ఓటరు జాబితాను రూపొందించేందుకు... 'లింకు'పాట్లు


హైదరాబాద్ మహానగరానికి ఎలాంటి లోపాల్లేని ఓటరు జాబితాను రూపొందించేందుకు జాతీయ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటరుకార్డు నెంబర్‌ను ఆధార్ నెంబర్‌తో అనుసంధానం చేసేందుకు అధికారులు నానా పాట్లు పడుతున్నారు. నగరంలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని సుమారు మూడువేల పై చిలుకు పోలింగ్ స్టేషన్లలో ఈ ఆధార్-ఓటరు కార్డు లింకు ప్రక్రియను పూర్తి చేసేందుకు బల్దియా అధికారులకు కమిషనర్ సోమేశ్‌కుమార్ ఈ నెలాఖరు వరకు గడువు విధించిన సంగతి తెలిసిందే! కానీ గతంలో కూడా కార్వాన్, నాంపల్లి, ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ లింకు ప్రక్రియతో అనేక బోగస్ ఓట్లను ఏరివేసిన అధికారులు ఇపుడు పారదర్శకతతో విధులు నిర్వర్తించలేకపోతున్నారు. లింకు ప్రక్రియను ఈ నెలాఖరులోపు ముగించాలంటూ కమిషనర్ సోమేశ్‌కుమార్ ఇప్పటికే డిప్యూటీ కమిషనర్లకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయటంతో వారు క్షేత్ర స్థాయి సిబ్బందిపై వత్తిడి తెస్తున్నారు. కానీ గతంలో బిసి ఓటర్ల గుర్తింపు, కొత్త ఓటర్ల నమోదు, జాబితాలో తప్పోప్పుల సవరణ వంటి ప్రక్రియలకు సంబంధించి మొక్కబడిగా విధులు నిర్వర్తించిన విధంగానే ఇపుడు పరిస్థితి తయారైంది. పలు ప్రాంతాల్లో ఓటర్లు గ్రేటర్ సిబ్బందికి సహకరించకపోవటం ఇందుకు ప్రధాన కారణమం. ఎప్పటికపుడు అధికారులు ఈ ప్రక్రియకు గడువులు విధించటం వల్ల ఆశించిన స్థాయిలో ముందుకు సాగటం లేదని కొందరు సిబ్బంది బహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. తొలుత ఓటర్లకు అవగాహన కల్పించిన తర్వాత ఇలాంటి కార్యక్రమాల్ని నిర్వహిస్తే ప్రజల నుంచి చక్కటి స్పందన వస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. పని వత్తిడి అధికంగా ఉండే సర్కిల్ పది వంది సిబ్బంది మాత్రం ఎప్పటికపుడు తమకు క్షేత్ర స్థాయి విధులు కేటాయించటం, అందుకు గడువును విధించటం పట్ల విరక్తి వ్యక్తం చేస్తున్నారు. గత నెల 31వ తేదీవరకు ఆస్తి పన్ను టార్గెట్లతో ఉరుకులు, పరుగులు పెట్టిన తాము ఇపుడు ఓటరు కార్డు నెంబర్‌కు ఆధార్ నెంబర్ లింకు కోసం అవస్థలు పడాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. గతంలో కూడా పేర్లు, ఇంటినెంబర్, ఇంటిపేరు వంటి వివరాలతో రిపీట్ అయిన బోగస్ ఓటర్లను ఏరివేసేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన సాధించని ఫలితం ఇపుడు ఆగమేఘాలపై ఎలా సమకూరుతుందని మరికొందరు సిబ్బంది వాపోతున్నారు. 'ఆధార్' అనుసంధానానికి ప్రత్యేక శిబిరాలు ఆంధ్రభూమి బ్యూరో హైదరాబాద్, ఏప్రిల్ 17: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశం మేరకు ఓటరు గుర్తింపు కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానం చేసుకునేందుకు వీలుగా ఈ నెల 19, 26 తేదీల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటుచేస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.రఘునందనరావు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఆదివారాల్లో బూత్ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని, ఓటర్ల జాబితాలో సవరణ, తొలగింపులు, ఫొటోల సమర్పణతోపాటు ఆధార్, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడిని వారికి అందజేయాలని ఆయన పిలుపునిచ్చారు. తమతమ వివరాలను సమర్పించుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Followers