ఎపిపిఎస్‌సి ఎగ్జామ్స్‌కు ఏ పుస్తకాలు చదవాలి?


ఎపిపిఎస్‌సి వివిధ రిక్రూట్‌మెంట్లకు ప్రశ్నపత్రాలను రూపొందిం చేటప్పుడు ఏ పుస్తకాలను ప్రామాణికంగా తీసుకుంటుంది? ఎన్‌సిఇఆర్‌టి పుస్తకాలు వంటివి రిఫరెన్స్‌గా తీసుకుంటుందా? ఎపిపిఎస్‌సి పరీక్షలకు ఏ పుస్తకాలు చదవడం మంచింది?- ఆర్. రమణ, నిజామాబాద్. జ : ఎపిపిఎస్‌సి నిర్వహించే పోటీపరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాల రూపకల్పనలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. సాధారణంగా ప్రతి పరీక్షకు సంబంధించి విడుదల చేసిన సిలబస్, ఆధారంగానే ప్రశ్నపత్రాలు రూపొందుతాయి. అయితే సిలబస్ రూపకల్పన సందర్భంలో మాత్రమే ఎపిపిఎస్‌సి పాత్ర ఉంటుంది. అదీ కూడా ఒక నిపుణులు కమిటీ సూచించిన విధంగానే సిలబస్‌ను ఫైనల్ చేయడం జరుగుతుంది. ప్రశ్న పత్రాల రూపకల్పన అంతా కూడా సంబందిత సబ్జెక్టు ఎక్స్‌ఫర్ట్స్‌తో జరుగుతుంది. ఇందులో ఎపిపిఎస్‌సి పాత్ర ఎంత మాత్రం ఉండదు. అయితే ఆయా సబ్జెక్టు ఎక్స్‌పర్ట్స్‌ను ఎంపిక చేయడంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ఎంపికలో సాధారణంగా సీనియర్ వెూస్ట్ ప్రొఫెసర్, సంబంధిత సబ్జెక్టుకు సంబంధించిన వర్తమాన అంశాలను నిరంతరం ఫాలో అవుతున్న వారికి మొదటి ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుంది. ప్రశ్న పత్రాల రూపకల్పన సమయంలో ఎపిపిఎస్‌సి కేవలం సిలబస్‌ను మాత్రమే ఎక్ప్‌పర్ట్‌కు ఇవ్వడం జరుగుతుంది. ప్రశ్నల స్థాయి, తీరు ఎక్స్‌పర్ట్ విచక్షణకే వదిలివేయడం జరుగుతుంది. ఎక్స్‌పర్ట్స్ సాధారణంగా ఆయా సిలబస్‌లోని అంశాలు గల స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్స్ నుండే ప్రశ్నలను రూపొందించడం జరుగుతుంది. పబ్లికేషన్ డివిజన్, సమాచార మంత్రిత్వశాఖ ప్రచురించిన పుస్తకాలను, ఎన్‌సిఇఆర్‌టి, ప్రభుత్వ విభాగాలు రూపొందించిన పుస్తకాలు (తెలుగు అకాడమి లాంటివి) రిఫర్ చేసి ప్రశ్నలను రూపొందిస్తారు. అయితే పుస్తకాలలోని సమాచారాన్ని యథాతదంగా మాత్రం ఇవ్వడం జరగదు. అందువల్ల వీటిని చదివి అర్థం చేసుకోగలిగితేనే ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించడం సాధ్యం అవుతుంది. కాబట్టి చదివిన సమాచారాన్ని వివిధ కొణాలలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వ్యాసం ఎన్ని పేజీలు రాయాలి? ప్ర : గ్రూప్-1 మెయిన్స్‌లో ఎస్సే పేపర్‌లో రాయవలసిన మూడు వ్యాసాలలో ప్రతివ్యాసం మాములుగా ఎన్ని పేజీలు రాయాలి? కొంతమంది అభ్యర్థులు సగటున మూడు వ్యాసాలకు కలిపి 20 పేజీలు రాస్తుండగా, మరికొంతమంది అభ్యర్థులు చాలా ఎక్కువ పేజీలు రాయడం జరుగుతుంది. వీటిలో ఏది సరైన పద్ధతి?