ఏ రకమైన బ్లడ్ క్యాన్సర్‌ని అయినా ఒకే ఒక రక్తపరీక్షతో కనుక్కోగలగడం
ఇప్పుడు సాధ్యమవుతుందంటున్నారు పరిశోధకులు. ప్రస్తుతం ఉన్న రక్తపరీక్ష
ద్వారా 60 శాతం కేసులను గుర్తించగలుగుతున్నప్పటికీ మిగిలినవాటికి కారణాన్ని
కనుక్కోగలగడం సాధ్యం కాలేదు. అయితే ఇటీవల కేంబ్రిడ్జి యూనివర్సిటీ
అధ్యయనంలో మిగిలిన 40 శాతం బ్లడ్ క్యాన్సర్లకు కారణమయ్యే జన్యువును
గుర్తించగలిగారు పరిశోధకులు. న్యూజిలాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ఈ
పరిశోధనాంశాలు ప్రచురితమయ్యాయి. ఇప్పటివరకు క్రానిక్ బ్లడ్ క్యాన్సర్లను
గుర్తించడానికి రకరకాల పరీక్షలు చేయాల్సి వస్తోంది. ఎర్ర రక్తకణాలు,
ప్లేట్‌లెట్లు ఎక్కువ సంఖ్యలో తయారు కావడం వల్ల వచ్చే ఈ క్యాన్సర్ల వల్ల
రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడతాయి. తద్వారా గుండెపోటు, స్ట్రోక్ వచ్చి
ప్రాణాపాయం కలుగుతుంది. కొంతమందిలో ఈ క్యాన్సర్లు ఉన్నప్పటికీ ఎటువంటి
లక్షణాలు కనిపించవు. మరికొందరిలో ఇవి ల్యుకేమియాగా మారవచ్చు. ఇప్పుడు ఒక్క
రక్తపరీక్షతో అన్ని రకాల క్యాన్సర్లనూ గుర్తించవచ్చు అని చెప్పారు
కేంబ్రిడ్జి యూనివర్సిటీ హెమటాలజీ ప్రొఫెసర్ టోనీ గ్రీన్. ఇప్పుడు
కనుక్కున్న సీఏఎల్‌ఆర్ జన్యువు కణస్థాయిలో
ప్రభావం చూపిస్తుంది. కణంలో తయారైన ప్రొటీన్లను మెలికలు పడేలా చేస్తుంది. ఈ
జన్యుపరీక్ష వల్ల బ్లడ్ క్యాన్సర్లకు ఆధునిక చికిత్సలను కనుక్కోగలిగే
వీలుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు కేంబ్రిడ్జి యూనివర్సిటీ అధ్యయనంలో
పాల్గొన్న డాక్టర్ జ్యోతి నంగాలియా.
ఎక్కడున్నా ఓటు.. కుర్రాడు చూపిన రూటు!
బ్యాంకు ఖాతా ఎక్కడున్నా ఫర్వాలేదు. చేతిలో ఏటీఎం కార్డు ఉంటే చాలు. దేశంలో
ఎక్కడి నుంచైనా డబ్బు తీసుకోవచ్చు. మరి ఓటేయాలంటే? తప్పనిసరిగా కేటాయించిన
పోలింగ్ కేంద్రానికే వెళ్లాలి. ఏటీఎం కార్డు సదుపాయంలాగే దేశంలో ఏ
మూలనున్నా ఓటేసే సౌలభ్యం ఉంటే బాగుంటుంది కదా అనేది నిజామాబాద్ కుర్రాడు
దివ్యేశ్ ఆలోచన. దాన్ని ఆచరణలో పెట్టాడు. పది నెలలు కష్టపడితే నమూనా
పరికరం తయారైంది. ఈ ప్రతిభకి జాతీయస్థాయి గుర్తింపు కూడా దక్కింది. దేశం
ఎన్నికల హడావుడిలో ఉన్న ఈ సందర్భంలో ఆ సంగతేంటో తెలుసుకుందామా? దివ్యేశ్
చదువులో మహా చురుకు. టెన్త్, ఇంటర్లో రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటాడు.
ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలో 51వ ర్యాంకొచ్చింది. బీటెక్‌లో ఉచితంగా
సీటిచ్చింది తమిళనాడులోని కోయంబత్తూరులో ఓ కాలేజీ. సెకండియర్‌లో సొంతూరు
డిచ్‌పల్లిలో ఎన్నికలు జరిగాయి. తొలిసారి ఓటుహక్కు వినియోగించుకోవాలన్న
ఆరాటం ఓవైపు. అంత దూరం వెళ్లొస్తే క్లాసులు మిస్ అవుతాననే భయం మరోవైపు.
