స్టాప్‌లర్‌తో కుట్లు వేసిన డాక్టర్


staaplarto kutlu vesina daaktar



ఏదైనా పెద్ద గాయమైతే డాక్టర్లు కుట్లు వేస్తారు. అయితే వరంగల్ జిల్లాలోని ఓ డాక్టర్ గాయానికి కుట్లు వేయకుండా స్టాప్‌లర్‌తో పిన్నులు వేసి పంపించాడు. దాంతో గాయం తిరగబెట్టింది. ఇలా స్టాప్‌లర్‌తో 'కుట్లు' వేసిన డాక్టర్ ఏ ఆర్.ఎం.పీ. డాక్టరో కాదు.. ఎంబీబీఎస్ వెలగబెట్టిన డాక్టరే. తొర్రూరు మండలం చిట్యాల గ్రామానికి చెందిన ఆవుల భారతమ్మ అనే మహిళ తన భర్త కూర్మయ్యతో కలసి ద్విచక్ర వాహనం మీద వెళ్తూ వుండగా ప్రమాదానికి గురైంది. దాంతో ఆమె నుదుటి మీద గాయమైంది. ఈ భార్యాభర్తలు తొర్రూరులోని ఒక ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరకి వెళ్ళారు. ఆయనగారు గాయాన్ని తీవ్రంగా పరీక్షించి, గాయానికి స్టాప్‌లర్‌తో పిన్నులు వేయడం మొదలుపెట్టాడు. అది చూసి అదిరిపోయిన ఆమె భర్త పిన్నులు వేస్తున్నారేంటని ప్రశ్నిస్తే, ఆ డాక్టర్ ''డాక్టర్ నువ్వా నేనా?'' అని సీరియస్‌గా ప్రశ్నించడంతో ఆమె భర్త మిన్నకుండిపోయాడు. ఆ తర్వాత ఆ పిన్నుల ధాటికి గాయానికి సెప్టిక్ అయి బాధ పెరిగింది. దాంతో ఆమె వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి వెళ్ళింది. అక్కడి డాక్టర్లు ఈ నిర్వాకం చూసి నోళ్ళు తెరిచారు. ఈ నిర్వాకం గురించి తెలుసుకున్న మీడియా స్టాప్‌లర్‌ డాక్టర్ దగ్గరకి వెళ్ళి ఇలా కుట్లేశారేంటి అని అడిగితే, ఇప్పటి వరకు చాలామందికి ఇలా పిన్నులు వేశాను.. ఎవరికీ ప్రాబ్లం రాలేదని చెప్పడంతో అందరూ బిత్తరపోయారు.


Followers