డిసెంబర్ 4:విఖ్యాత న్యాయ నిపుణుడు జస్టిస్ వీఆర్ కృష్ణ అయ్యర్
కన్నుమూశారు. పేదలకు అండగా నిలిచిన వామపక్ష మేధావి, సుప్రీంకోర్టులో తన
తీర్పులతో చరిత్రను సృష్టించిన న్యాయ పండితుడు కృష్ణ అయ్యర్ గురువారం
కొచ్చిలోని ఓ ప్రైవేటు దవాఖానాలో తుదిశ్వాస విడిచారు. గత నవంబర్ 13న
వందేండ్లు పూర్తి చేస్తున్న జస్టిస్ అయ్యర్ పలు అవయవాల వైఫల్యం వల్ల
మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. వీఆర్ కృష్ణ అయ్యర్ కేరళలోని పాలక్కడ్‌లో
సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. కమ్యూనిజం పట్ల ఆకర్షితుడైన ఆయన
కేరళలో ఈఎంఎస్ నంబూద్రిపాద్ నేతృత్వంలో ఏర్పడ్డ తొలి కమ్యూనిస్టు
ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించారు. 1950 దశకంలో ఆయన న్యాయశాఖ మంత్రిగా
ఉన్నప్పుడే భూసంస్కరణల చట్టం వచ్చింది. 1970 దశకంలో ఏడేండ్లు సుప్రీం
కోర్టు జడ్జిగా పనిచేసిన ఆయన అత్యున్నత న్యాయస్థానంలో అనేక మార్పులు
తీసుకొచ్చారు.
-జస్టిస్ వీఆర్ కృష్ణ అయ్యర్ కన్నుమూత
-కొచ్చిలో తుదిశ్వాస విడిచిన సుప్రీం మాజీ జస్టిస్
లోకస్ స్టాండీ సూత్రాలను సడలిస్తూ ఆయన సుప్రీంకోర్టును సాధారణ ప్రజలకు
అందుబాటులోకి తెచ్చారు. నిర్బంధంలో ఉన్న వ్యక్తులకు అనుకూలంగా ఆయన ఇచ్చిన తీర్పు సుప్రీం చరిత్రలోనే సంచలనం. బెయిలే ప్రధానం..జైలు రూల్ కాదు అని ఆయన
వెల్లడించిన తీర్పుతో ముందస్తు అరెస్టులను అడ్డుకునేందుకు వీలుపడింది.
1975 జూన్ 24న మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుతో
అప్పట్లో ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో
రాయ్‌బరేలీ నుంచి అక్రమంగా గెలిచినట్లు అలహాబాద్ కోర్టు ఇచ్చిన మధ్యంతర
తీర్పును రద్దు చేయాలని సుప్రీంలో ఇందిరా గాంధీ దాఖలు చేసుకున్న
అఫిడవిట్‌ను కృష్ణ అయ్యర్ తిరస్కరించారు. ఈ తీర్పు నేపథ్యంలో మరుసటిరోజే
నుంచే దేశంలో ఎమర్జెన్సీ విధించారు.
ఆ తీర్పులు మానవత్వానికి గీటురాళ్లు
వీఆర్ కృష్ణ అయ్యర్ పూర్తి పేరు వైద్యనాథపుర రామ కృష్ణ అయ్యర్. ఆయన
వెల్లడించిన సంచలన తీర్పులు మానవత్వానికి గీటురాళ్లు. రాజకీయంగా,
న్యాయపరంగా దేశం చిక్కుల్లో ఉన్న దశలో ఆయన సుప్రీంకోర్టులో విప్లవాత్మక
జడ్జిగా పనిచేశారు. తన తేటతెల్లమైన తీర్పులతో ఆయన అమితమైన పేరుప్రతిష్ఠలు
ఆర్జించారు. రాజకీయవేత్తగా ఉన్న ఆయన అనూహ్య రీతిలో న్యాయవ్యవస్థకు మళ్లారు.
కేరళలో ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేసిన అయ్యర్ 1973లో సుప్రీంకోర్టులో
న్యాయవాదిగా ప్రవేశించారు. భారత న్యాయవ్యవస్థకు కృష్ణ అయ్యర్
భీష్మపితామహుడి లాంటివారని మాజీ చీఫ్ జస్టిస్ ఏఎస్ ఆనంద్ కీర్తించారు.
ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలంటే రాజ్యాంగంలోని 21వ అధికరణ కచ్చితంగా అమలు
చేయాలని అయ్యర్ గట్టిగా వాదించేవారు. సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్న సమయంలో
అయ్యర్ 400 తీర్పులు వెలువరించారు. పద్మ విభూషణ్ పురస్కారం పొందిన ఆయన 70
న్యాయ పుస్తకాలను రచించారు. వాండరింగ్ ఇన్ మెనీ వరల్డ్స్ అని అయ్యర్
జీవితకథను రాశారు 2002 గుజరాత్ అల్లర్ల కేసులో ఆయన ప్యానల్‌లో సభ్యుడిగా
ఉన్నారు. 1987లో రాష్ట్రపతి పదవికి పోటీపడ్డారు. అయ్యర్ మృతిపట్ల
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా,
రాహుల్ తదితరులు సంతాపం తెలిపారు.
నిస్వార్థపరుడు: ఎంపీ వినోద్
జస్టిస్ వీఆర్ కృష్ణయ్యర్ మృతి పట్ల టీఆర్‌ఎస్ ఎంపీ బీ వినోద్ కుమార్ తీవ్ర
దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాజిక స్పృహ కలిగిన ఆయన నీతి నిజాయితీతో,
నిస్వార్థంతో బతకడం ఎలాగో తన జీవితం ద్వారా సమాజానికి చూపించారని వినోద్
ఆయన సేవలను కొనియాడారు. నాడు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ సంస్థకు తాను
ఆంధ్రప్రదేశ్ శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్నానని, ఆ సమయంలో కృష్ణ అయ్యర్‌ను
ఆహ్వానించామని గుర్తు చేసుకున్నారు.