జెరూసలెం: దెబ్బతిన్న రెటీనాకు ప్రత్యామ్నాయంగా వినియోగించుకోవటానికి వీలైన
పలుచటి, కాంతికి స్పందించే కొత్త పొరను శాస్త్రవేత్తలు రూపొందించారు.
నానోరాడ్స్, కార్బన్ నానోట్యూబ్స్‌తో తయారచేసిన దీన్ని టెల్ అవైవ్,
హీబ్రూ విశ్వవిద్యాలయం పరిశోధకులు కాంతికి స్పందించని కోడిపిల్ల రెటీనాతో
పరీక్షించారు. ఇది కాంతిని గ్రహించినట్టు, నాడీసంబంధ చర్యను
ప్రేరేపించినట్టు బయట పడటం విశేషం. ఇతర పరిజ్ఞానాలతో పోలిస్తే ఇది మరింత
మన్నికైన, సమర్థవంతమైన, తేలికగా వంగే సామర్థ్యం గల పరికరమని పరిశోధకులు
తెలిపారు. వయసుతో పాటు వచ్చే మాక్యులర్ డీజెనరేషన్ (ఏఎండీ) సమస్యతో
బాధపడేవారికిది బాగా ఉపయోగపడగలదని వివరించారు.