అమ్మాయిలను ఎత్తుకెళ్లి అమ్మేస్తున్నారు!


అమ్మాయిలను ఎత్తుకెళ్లి, అంగట్లో పశువుల్లా అమ్ముకునే ముఠాలు జిల్లాలో పెట్రేగుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న అమాయక గిరిజన కుటుంబాల్లోని ఆడపిల్లలనే ఈ ముఠాలు లక్ష్యంగా చేసుకుంటున్నాయి. మాయమాటలతో ఉచ్చులోకి దించి, పెళ్లి చేసుకున్నట్లు నమ్మించి ఇతర రాష్ర్టాల్లో విక్రయిస్తున్నాయి. ఆరు నెలల క్రితం కెరమెరి మండలం నాగల్‌గొందికి చెందిన ఓ బాలికను ఇలాగే అమ్మిన ఓ ముఠాను తాజాగా పోలీసులు పట్టుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతుండగా, ఇంతకాలం ఖాకీల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదిలాబాద్ ;జిల్లాలో బాలికలు మాయమవుతున్నా పోలీసుల దృష్టికి రావడం లేదు. కొన్ని కేసులు బయటికి వ స్తున్నా పోలీసుల వరకు వెళ్లడం లేదు. అవమానా ల పాలవుతామని, కుటుంబం బజారున పడుతుందనే మానసిక క్షోభతో చాలా మంది పోలీసులను ఆశ్రయించడం లేదు. దీన్ని ఆసరాగా తీసుకుంటున్న ముఠాలు చెలరేగి పోతున్నాయి. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో బాలికలకు ఆకర్షణీయ, అలంకర వస్తువులు ఇచ్చి మచ్చికచేసుకుని, ఆ తర్వాత వారికి మాయమాటలు చెప్పి ఇతర ప్రాం తాలకు తరలించి విక్రయిస్తున్నారని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఎక్కువగా రాజస్థాన్‌కు తీసుకెళ్లి విక్రయిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఆడపిల్లల అక్రమ రవాణాలో మరో కోణం కూడా వెలుగు చూస్తోంది. నిరుపేదలైన తల్లి తండ్రులు వారి ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయలేకపోతున్న విషయాన్ని పసిగట్టి ఇతర రాష్ర్టాలకు చెందిన వారితో పెళ్లి చేసి మరీ అక్రమంగా తరలిస్తున్నట్లు తెలుస్తోంది. పెళ్లి ముసుగులో ఇక్కడి నుంచి తరలిస్తున్నవారికి తల్లిదండ్రులు, బంధువులతో సంబంధాలు తెగిపోతున్నాయి. వారి యోగ క్షేమాలు తెలియక ఇక్కడ ఎందరో తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. ఇక్కడి నుంచే అక్రమ రవాణా అంతర్రాష్ట్ర రైల్వే లైన్లు, జాతీయ రహదారులు అనుసంధానం చేసిన జిల్లా నుంచి అమ్మాయిల అక్రమ రవాణా సునాయసంగా జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో కూడా మాయమవుతున్న అమ్మాయిల సంఖ్య నా నాటికి పెరుగుతోంది. ఆసిఫాబాద్, వాంకిడి, ఉ ట్నూర్, కెరమెరి, బేల, మంచిర్యాల, ఇంద్రవెల్లి, బాసర వంటి ప్రాంతాల నుంచి ఎక్కువగా బాలికల అక్రమ రవాణా జరుగుతున్నట్లు ఓ స్వచ్ఛంద సంస్థ సర్వేలో తేలింది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాం తాల నుంచి కనిపించకుండా పోతున్న అమ్మాయిల సంఖ్య పెరుగుతోంది. పెళ్లిళ్ల పేరుతో తరలిపోయేవారు కొందరైతే, తల్లిదండ్రులకు తెలియకుండానే అక్రమంగా తరలింపుకు గురయ్యేవారు మరికొందరు. ఏమైనా జిల్లాలోని గిరిజన బాలికలే ఎక్కువగా ట్రాఫికర్ (అమ్మాయిలను అక్రమంగా తరలించేవారు) బారిన పడుతున్నట్లు తె లుస్తోంది. కొందరు తల్లి దండ్రులతో బేరం కుదిర్చుకుని మరీ అమ్మాయిలను అక్రమంగా తరలిస్తున్నట్లు తెలుస్తోంది. నానాటికి పెరుగుతున్న కేసులు కెరమెరి మండలం నాగల్‌గొందికి చెందిన ఓ బా లికను తన బంధువులే అక్రమంగా తరలించి రాజస్థాన్‌లోని జూల్వాడ్ జిల్లా చెలోలాస్ అనే గ్రామానికి చెందిన ఒకరికి 1.05 లక్షలకు అమ్మేశారు. ఈ విషయమై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డొంకంతా కదిలింది. తక్షణమే స్పందించిన