- కె. సుదీర్, కరీనంగర్. జ : గ్రూప్-1 జనరల్ ఎస్సే పేపర్‌లో మూడు గంటల సమయంలో మూడు వ్యాసాలు రాయాల్సి ఉంటుంది. అయితే మీరు అడిగిన ప్రశ్నలో సమాధానం ఎన్ని పేజీలలో రాయాలన్న విషయం కేవలం అపోహ మాత్రమే. గతంలో ఒకే వ్యాసం రాసే పద్ధతి ఉండేది. మారిన నూతన విధానంలో ఇదే సమయంలో మూడు వ్యాసాలను రాయాల్సి ఉంటుంది. అంతే కాకుండా ప్రశ్న చాలా సుదీర్ఘంగా విభిన్న భాగాలుగా విభజింపబడి ఉంటుంది. ఇది ఒక రకంగా గతంలోని ఆప్షనల్స్ పేపర్లలో వ్యాసరూప ప్రశ్నల కన్నా కొంచెం ఎక్కువ సమాధానాన్ని రాసే విధంగా ఉంటున్నాయి.జనరల్ ఎస్సే రాసేటప్పుడు పేజీల సంఖ్య కన్నా అందు బాటులో వున్న సమయంలో ప్రశ్నలో అడిగిన అన్ని అంశాలను సృశిస్తూ, మిగతా అభ్యర్థుల కన్నా నాణ్యమైన, ఖచ్చితమైన, నిర్థిష్ఠమైన , తక్కువ పదాలలో ఎక్కువ అర్థం వచ్చే విధంగా , సరళమైన భాషలో సులువుగా అర్థమయ్యే విధంగా వేగంగా రాయగలడం పై ప్రధానంగా దృష్టి సారించాలి.పేజీల సంఖ్య అనేది ముఖ్యంకాదు , సమాధానంలోని సమాచారం అత్యంత కీలకమని గుర్తించాలి. అయితే ఒక గంట సమయంలో, అక్షరాల సైజు సాధారణంగా రాయగల అభ్యర్థి అర్థమయ్యే రీతిలో కనిష్టంగా 8 పేజీలు, గరిష్టంగా 12 పేజీల వరకు రాయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో ఇతరులను అనుకరించకుండా రైటింగ్‌లో వేగాన్ని పెంచుకోవడం, భాషపైన పట్టు సాధించడం, ఎక్కువ సమాచారాన్ని కలిగి ఉండటం వంటి అంశాలకు అధిక ప్రాధాన్యతనివ్వడం మంచిది. గ్రూప్-2 ఎకానమీ చదివేదెలా? ప్ర : నాది గ్రామీణ నేపథ్యం, కోచింగ్ తీసుకునే ఆర్థిక స్థోమత లేదు. సొంతంగా ప్రిపేర్ అవుతున్నాను. డిగ్రీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో పూర్తి చేశాను. గ్రూప్-2లో మొదటి, రెండవ పేపర్లకు భాగానే ప్రిపేరవుతున్నాను. కానీ ఎకానమి పేపర్ గందరగోళంగా ఉంది. ఎకానమీకి అకాడమీ పుస్తకాలు చదువుతున్నాను. కానీ అవి గ్రూప్-2 సిలబస్‌కు అనుగుణంగా లేకపోవడం వలన ఏవి చదవాలో, ఏవి వదిలేయాలో తెలియడం లేదు. ఎకానమీలో నేను గట్టెక్కడానికి పరిష్కారం చూపగలరు? - అప్పాన సూర్య, కొత్తకోట. జ : ముందుగా మీరు మానసికంగా ప్రిపేర్‌కావాలి. గ్రామీణ నేపథ్యం, డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌తో ఐ.