ఇంజినీరింగ్‌ ప్రవేశాల్లో మూడో విడత కౌన్సెలింగ్‌ ఉండబోదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది


ఇంజినీరింగ్‌ ప్రవేశాల్లో మూడో విడత కౌన్సెలింగ్‌ ఉండబోదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక మిగిలిన సీట్లన్నీ స్పాట్‌ అడ్మిషన్ల రూపంలోనే భర్తీ చేసుకోవాలని తేల్చిచెప్పింది. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి శుక్రవారం ఈ విషయం తెలిపారు. రాష్ట్రంలో రెండో విడత కౌన్సెలింగ్‌ తర్వాత 31వేల సీట్లు కన్వీనర్‌ కోటాలో మిగిలిపోయిన సంగతి తెలిసిందే. వీటిలో దాదాపు 26వేల సీట్లు ఇంజినీరింగ్‌వే! మిగిలినవి ఫార్మసీ సీట్లు. రెండు విడతల్లోనూ సీట్లు రాని విద్యార్థులు సుమారు 3500 మంది దాకా ఉన్నారు. ఆప్షన్లను సరిగ్గా పెట్టుకోని కారణంగా వీరందరికీ సీట్లు రాలేదన్నది అధికారుల వివరణ. వీరికీ అవకాశం కల్పించేలా మూడో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించాలని తొలుత భావించారు. కానీ ఆగస్టు లోపు కౌన్సెలింగ్‌ పూర్తికావాలన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మరోమారు కౌన్సెలింగ్‌కు వెళితే ఇబ్బందులు ఎదురవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఆగస్టు 15 దాకా మిగిలిన సీట్లను భర్తీ చేసుకోవచ్చని సుప్రీంతీర్పులో ఉంది. కానీ కౌన్సెలింగ్‌ అడ్మిషన్ల ద్వారానా అనే స్పష్టత లేదు. గతంలో వీటన్నింటినీ కాలేజీల్లో స్పాట్‌ అడ్మిషన్ల రూపంలోనే భర్తీ చేశారు. ఒకవేళ అందుకు భిన్నంగా చేస్తే ఎవరైనా కోర్టుకు వెళితే మొత్తం ప్రక్రియే ఇబ్బందుల్లో పడుతుందన్నది ప్రభుత్వ ఆందోళన. అందుకే మూడోవిడత కౌన్సెలింగ్‌ను వదలుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. స్పాట్‌ అడ్మిషన్లకు తెలంగాణ ఉన్నత విద్యామండలి త్వరలోనే ప్రకటన వెలువరిస్తుంది. ఆతర్వాత ఆయా కళాశాలలు విడివిడిగా పత్రికా ప్రకటనలిచ్చి ఏదో ఒకరోజు ప్రవేశాలు నిర్వహిస్తాయి. ఈప్రక్రియ 15లోపు పూర్తికావాల్సి ఉంటుంది.

Followers