రైల్ రిజర్వేషన్ కూడా దొరికే పరిస్థితి లేదు. చివరికి ఓటు వేయలేక
ఉసూరుమన్నాడు. ఆ అసంతృప్తిలో నుంచి పుట్టిందే దేశంలో ఎక్కడున్నా సొంత
వూరిలో ఓటుహక్కు
వినియోగించుకునే పరికరం తయారు చేయాలనే సంకల్పం. ఆలోచనని హెచ్‌వోడీతో
పంచుకున్నాడు. 'పని ప్రారంభించు అవసరమైన సాయం మేం చేస్తాం'
అన్నారాయన.దివ్యేశ్ కాలేజీలో విద్యార్థుల హాజరు కోసం బయోమెట్రిక్ మెషీన్
ఉపయోగించేవారు. అందులో బొటనవేలు పెట్టగానే ముద్రల సాయంతో క్లాసులకు
హజరైందీ, లేనిదీ తెలిసిపోయేది. చాలా సంస్థల్లో ఉద్యోగులకూ ఇదే విధానం
ఉంటుంది. ఇదే సూత్రం ఓటర్లకి ఉపయోగించేలా నమూనా పరికరం తయారు చేయాలకున్నాడు
తను. బయోమెట్రిక్ మెషీన్‌తో పాటు, ఒక ల్యాప్‌టాప్, ఏటీఎంని పోలిన
చిన్నపరికరాన్ని ముడి యంత్రాలుగా తీసుకున్నాడు. వీటిని అనుసంధానించేలా
సాఫ్ట్‌వేర్ కోడ్ రాయడం మొదలుపెట్టాడు. ఈ సాఫ్ట్‌వేర్‌లో రెండు
డేటాబేస్‌లుంటాయి. మొదటి దాంట్లో ఓటరు వేలిముద్రలు, పేరు, నియోజకవర్గ
వివరాలు మొత్తం వివరాలుంటాయి. పరికరం తాకే తెరపై వేలిముద్ర పెట్టగానే అతడి
నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థుల వివరాలు, పార్టీ, గుర్తులు
కనిపిస్తాయి. నచ్చినవాళ్లకి ఓటేయగానే ఆ ఓటు ఆటోమేటిగ్గా రెండో
డేటాబేస్‌లోకి బదిలీ అవుతుంది. ఈ వివరాలన్నీ ప్రధాన సర్వర్‌లో నిక్షిప్తం
అవుతాయి. మరోసారి ప్రయత్నించినా ఓటేయడానికి అవకాశం ఉండదు. ఇరవై మంది
స్నేహితుల్నే ఓటర్లుగా మార్చి నమూనా పరికరంతో ఈ ఓటింగ్‌ని విజయవంతంగా
పూర్తి చేశాడు దివ్యేశ్. అయితే ఈ ఆలోచన కార్యరూపం దాల్చడానికి పది నెలలు
పట్టింది. సాఫ్ట్‌వేర్ కోడ్ రాస్తుంటే మధ్యమధ్యలో కోడ్ ఎర్రర్‌లు
వచ్చేవి. వాటన్నింటినీ విజయవంతంగా అధిగమించాడు. దీని కోసం అతడు
వెచ్చించింది కేవలం రూ.3,500 మాత్రమే. ఈ పరికరాన్నే తన ఇంజినీరింగ్
ప్రాజెక్టుగా సమర్పించాడు. ఇది ఎస్.ఆర్.ఎం.యూనివర్సిటీ నిర్వహించిన
ఇంటర్ యూనివర్సిటీస్ కాంపిటీషన్స్‌లో ఉత్తమ ప్రాజెక్ట్‌గా ఎంపికైంది.
దీని కోసం దేశవ్యాప్తంగా విద్యార్థులు రూపొందించిన 1800 ప్రాజెక్టులు
పోటీపడ్డాయి. మన దేశంలో జరిగే ప్రతి ఎన్నికల్లో ఓటింగ్ శాతం అరవై, డెబ్భై
శాతం దాటడం లేదు. కారణం చాలా మంది ఉద్యోగులకు ఓటుహక్కు ఒకచోట ఉంటే,
పనిచేసేది వేరొకచోట. భారీ వరుసలో నిల్చొని ఓటేయడం పెద్ద ప్రయాసగా
భావించేవాళ్లూ ఉన్నారు. చదువు కోసం వేరే చోటికి వెళ్లే కాలేజీ విద్యార్థుల
సంఖ్యా తక్కువేం కాదు. ఇలాంటి పరికరాలను పెద్దస్థాయిలో ఉత్పత్తి చేస్తే
ఓటింగ్ శాతం కచ్చితంగా 90 శాతం దాటే అవకాశం ఉందంటాడు దివ్యేశ్. పైగా
ఇందులో దొంగ ఓట్లు, ఒక్కరే రెండుసార్లు ఓటువేసే అవకాశం ఉండదు. ఓటింగ్
రోజుల్నీ వీలైనన్ని రోజులు పొడిగించుకోవచ్చు. ఆన్‌లైన్‌కి అనుసంధానం చేస్తే
సౌలభ్యం, యూత్‌ని ఆకట్టుకోవచ్చు. అయితే 120 కోట్లకు పైగా జనాభా ఉన్న ఈ
దేశంలో అంత మందికి సరిపోయేలా యంత్రాలు తయారు చేయడం భారీ వ్యయప్రయాస,
ఖర్చుతో కూడుకున్న వ్యవహారమైనా పూర్తిగా అసాధ్యం మాత్రం కాదంటున్నాడు తను.
'ఆధార్' కోసం సేకరించిన వేలిముద్రలు, వివరాలతోనే దీన్ని అమలు చేయొచ్చని
అతడి సూచన. ఈ విధానంపై తాను త్వరలో విశ్వవిద్యాలయ అధికారులతో కలిసి,
ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తానంటున్నాడు.
Subscribe to:
Comments (Atom)