ఎస్ సాధించిన ఉదహరణలు కూడా ఉన్నాయి. అందువల్ల ఆత్మవిశ్వాసంతో ఆశావాద దృక్పథంతో ప్రిపేర్ కాగలిగితే అంతిమ విజయం మీదేనని బలంగా నమ్మాలి. వేలాది మంది అభ్యర్థులు ఉద్యోగాలను పొందుతున్నప్పుడు అది మనెందుకు సాధ్యం కాదన్న ప్రశ్న వేసుకోవాలి. గ్రూప్-2లో ఉద్యోగం పొందాలంటే డిగ్రీలు, కోచింగ్‌లు, ఆర్థిక స్థోమత, అదృష్టం వంటి అంశాలకన్నా కఠోర దీక్షతో, పట్టుదలతో నిరంతరం తెలుసుకోవాలన్న తపనతో, సాధించాలన్న కసితో ఒక యజ్ఞంలాగా సరైన గైడెన్స్‌తో శాస్త్రీయ పద్ధతిలో ప్రిపేర్ కావడానికే అధిక ప్రాధాన్యనివ్వాలన్న విషయాన్ని ప్రధానంగా గుర్తుంచుకోవాలి. ఇక గ్రూప్-2 ఎకానమి పేపర్‌లో అత్యదిక మార్కులు పొందాలంటే కొంచెం ఎక్కువ సమయం కేటాయించి, ఎక్కువగా కష్టపడటం తప్పనిసరి. ఎకానమికి సంబంధించిన మౌలికమైన అంశాలను తెలుసుకోవడానికి తెలుగు అకాడమి ఇంటర్ స్థాయి పుస్తకాలను చదవాల్సి ఉంటుంది. అదే విధంగా గ్రూప్స్ పరీక్షల కోసం ప్రత్యేకంగా రూపొందించిన అకాడమి పుస్తకాలను చదివేటప్పుడు, సిలబస్‌ను ముందు పెట్టుకొని అందులోని అంశాలకు సంబంధించిన సమాచారాన్ని పాయింట్ల రూపంలో నోట్ చేసుకోవాలి. అదే విధంగా రోజూ పేపర్లలో వస్తున్న ఎకానమీ సంబంధిత అంశాలను, పోటీపరీక్షల మ్యాగ్‌జైన్‌లలో వున్న అంశాలను నిరంతరం అనుసంధానించు కుంటూ చదవగలిగితే గరిష్ట మార్కులు పొందవచ్చు.

5 వ్యాసరూప నైపుణ్యాలకు పంచసూత్రాలు


డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ రాయడం చాలా కష్టమని, వాటిలో ఆశించిన మార్కులు సాధించడం అంత సలభం కాదని అభ్యర్థులు భావిస్తుంటారు. అయితే ఇందులో కొంత వాస్తవం ఉన్నా ఈ పరీక్షలకు అవసరమైన నైపుణ్యాలు పెంచుకుంటే వీటిలో కూడా విజయం సాధించవచ్చు. ఆ నైపుణ్యాలు ఏమిటో వివరంగా పరిశీలిద్దాం...పోటీపరీక్షలు రెండు రకాలుగా జరుగుతుంటాయి. అవి. 1. ఆబ్జెక్టివ్ పరీక్షలు, 2. డిస్క్రిప్టివ్ పరీక్షలు.పోటీపరీక్షల్లో ఎక్కువభాగం అబ్జెక్టివ్ తరహా పరీక్షలే ఉంటాయి. కానీ, కొన్ని ముఖ్యమైన పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షల్లో ఈ రెండూ కలిపి ఉంటాయి. ఉదాహరణకు జాతీయస్థాయిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్-1 పరీక్షల్లో రెండవ దశ అయిన మెయిన్స్‌లో భాగంగా ఈ తరహా డిస్క్రిప్టివ్ పరీక్షలు ఉంటాయి. మౌలిక ఉద్దేశ్యం ఏమిటి? సివిల్ సర్వీసెస్, గ్రూప్-1 వంటి పోస్టులకు డిస్క్రిప్టివ్ పరీక్షలు నిర్వహించడం వెనుక ఉన్న మౌలిక ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకుంటే ఈ తరహా పరీక్షలు రాయడానికి ఎటువంటి నైపుణ్యాలు అవసరవెూ అర్థమవుతుంది. సాధారణంగా ఆబ్జెక్టివ్ తరహా పరీక్షల్లో అభ్యర్థి ప్రశ్న క్రింద ఇచ్చే నాలుగు సమాధానాలలో సరైన దానిని గుర్తించాల్సి ఉంటుంది. దీని వలన అభ్యర్థి నాలెడ్జ్, అభ్యర్థి జ్ఞాపకశక్తి పరీక్షించినట్లవుతుందే తప్ప అంతకుమించి ఇతర ఏ నైపుణ్యాలు పరీక్షించడం వీలు కాదు. కానీ, వ్యాస రూప పరీక్షలలో (డిస్కిస్టివ్ పరీక్షలలో) అభ్యర్థి నాలెడ్జ్, జ్ఞాపకశక్తితో పాటు ఇంకా ఇతర నైపుణ్యాలు కూడా అంచనా వేయడానికి వీలవుతుంది. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థి వ్యక్తిత్వాన్ని ఎలా అంచనావేస్తారో అదే విధంగా డిస్కిప్టివ్ పరీక్షల ద్వారా కూడా అభ్యర్థి ఆలోచనా విధానం, సమస్యలను విశ్లేషించి పరిష్కారం చూపగల సామర్థ్యం , అతని అవగాహనా స్థాయితో పాటు అతని రైటింగ్ స్కిల్స్‌ను అంచనా వేయడానికి వీలవుతుంది.ఫలితంగా ఆయా పోస్టులకు సరైన అభ్యర్థులను ఎంపిక చేయడానికి వీలు కలుగుతుంది. గ్రూప్-1, సివిల్ సర్వీసెస్ వంటి పోస్టులకు నిర్వహించే మెయిన్స్ పరీక్షల్లో ఆప్షనల్ సబ్జెక్టులతో పాటు జనరల్ స్టడీస్, జనరల్ ఎస్సే పేపర్లు ఉంటాయి. అయితే గ్రూప్-1, సివిల్ సర్వీసెస్ వంటి పోస్టులకు అప్షనల్ సబ్జెక్టుల్లో ప్రావీణ్యం వలన ప్రయోజనం ఉండదని గ్రహించి వాటి ప్రాధాన్యం తగ్గించి, కామన్ పేపర్లు ప్రవేశపెట్టారు. గ్రూప్-1లో ఆప్షనల్ పేపర్లు పూర్తిగా తొలగించగా సివిల్స్ మెయిన్స్‌లో రెండు ఆప్షనల్స్ బదులు ఒక ఆప్షనల్ ప్రవేశపెట్టారు. అయితే డిస్క్రిప్టివ్ పేపర్లు ఏవైనప్పటికీ ఆ పరీక్షల్లో రాణించాలంటే కొన్ని ప్రధానమైన నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. ముఖ్యంగా మెయిన్స్‌లో ఎస్సే ప్రిపేర్‌కు ఇవి చాలా అవసరం. 1. స్పష్టమైన భావవ్యక్తీరణ డిస్కిప్టివ్ పరీక్షల్లో రాస్తున్న అంశానికి సంబంధించిన సమాచారం సులభంగా అర్థం అయ్యేలా భావ వ్యక్తీకరణ సూటిగా ఉండాలి. ఒక అంశాన్ని సమర్థిస్తూ రాసినా, వ్యతిరేకిస్తూ రాసినా వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు చదవగానే అర్థం అయ్యేలా ఉండాలి. ప్రశ్న ఒక కోణంలో అడిగితే, సమాధానం మరో కోణంలో రాయడం, అనవసర విషయాలు ప్రస్తావించడం వలన స్పష్టత లోపించి గందరగోళం ఏర్పడుతుంది. అడిగిన ప్రశ్నను సరిగ్గా అర్థం చేసుకొని అడిగినంత మేరకు నిర్థిష్టంగా రాయడం అలవాటు చేసుకోవాలి. ఇలా