యే పక్షవాతం. మెదడుకు కలిగే రక్త
ప్రసరణలో ఎటువంటి అంతరాయం కలిగినా, రక్తపోటు పెరిగినా, నరాల నిర్మాణలోపాలు
కలిగినా పక్షవాతం రావచ్చు.
తలనొప్పి, మగతగా ఉండటం, కళ్లు తిరుగుతున్నట్టు ఉండటం, గందరగోళం లాంటి
లక్షణాలు తరచుగా కనిపిస్తుంటే అవి పక్షవాతానికి సూచనలుగా భావించవచ్చు.
కొన్నిసార్లు రక్తప్రసారంలో ఏర్పడిన అడ్డంకులు వాటికవే కరిగిపోతాయి.
ఇలాంటప్పుడు లక్షణాలు ఎంత తొందరగా కనిపిస్తాయో అంత త్వరగా కనుమరుగవుతాయి.
సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రం మాట్లాడటంలో ఇబ్బంది, చూపు దెబ్బతినడం,
హఠాత్తుగా తిమ్మిర్లు రావడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఏదో ఒక పక్కన
ముఖం, కాళ్లూచేతులు పడిపోవచ్చు. ఇలాంటప్పుడు ప్రతీ క్షణం అమూల్యమైనదే. సమయం
మించిపోతే పక్షవాతానికి గురైన అవయవాలను మళ్లీ కదిలేలా చేయడం కష్టం
అవుతుంది.
పక్షవాతాన్ని అతి త్వరగా గుర్తించడం వల్ల వైద్యసహాయం కూడా సకాలంలో
అందించవచ్చు. అందుకే నేషనల్ స్ట్రోక్ అసోసియేషన్ పక్షవాతమా కాదా అన్నది
తెలుసుకోవడానికి ఎఫ్‌ఏఎస్‌టీ (ఫాస్ట్) అన్న పరీక్షను సూచిస్తోంది.
ఎఫ్ - ఫేస్ : రోగి నవ్వినప్పుడు ముఖం ఒకవైపు వంగిపోతుందా?
ఏ - ఆర్మ్స్ : రెండు చేతులనూ పైకి ఎత్తమన్నప్పుడు ఒక చేయిని ఎత్తలేకపోవడం, కిందకి పడిపోవడం జరుగుతోందా?
ఎస్ - స్పీచ్ : మాట తడబడుతూ, మూతి వంకరగా అవుతోందా?
టీ - టైమ్ : పైన చెప్పిన మూడు లక్షణాలు కనిపిస్తే క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి.