16వ శతాబ్దం నాటిదని అంచనాసమ్మర్ ప్యాలెస్ అవశేషాల గుర్తింపుతవ్వకాల్లో
గుర్తించిన అగాఖాన్ ట్రస్ట్‌సందర్శించిన అమెరికా రాయబారి మైఖేల్‌ఈనాడు,
హైదరాబాద్: వందల ఏళ్ల చరిత్ర కలిగిన కుతుబ్‌షాహీ సమాధుల్లో పురాతన సొరంగం
బయటపడింది. గోల్కొండ కోట నుంచి సమాధుల వరకు ఈ సొరంగం ఉన్నట్లు అంచనా
వేస్తున్నారు. గోల్కొండ కోటను పాలించే కుతుబ్‌షాహీల్లో ఎవరైనా మరణిస్తే
సమాధుల వద్దకు తీసుకెళ్లేందుకు దీన్ని నిర్మించి ఉంటారని భావిస్తున్నారు.
సొరంగ మార్గంతోపాటు ఒక ఉద్యానం, సహాయకుల కోసం నిర్మించిన వేసవి భవంతి
(సమ్మర్ ప్యాలెస్) తవ్వకాల్లో బయటపడ్డాయి. ఈ తవ్వకాలను తెలంగాణ
పురావస్తుశాఖ తోడ్పాటుతో అగాఖాన్ ట్రస్ట్ సాంస్కృతిక విభాగం గతేడాది
సెప్టెంబరులో చేపట్టింది. దీనికి అమెరికా రాయబారుల సంస్కృతి పరిరక్షణ నిధి
(ఏఎఫ్‌సీపీ) 1.01 లక్షల డాలర్లు మంజూరు చేసింది. హైదరాబాద్ వచ్చిన అమెరికా
రాయబారి మైఖేల్ పిల్లెటైర్ శుక్రవారం సమాధుల్లో బయటపడిన సొరంగాన్ని
సందర్శించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా 125
దేశాల్లో 800 సాంస్కృతిక పరిరక్షణ ప్రాజెక్ట్‌లకు నిధులు
అందజేస్తున్నామన్నారు. దీనిలో భాగంగా
హైదరాబాద్‌లోని కుతుబ్‌షాహీ సమాధుల ప్రాంగణంలోని తవ్వకాలకూ
సాయమందిస్తున్నామని చెప్పారు. ఇక్కడ స్థానిక కూలీలతోనే తవ్వకాలు
చేపట్టడాన్ని ఆయన ప్రశంసించారు. పురాతన భవనాలు, ఆనవాళ్లను
వెలికితీయడంతోపాటు అప్పటి సాంకేతికతను పరిరక్షించేందుకు చర్యలు
చేపడుతున్నామని మైఖేల్ వివరించారు.మండువేసవిలోనూ చల్లదనం..తవ్వకాల్లో
సొరంగంతోపాటు వేసవి భవంతి నిర్మాణ అవశేషాలను గుర్తించినట్లు అగాఖాన్
ట్రస్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రతీష్‌నందా, కె.కె.మహ్మద్ వివరించారు.
''15, 16వ శతాబ్దాల్లో గోల్కొండ కోటను పాలించిన కుతుబ్‌షాహీలు 106 ఎకరాల్లో
ఒకవైపు సమాధుల నిర్మాణం చేపట్టారు. ఇప్పుడున్న మ్యూజియం వెనకవైపు సహాయకుల
కోసం వేసవిభవంతి (సమ్మర్ ప్యాలెస్)ని నిర్మించారు. వీటి కింది భాగం నుంచి
నీటిపైపులు బయటబడ్డాయి. మండువేసవిలోనూ చల్లగా ఉండేందుకే ఈ ఏర్పాట్లు
చేసినట్లు తెలుస్తోంది. ఆ రోజుల్లో సమాధుల పక్కనే ప్రార్థన చేసేందుకు
మసీదుల నిర్మాణం చేపట్టారు. తిలవత్ ఖురాన్ పఠించేవారు. వీరి కోసమే వేసవి
భవంతిని నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ తవ్వకాల్లో చైనీస్, ఇండోనేషియా,
జకార్తా, ఇజ్రాయిల్ శైలి నిర్మాణాలు బయటపడ్డాయి. మొదటి కులీకుతుబ్
ముల్క్ సమాధి ఎదురుగా ఒక ఉద్యానం, గోల్కొండ కోటవైపు ప్రహరీకి ఆనుకుని
సొరంగ మార్గాన్ని తవ్వకాల్లో గుర్తించాం. ఈ తవ్వకాల పనులు డిసెంబరు నాటికి
పూర్తవుతాయి'' అని వారు వివరించారు.