స్పష్టంగా, నిర్ధిష్టంగా రాయగల గాలంటే రాస్తున్న అంశంపై సమగ్రమైన అవగాహన, సంపూర్ణమైన సమాచారం ఉండాలి. అప్పుడే ప్రశ్నకు తగిన విధంగా సమాధానం రూపొందుతుంది. వ్యాసరూప పరీక్షల్లో రాసే సమాధానాలు అభ్యర్థికి ఉన్న పరిజ్ఞానాన్ని, అవగాహనను తెలియజేస్తాయి కాబట్టి సమాధానం అన్ని అంశాలతో సమగ్రంగా, స్పష్టంగా, సూటిగా ఉండేలా రాయడం అలవర్చుకోవాలి. 2. విశ్లేషణా సామర్థ్యం డిస్క్రిప్టివ్ పరీక్షలలో ముఖ్యంగా ఎస్సే పేపర్‌లో విశ్లేషణ ఒక ప్రధానమైన లక్షణం. అడిగిన అంశాన్ని అన్ని కోణాల్లో మంచి, చెడులను సృ్పశిస్తూ విశ్లేషిస్తూ రాయడం అవసరం. ఉదాహరణకు ఇటీవల సుప్రీంకోర్టు ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులలో ఎవరూ నచ్చనప్పుడు వారినందరిని తిరస్కరించే హక్కు ఓటర్లకు కల్పించాలి అని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుకు అనుగుణంగా మొదటిసారి ఓటింగ్ యంత్రాలలో త్వరలో 5 రాష్ట్రాలలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలో 'ఎవరూ కాదు' అనే కొత్త మీటను ప్రవేశపెడుతున్నారు. ఈ సంస్కరణ నిజంగా భారత ఎన్నికల వ్యవస్థలో ఒక విప్లవాత్మక సంస్కరణే. అయితే ఈ సంస్కరణ వలన కలిగే ప్రయోజనాలు, ప్రభావాలను కూడా తెలుసుకొని వాటిని రాయగలిగితేనే సమాధానం విశ్లేషణాత్మకం అనిపించు కుంటుంది. అదే సమయంలో లోపాలు ఏవైనా ఉంటే వాటికి పరిష్కారాలు, సూచనలు కూడా అందించగలగాలి. ఈ విధమైన విశ్లేషణతో కూడిన సమాచారం వార్తాపత్రికలలో సంపాదకీ యాలు వంటి వాటిలో లభిస్తుంది. కాబట్టి వాటిని చదవడం ద్వారా విశ్లేషణాత్మకంగా రాసే సామర్థ్యం పెంపొందించుకోవచ్చు. 3. సృజనాత్మకత వ్యాసరూప పరీక్షల్లో మిగతా వాటికంటే ఎక్కువ మార్కులు సాధించాలంటే రాసే సమాధానాలు మిగిలిన వాటితో పోలిస్తే ప్రత్యేకంగా కనపడాలి. సమాధానాలు మూసపద్ధతిలో సాదా సీదాగా ఉంటే ఆ సమాధానాలు ఎగ్జామినర్‌ను ఆకర్షించడంలో వెనుకబడతాయి. సమాధానాలు నూతనంగా, విభిన్నంగా ఉంటే సహజంగానే వాటికి మంచి మార్కులు లభిస్తాయి. ఇతరులు రాసే పాయింట్లతో పాటు మరికొన్ని ప్రత్యేకమైన పాయింట్లు రాయడానికి ప్రయత్నించడం, సమాధానాలలో సమకాలీన అంశాలను జత చేయడం ద్వారా సమాధానాలలో నూతనత్వం ప్రతిఫలించేటట్లు చేయవచ్చు. దీనికి విస్రృ్తత అధ్యయనం చాలా అవసరం. వినూ త్నంగా సమాధానాలు రాసే నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ఒక అంశం గురించి ప్రిపేరయ్యేటప్పుడే ఆ అంశంపై ప్రశ్న వస్తే ఏ విధంగా విభిన్నంగా రాయవచ్చో ఆలోచించా లి. ఈ నైపుణ్యం అలవర్చుకోవడం అంత సులభం కాదు. కానీ, ప్రయత్నిస్తే త ప్పక సాధ్యమవుతుంది. 