తెలంగాణ సర్వే సత్యాలు

Tags:
తాజా సర్వేలోని సమాచారం ఆధారంగా అభివృద్ధి విధానాలను మార్చుకోవచ్చు. అయితే ఆయా కులాల ఆర్థిక స్థితిగతులపై అంచనాకు రావడానికి మరింత అధ్యయనం చేయాలె. ప్రభుత్వం ఈ సర్వేతో ఆగకుండా ఇక ముందు కూడా అవసరమైనప్పుడల్లా సర్వేలు నిర్వహించాలె. ఈ సర్వేలో ఏమైనా చిన్న లోపాలు ఉంటే వాటిని సవరించుకోవచ్చు. ఈ సర్వే మనకు ఎంతో అనుభవాన్ని ఇచ్చింది. ఎంతో స్ఫూర్తిదాయకమైంది కూడా. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా సాహసంతో చేపట్టిన సకల జనుల సర్వే వివరాలు వెలుగులోకి రావడంతో అనేక విధాలైన సమాచారం తెలుస్తున్నది. ఈ సర్వే చేపట్టినప్పుడు గిట్టనివారు అనేక విమర్శలు, అవహేళనలు చేశారు. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో పట్టుదలగా ఈ సర్వేను జరిపింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ఒక్క లెక్కా కచ్చితంగా లేదు. పథకాల రూపకల్పనలో, అమలులో చిత్తశుద్ధి లేదు. అంతా మొక్కుబడిగా, గందరగోళంగా ఉండేది. నిధులను ఎవరికి తోచిన రీతిలో వారు కైంకర్యం చేసుకున్నారే తప్ప అర్హులకు మాత్రమే అందాలనే దృక్పథం లేకుండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వే ఫలితంగా ఇప్పుడు అభివృద్ధి విధానాలు, సంక్షేమ పథకాలు తయారు చేయడానికి కావలసిన సమాచారం చిటికె వేస్తే లభిస్తుంది. బడ్జెట్ కేటాయింపు మొదలుకొని నీటి సరఫరా వరకు ప్రతి కార్యక్రమానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదొక సమాచార బంగారు గని! ప్రజలు కూడా ఈ సర్వేకు ఎంతో సహకరించినందు వల్లనే ఈ ఫలితాలు వచ్చినయి. ప్రభుత్వం చేపట్టబోయే పథకాలకు ఈ సర్వే ప్రాతిపదికగా ఉంటుంది. దీనిని ఆధారంగా చేసుకొని సామాజిక వేత్తలు ఎన్నో అధ్యయనాలు, విశ్లేషణలు చేయవచ్చు. ప్రభుత్వానికి సూచనలు అందించవచ్చు. ఒక్కో సామాజికవర్గ, ప్రాంత స్థితిగతులు ఎంతగా అధ్యయనం చేస్తే అంతగా లక్ష్య నిర్దేశిత విధానాలు అవలంబించవచ్చు. సర్వేలో వెల్లడయిన సమాచారం ప్రకారం- ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాలలో మగవారి కన్నా మహిళల సంఖ్య ఎక్కువగా ఉన్నది. దీనిని సామాజిక అభివృద్ధికి సూచనగా భావించాలా సామాజిక సంక్షేమ ఫలితమా అనేది అధ్యయనం చేసి తెలుసుకోవాలె. వికలాంగుల సంఖ్య ఐదు లక్షల మేర ఉన్నది. అంగవైకల్యానికి కారణాలను గుర్తించి గర్భస్థ దశ నుంచి జాగ్రత్తలు చేపట్టాలె. ఇప్పుడున్న వికలాంగులకు చేయూత ఇవ్వాలె. ఆయా వైకల్యాన్ని బట్టి వారు జీవితంలో స్థిరపడే విధంగా, సామాజికాభివృద్ధిలో