క్యాటగిరీలవారీగా ఖాళీల సేకరణ
-ప్రాథమిక వివరాలతో సర్కారుకు విద్యాశాఖ నివేదిక
-ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకీ సన్నాహాలు
-సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కారం దిశగా కసరత్తు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ:పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ, స్థానిక
సంస్థల పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి ఆ శాఖ ఉన్నతాధికారులు
కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి
ఎస్‌జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, పీఈటీ, లాంగ్వేజీ పండిట్ పోస్టులతోపాటు
హెడ్ మాస్టర్ల పోస్టులనూ భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.
వాటితోపాటే ఎయిడెడ్ పాఠశాలల్లోని పోస్టులను కూడా భర్తీ చేయాలని విద్యా శాఖ
భావిస్తున్నది. అందుకోసం జిల్లాలు, క్యాటగిరీలవారీగా వివరాలు
సేకరించినట్లు తెలిసింది. ఈ వివరాలతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు
సమాచారం. రాష్ట్రంలో మొత్తం 20,253 ఉపాధ్యా య ఖాళీలు ఉన్నట్లు విద్యాశాఖ
ప్రాథమికంగా తేల్చింది. అందులో 17,579 పోస్టులు ప్రభుత్వ, జిల్లా పరిషత్తు
పాఠశాలల్లో, 2,930 పోస్టులు ఎయిడెడ్ పాఠశాలల్లో ఉన్నట్లు సమాచారం.
ఇవి కాకుండా క్రాఫ్ట్, డ్రాయింగ్ టీచర్ వంటి
పోస్టులన్నీ కలిపి మరో 2,674 ఖాళీలు ఉండే అవకాశముందని విద్యాశాఖ అధికారులు
అంచనా వేసినట్లు తెలిసింది. ఉపాధ్యాయుల పదవీ విరమణలతో ఖాళీల సంఖ్య మరింత
పెరిగే అవకాశాలున్నాయి. వచ్చే నెలలో టీచర్ల రేషనలైజేషన్, పదోన్నతులు,
బదిలీల ప్రక్రియ పూర్తిచేసిన తర్వాత ఉపాధ్యాయ ఖాళీలపై మరింత స్పష్టత వచ్చే
అవకాశాలు ఉన్నాయని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. ఈ లోగా ఎంతో కాలంగా
పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్‌పై కూడా ఒక అభిప్రాయానికి
రావాల్సి ఉంటుందని చెప్తున్నారు.
టీచర్ల ఖాళీల భర్తీకి ఉమ్మడి సర్వీస్ రూల్స్ అడ్డు రాకుండా అన్నిరకాల
చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఈ సమస్యను
పరిష్కరించకుండా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీచేసే ఇబ్బందులు ఎదురయ్యే
ప్రమాదముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఈ అంశంలో తగు నిర్ణయం
తీసుకోవాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు సమాచారం.
భవిష్యత్తులో టీచర్లకు సర్వీస్ రూల్స్ సమస్య లేకుండా చూడాలని తీవ్రంగా
ఆలోచిస్తున్నట్లు తెలిసింది. సర్వీసు రూల్స్ సమస్యను తక్షణమే
పరిష్కరించడానికి అవసరమైతే న్యాయ నిపుణుల సలహాలు స్వీకరించడం,లేదా కోర్టుల
నుంచి అనుమతి పొందడం వంటి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఉమ్మడి సర్వీసు
రూల్స్‌కు సంబంధించిన కేసు ప్రస్తుతం సుప్రీంలో పెండింగ్‌లో ఉన్నది. దానిని
కాదని ప్రభుత్వం సొంతంగా ఏ నిర్ణయం తీసుకొంటుందో అన్న అంశంపైనా సర్వత్రా
ఆసక్తి నెలకొంది.