ఎల్‌నినో మరింత తీవ్రం!


కామన్వెల్త్ వాతావరణ బ్యూరో వెల్లడి -వర్షాలు బాగానే ఉంటాయన్న స్కైమెట్ -మే 27నాటికి కేరళను తాకనున్న నైరుతి న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: అకాల వర్షాల కారణంగా చేతికొచ్చిన పంటలు మట్టిపాలై తల్లడిల్లుతున్న రైతులకు ఎల్‌నినో మరింత భయపెడుతున్నది. గత నైరుతి రుతుపవనాల కాలం కంటే ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం కొద్దిగా పెరిగిందని, దీని ప్రభావంతో రాబోయే నైరుతిలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడొచ్చని ఆస్ట్రేలియాలోని కామన్వెల్త్ వాతావరణ బ్యూరోకు చెందిన సదరన్ ఓసిల్లేషన్ ఇండెక్స్ (ఎస్‌ఓఐ) వెల్లడించింది. గత సీజన్‌లో ఎల్‌నినో ప్రభావం 50 శాతం ఉండగా ప్రస్తుతం అది 70 శాతానికి పెరిగిందని జపాన్‌కు చెందిన బ్రోకరేజీ సంస్థ నొమురా కూడా పేర్కొంది. వర్షాభావంతో పంటల దిగుబడి తగ్గిపోయి భారత్‌లో ఆహార ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదముందని పేర్కొంది. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సాధారణంకన్నా పెరిగితే నైరుతి రుతుపవనాలకు మూలమైన సముద్ర పవనాల్లో తేమలోపించి తద్వారా రుతుపవన కాలంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతాయి. దీనినే ఎల్‌నినోగా పిలుస్తున్నారు. మహాసముద్రాల డోళన పరిస్థితులపై రేటింగ్ ఇచ్చే ఎస్‌ఐవో గత నెలలో 0.6 రేటింగ్vఇవ్వగా ప్రస్తుతం దానిని -11.2 పాయింట్లకు తగ్గించింది. -8 కంటే కిందికి పడిపోతే ఎన్‌నినో ప్రభావం ఉన్నట్లు గుర్తిస్తారు. దీంతో వచ్చే ఖరీఫ్ సీజన్‌లో ఎన్‌నినో ప్రభావం తప్పదని ఎస్‌ఐవో అంచనావేస్తున్నది. ఈ అంచనాలతో ప్రైవేటు వాతావరణ అధ్యయన సంస్థ స్కైమెట్ విభేదించింది. ఈ ఏడాది భారత్‌లో వర్షాలు సాధారణంగానే ఉంటాయని తెలిపింది. నైరుతిలో సాధారణ వర్షపాతం 96 నుంచి 104 మధ్య ఉండగా ఈ ఏడాది 102 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది. అయితే, దక్షిణ భారత్‌లో కొన్నిచోట్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడొచ్చని అంచనావేసింది. తమిళనాడు, దక్షిణ మధ్య కర్ణాటక, రాయలసీమ, తూర్పు మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్‌లో వర్షపాతం తగ్గవచ్చని స్కైమెట్ సీఈవో జతిన్ సింగ్ తెలిపారు. నైరుతి రుతుపవనాలు సాధారణంకన్నా నాలుగురోజుల ముందే మే 27వ తేదీనాటికి కేరళతీరాన్ని తాకే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.


Followers