భాగస్వాములయ్యే విధంగా పథకాలు రూపొందించాలె. జనాభాలో రెండు శాతం వ్యాధిగ్రస్తులున్నారు. వ్యాధులను అరికట్టడంతోపాటు, ఇప్పుడున్న వారికి చికిత్స, ఉపశమనం మొదలైన అంశాలపై దృష్టి సారించవచ్చు. దాదాపు పద్దెనిమిది శాతం కుటుంబాలకు మహిళలే ఇంటి పెద్దలు. వీరి ఉపాధి, జీవన విధానాలపై పరిశీలన జరపాలె. నాలుగు శాతం మహిళలు వితంతువులు, భర్త వదిలేసిన వారుగా వెల్లడైంది. వీరు ఏ కారణాల రీత్యా వితంతువులు అవుతున్నారు? విడిగా బతకడానికి కారణాలేమిటి? వీరిలో అక్షరాస్యులు, ఉన్నత, మధ్యతరగతి, కింది తరగతి వారు ఎందరు? పునర్వివాహం చేసుకోని వారు ఏ వర్గాల వారై ఉంటారు? మొదలైన అధ్యయనాలు జరిపితే సంస్కరణలకు అవకాశం ఉంటుంది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు సంబంధించి కూడా వివరాలు తెలిసినందు వల్ల వారి పురోభివృద్ధికి చర్యలు తీసుకోవచ్చు. ఆయా వర్గాల వారికి కూడా ఈ గణాంకాలు ఉపయోగకరంగా ఉంటాయి. రాష్ట్రంలో 51శాతం వెనుకబడిన తరగతుల వారున్నారని ఈ సర్వేలో వెల్లడైంది. పదిహేడున్నర శాతం ఎస్సీలు, దాదాపు పది శాతం ఎస్టీలు, 14.46 శాతం వివిధ అల్పసంఖ్యాకవర్గాలు ఉన్నాయి. ఈ అల్ప సంఖ్యాకవర్గాలలో అధిక సంఖ్యాకులు ముస్లింలు. విద్యార్థి వసతి గృహాలు, పక్కా ఇండ్లు ఇట్లా అనేక పథకాల అమలుకు, అవి ఏ వర్గాలకు చేరుతున్నాయో తెలుసుకోవడానికి ఈ గణాంకాలు ఉపయోగపడతాయి. కులాలను కూడా లెక్కించడం ఈ సర్వే ప్రాముఖ్యాన్ని పెంచింది. కులాన్ని లెక్కించాలా వద్దా అనే చర్చ జాతీయ స్థాయిలో సాగుతున్న వేళ మన రాష్ట్రం నిర్ణయాత్మకంగా వ్యవహరించింది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు సంబంధించి కచ్చితమైన గణాంకాలు లేవు. దీని వల్ల తమ జన సంఖ్యకు తగిన రీతిలో రిజర్వేషన్ ఇతర సదుపాయాలు లేవనే భావన కొందరిలో ఉన్నది. కొన్ని కులాలు ముందంజ వేసినప్పటికీ ఇంకా రిజర్వేషన్ ఇతర సదుపాయాలు పొందడమేమిటి? దీని వల్ల అదే వర్గంలోని ఇతర కులాలు నష్టపోవడం లేదా అనే ప్రశ్నలు కూడా ఉండేవి. వీటన్నిటిపై తగిన చర్చ జరగాలంటే కచ్చితమైన వివరాలు అవసరం. తాజా సర్వేలోని సమాచారం ఆధారంగా అభివృద్ధి విధానాలను మార్చుకోవచ్చు. అయితే ఆయా కులాల ఆర్థిక స్థితిగతులపై అంచనాకు రావడానికి మరింత అధ్యయనం చేయాలె. ప్రభుత్వం ఈ సర్వేతో ఆగకుండా ఇక ముందు కూడా అవసరమైనప్పుడల్లా సర్వేలు నిర్వహించాలె. ఈ సర్వేలో ఏమైనా చిన్న లోపాలు ఉంటే వాటిని సవరించుకోవచ్చు. ఈ సర్వే మనకు ఎంతో అనుభవాన్ని ఇచ్చింది. ఎంతో స్ఫూర్తిదాయకమైంది కూడా.


Followers