సేల్ పాఠ్యపుస్తకాల ముద్రణ బాధ్యతలు తెలంగాణ ప్రింటర్స్‌కే

అమ్మకానికి ఉంచే పాఠ్యపుస్తకాల ముద్రణ బాధ్యతలను తెలంగాణ రాష్ర్టానికి చెందిన ముద్రణా సంస్థలకే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆమోదం పొందిన ఫైల్ పాఠశాల విద్యా శాఖకు చేరింది. దీనిపై ఒకటి రెండు రోజులో ఆదేశాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఆ వెంటనే టెండర్ల ద్వారా సేల్ పుస్తకాల ముద్రణ బాధ్యతలు తెలంగాణ వారికే ఇచ్చేలా నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు ఉన్నాయని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ తెలిపారు.

ఆటోమేటిక్ ప్రమోషన్‌పై రాష్ర్టాల అభ్యంతరం


ఎనిమిదో తరగతి వరకు నిర్బంధం లేని విద్యా విధానం పట్ల పలు రాష్ర్టాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ విధానం వల్ల విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని పేర్కొన్నాయి. కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ విద్యా విధానంపై సంప్రదింపుల్లో భాగంగా మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ర్టాలకు చెందిన విద్యా మంత్రులు, కార్యదర్శులు పాల్గొన్నారు. మధ్యప్రదేశ్ విద్యా మంత్రి పరస్‌చందర్ మాట్లాడుతూ, ఆటోమేటిక్ క్లాస్ ప్రమోషన్ వల్ల విద్యార్థులు ఎనిమిదో తరగతి వరకూ ఫెయిర్ కారని, అలాగే ఆ తరువాత పై తరగతికి ప్రమోషన్ కూడా పొందలేరని వివరించారు. ఈ వాదనతో అస్సాం, నాగాలాండ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ర్టాల మంత్రులు ఏకీభవించారు. హర్యానా విద్యామంత్రి గీతా బుక్కల్ నేతృత్వంలోని కమిటీ గత ఏడాది క్లాస్ ప్రమోషన్ల విధానాన్ని సిఫార్సు చేసింది. విద్యా హక్కు చట్టంతోపాటే ఈ వివాదాస్పద విధానం అమలులోకి వచ్చింది. ఈ విధానంలో ప్రతిభతో నిమిత్తం లేకుండా విద్యార్థి ఎనిమిదో తరగతి వరకు ప్రమోట్ అవుతాడు. పాఠశాల పరీక్ష వ్యవస్థను సంస్కరించడం ఈ సంప్రదింపుల్లో ఓ భాగమని పాఠశాల విద్యా శాఖకార్యదర్శి వృందా సరూప్ చెప్పారు.

Followers