4. సరళమైన భాష ఇక వ్యాసరూప పరీక్షల్లో మరో ముఖ్యమైన అంశం. సరళమైన, భాషను ఉపయోగించడం. ఆడంబరమైన భాష, గ్రాంధికభాష ఉపయోగించకుండా సరళంగా రాయడం నేర్చుకోవాలి. కొంతమంది అభ్యర్థులు సమాధానాలలో వ్యవహరికం, గ్రాంథికం రెండింటిని కలిపి మిశ్రమ భాషగా రాస్తుంటారు. ఇవి సరైన పద్ధతి కాదు. భాష సహజంగా, చదువుతుంటే ఏ విధమైన ఇబ్బంది కలుగకుండా, ఆహ్లదం కలిగించే విధంగా ఉండాలి. డిస్క్రిప్టివ్ పరీక్షల్లో భాషా నైపుణ్యాలకు కూడా చాలా ప్రాముఖ్యం ఉంటుంది. చెప్పదలుచుకున్న విషయాన్ని చక్కగా సూటిగా, మనసుకు హత్తుకునేటట్లు రాయడం ఒక కళ. కేవలం భావానికి, అర్థానికి ప్రాధాన్యత ఇచ్చి భాషకు ప్రాధాన్యత ఇవ్వకపోతే సమాధానాలు కృతకంగా ఉంటాయి. సమాధానాలు ఎంత సమగ్రంగా ఉన్నా, ఎంత విశ్లేషణతో కూడి ఉన్నా, అవి తెలిపేది భాష ద్వారానే కాబట్టి భాష అందంగా, సరళంగా, సహజంగా ఉండటం తప్పనిసరి. సమగ్రంగా ఉన్న సమాధానా లకు సహజమైన భాషతో పరిపూర్ణత చేకూరుతుంది. 5. సంక్షిప్తీకరించి రాయడం ఇక చివరగా వ్యాసరూప ప్రశ్నల్లో ఉండవలసిన నైపుణ్యం విషయాన్ని సంక్షిప్తంగా రాయడం, గ్రూప్-1, సివిల్స్ వంటి పరీక్షల్లో సమాధానాలకు పదనిబంధన ఉంటుంది. అందువలన అడిగిన ప్రశ్నకు అనుగుణంగా అన్ని అంశాలు కవర్ అయ్యే విధంగా తక్కువ పదాలలో ఎక్కువ అర్థం వచ్చే విధంగా రాయగలగాలి. గ్రూప్-1 మెయిన్స్‌లో ఎస్సే పేపర్ కాకుండా మిగతా పేపర్లలో ప్రతి ప్రశ్నకు కేవలం 12 నిమిషాలలోనే సమాధానం రాయవలసి ఉంటుంది.కాబట్టి ఆ తక్కువ సమయంలోనే ప్రశ్నను అర్థం చేసుకొని ఏం రాయాలో నిర్ణయించుకొని ఆ సమాధానం సమగ్రంగా ఉండేలా చూసుకోవాలి. అంటే తక్కువ సమయంలో, తక్కువ పదాలతో ప్రశ్నకు తగిన సమాధానాన్ని రాసే నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి. ఈ నైపుణ్యం అభివృద్ధి చేసుకుంటే నిర్దిష్ట సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయడం వీలవుతుంది. ఫలితంగా మిగతా వారికంటే ఎక్కువ మార్కులు లభిస్తాయి.ఈ డిస్క్రిప్టివ్ రైటింగ్ స్కిల్స్ అన్నీ ఒక రోజులో నేర్చుకోవడం వీలుకాదు. ఇవి నిరంతర ప్రాక్టీస్ ద్వారానే అలవ డతాయి. అందువలన ముందునుంచే వెూడల్ సమాధానాలు రాయడం అలవాటు చేసుకొని వాటిని నిపుణులకు చూపించి వారి సల హాలు, సూచనలు పాటిస్తే మరింత ప్రయోజనం కలు గుతుంది.

Followers