పోలీసులు రాజస్థాన్ వెళ్లి ఆ బాలికను ఇక్కడికి తెచ్చారు. ఇలాంటివాళ్లు రాజస్థాన్‌లో అధిక సంఖ్యలో ఉన్నట్లు జిల్లా అధికారుల ముందు సదరు బాలిక చెప్పింది. పోలీసులు శుక్రవారం అరెస్టు చేసిన ఓ ముఠాలోని సభ్యులు కూడా ఈ విషయాన్ని అంగీకరించినట్లు తెలుస్తోం ది. అయితే వాళ్లంతా తమ ఇష్టంతోనే రాజస్థాన్‌కు చెందిన వారితో పెళ్లిళ్లు చేసుకున్నట్లు, ఈ ముఠా లో ఉన్నవారి బంధువుల అమ్మాయిలకు కూడా అక్కడి వారితో పెళ్లిళ్లు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. వాంకిడి, కెరమెరి మండలాలకు సంబంధించిన అమ్మాయిలే పది మంది వరకు రాజస్థాన్‌లో ఉన్నట్లు సమాచారం. సమాధానం లేని ప్రశ్నలు ఆడ పిల్లల పెళ్లిళ్లుచేసే స్థోమత లేని కొన్ని కుటుంబాలు రాజస్థాన్‌కు చెందిన వారితో పెళ్లి చేస్తున్నా రని కొందరు వాదిస్తున్నారు. పెళ్లిళ్లు సక్రమంగానే జరిగాయంటూ కొందరు పోలీసు అధికారులు కూడా ఇలాంటి కేసుల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే మహారాష్ట్ర సరిహద్దు మం డలాల్లోని గ్రామాల్లోనే అమ్మాయిల అక్రమ రవా ణా ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అక్ర మ సంపాదనకు అలవాటు పడిన ముఠాలు కొన్ని నిరుపేదలైన అమ్మాయిల కుటుంబాలకు మాయమాటలు చెప్పి వారికి కొంత డబ్బు ముట్టజెప్పి అ మ్మాయిలను తరలించి రాజస్థాన్‌లోనే కాకుండా మహారాష్ట్రలోని చంద్రపూర్, నాగపూర్ వంటి ప్రాంతాల్లోనే కాకుండా ఆగ్రా, ఢిల్లీ వరకు తీసుకెళ్లి ఇతర ముఠాలకు అక్రమంగా అమ్మేస్తున్నారనే ఆరోపణలు కూడా లేకపోలేదు. చైన్ సిస్టంలో ఉన్న ట్రాఫికర్ ముఠాలు జిల్లా నుంచి తీసుకెళ్తున్న అమ్మాయిలను ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొన్నది. పెళ్లి ముసుగులో ఇక్కడి నుంచి తరలించిన అమ్మాయిల ఆచూకి తెలియకపోవడం ఇందుకు నిదర్శ నం. ఇంద్రవెల్లి మండలంలో ఇలాంటి సంఘట లు గతంలో వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ ముఠాలు అమ్మాయిలను ఎక్కడికి తరలిస్తున్నది కూడా ఇప్పటికి స్పష్టంగా తెలియడం లేదు. రక్షణగా చట్టాలు తెచ్చినా బాలికల అక్రమ రవాణాను అరికట్టేందుకు అనేక చట్టాలున్నాయి. ఐటీపీఏ యాక్ట్ ఇందులో ముఖ్యమైనది. ఈ చట్టం బాలికలకు ఉపయోగపడేది తక్కువే. ప్రభావిత ప్రాంతాలను గుర్తించి బాలికలకు, వారి తల్లి దండ్రులకు అవగాహన కల్పించా ల్సి ఉంటుంది. పాఠశాలలు, కళాశాలల్లో బాలికలకు ఎక్కువగా సమావేశాలు ఏర్పాటు చేసి ట్రాఫికర్ల బారినపడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభు త్వ యంత్రాంగంపై ఉంది. కానీ ఇప్పటి వరకు ప్రభావిత ప్రాంతాలను కూడా సరిగ్గా గుర్తించని పరిస్థితి జిల్లాలో నెలకొంది. ఒక్క పోలీసు శాఖనే కాకుండాస్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కూ డా పలు కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. కానీ నామ మాత్రంగా చేపట్టే కార్యక్రమాలు జిల్లాలో బాలికల అక్రమ రవాణాను అరికట్టలేక పోతున్నా యి. కనీసం బాల్య వివాహాలను అరికట్టడంలో కూడా ప్రభుత్వ యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో బాలికల తల్లిదండ్రులే ట్రాఫికర్ ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కొత్తగా గ్రామాలకు వస్తున్న వారిని నమ్మి పిల్లలను వారి వద్దకు వెళ్లనీయకుండా ఉంచడం మంచిదని, వారు ఇచ్చే వస్తువులను పిల్లలు ముట్టనీయకుండా ఉంచాలని పోలీసులు చూసిస్తున్నారు.
 :Namasthetelangaana

Followers