చలో అసెంబ్లీకి సిద్ధమవుతున్న ఆంధ్రప్రదేశ్ అంగన్ వాడీలు


chalo asembliki siddhamavutunna aandhrapradesh angan vaadilu



హైదరాబాద్:మన దేశంలో ఈ వ్యవస్థే లేకపోతే దాదాపు ఆరు కోట్ల మంది చిన్నారులు ఏమయ్యోవారో! తలచుకోవాలంటేనే భయమేస్తోంది. నిజమే. గత నలభై ఏళ్ల కాలంలో దాదాపు ఆరుకోట్ల మంది పసిపిల్లల ప్రాణాలు నిలబెట్టిన ఘనత అంగన్‌వాడీలకే దక్కుతుంది. అంతేనా దాదాపు కోటి మందికి పైగా గర్భిణీలు, బాలింతలు అంగన్‌వాడీల సహకారంతో పండంటి బిడ్డలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే గతంలో సగర్వంగా చెప్పుకుంది. మన దేశంలోని 13 లక్షల అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న 18 లక్షలమంది వర్కర్లు, సహాయకుల అంకుఠిత సేవలే ఇందుకు కారణమనడంలో సందేహం లేదు. చిన్నారుల ఆలనా పాలనా.... ప్రతి రోజూ కొన్ని లక్షల మంది చిన్నారుల ఆలనా పాలనా చూసి, వారి మోముల్లో చిరునవ్వులు పూయిస్తున్న అంగన్‌వాడీల జీవితాల్లో మాత్రం మందహాసం కనిపించడం లేదు. తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లు కూడా అంగన్‌వాడీల సమస్యలను తీర్చే ప్రయత్నాలు చేయకపోవడం బాధాకరం. తెలంగాణ బడ్జెట్‌లో ఎంతోకొంత వేతనాలు పెంచిన్నప్పటికీ, కేంద్ర బడ్జెట్‌, ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌లు పూర్తిగా నిరాశ పరిచాయి. 55వేలకు పైగా అంగన్‌వాడీ కేంద్రాలు..... ఆంధ్రప్రదేశ్‌లో 55వేలకు పైగా అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. కొన్ని లక్షల మంది చిన్నారులకు ఇవి అమ్మ ఒడి లాంటివి. అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తమ సేవలు అందిస్తూ వుంటారు. గర్భిణీలకు, బాలింతలకు, ఆరేళ్ల లోపు చిన్నారులకు పౌష్టికాహారం అందించడం, వ్యాధి నిరోధక టీకాలు వేయించడం, వైద్య ఆరోగ్య స్పృహను పెంపొందించడం, కుటుంబ సంక్షేమ కార్యక్రమాలు ప్రచారం చేయడం లాంటి బాధ్యతలను నిర్వర్తించేది అంగన్‌వాడీలే. బాలింత మరణాలు, శిశు మరణాలు నివారించడంలో వీరి పాత్ర కీలకం. ప్రభుత్వ తీరు ఆందోళనకరం.... ఇలాంటి గురుతర బాధ్యతలు నిర్వహిస్తున్న అంగన్‌వాడీల విషయంలో కొంత కాలంగా ప్రభుత్వాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. అంగన్‌వాడీల నిర్వహణలో రాజకీయ జోక్యమూ మితిమీరుతోందన్న విమర్శలున్నాయి. తెలంగాణలోని అంగన్‌వాడీలు ఈ నెల నుంచి 7500 రూపాయల వేతనం అందుకోబోతుండగా, ఆంధ్రప్రదేశ్‌లో వీరు 4200 రూపాయలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. రోజుకి ఏడు ఎనిమిది గంటలు శ్రమిస్తున్నవారికి ఇంత తక్కువ వేతనం ఇవ్వడం అన్యాయం కాకపోతే మరేమిటి? అందులోనూ చిన్నపిల్లలను డీల్‌ చేయడం అత్యంత ఓర్పు, సహనాలతో కూడుకున్న వ్యవహారం. వృత్తిపర ఒత్తిడి మాత్రం తీవ్రంగా.... అంగన్‌వాడీలకు ఇస్తున్నది అతి తక్కువ వేతనాలే అయినా వారి మీద వృత్తిపర ఒత్తిడి మాత్రం తీవ్రంగానే వుంటోంది. వారి చుట్టూ ఎన్నో రాజకీయాలు. నిత్యం అభద్రత. ప్రభుత్వాలు మారిన్నప్పుడల్లా చాలామంది అంగన్‌వాడీల పోస్టులు ఊడిపోతున్నాయి. ఎప్పుడు ఎవరిని ఏ కారణంతో తీసేస్తారో అర్ధంకాని దురావస్థ. ఇక స్థానిక రాజకీయ నేతల పెత్తనం సరేసరి. అధికార పార్టీ పెట్టే ప్రతి మీటింగ్‌కీ వీరు హాజరుకావాల్సిందే. ఎవరైనా హాజరుకాకపోతే ఇక వారి మెడ మీద కత్తి వేలాడుతూనే వుంటుంది. వీటికి తోడు అధికారుల వేధింపులూ తప్పవు. ఒక్కొక్కసారి లైంగిక వేధింపులనూ భరించాల్సి వస్తోందంటే అంగన్‌వాడీలు ఎలాంటి పరిస్థితుల్లో బతకాల్సి వస్తుందో అర్ధం చేసుకోవచ్చు. గొంతెమ్మ కోర్కెలు కావు... దేశవ్యాప్తంగా వున్న 18 లక్షల మంది అంగన్‌వాడీలు గొంతెమ్మ కోరికలేవీ కోరడం లేదు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలనీ, కనీస వేతనం ఇవ్వాలనీ, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలనీ, రాజకీయ వేధింపులు లేకుండా చూడాలని మాత్రమే కోరుకుంటున్నారు.



Followers