బంగ్లాతో మైత్రికి బలమైన సందేశం

ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ప్రత్యేకడెహ్రాడూన్‌: భారత్‌-బంగ్లా భూ సరిహద్దు ఒప్పందం బిల్లు పార్లమెంటు ఉభయసభల్లో ఏకగ్రీవంగా ఆమోదం పొందడం... ఆ దేశంతో భారత్‌ మైత్రికి బలమైన సందేశమని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై దేశమంతా ఏకతాటిపై నిలుస్తుందని ఇది సూచించిందని పేర్కొన్నారు. సోమవారమిక్కడ ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశవ్యాప్తంగా చట్టసభల పనిదినాలు తక్కువగా నమోదవుతుండటంపట్ల ఆందోళన వ్యక్తంచేసిన ఆయన... సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించకూడదంటూ శాసనకర్తలకు సూచించారు. పార్లమెంటు, రాష్ట్ర శాసనవ్యవస్థలు ఏటా 100 రోజుల పనిదినాలను కలిగిఉండాలన్నారు. ప్రజాస్వామ్యంలో 'త్రీడీ': ప్రజాస్వామ్యంలో డిబేట్‌(చర్చ), డిస్సెంట్‌(భిన్నాభిప్రాయం), డెసిషన్‌(నిర్ణయం) అనే మూడు 'డీ'లు ఉండాలని ప్రణబ్‌ పేర్కొన్నారు. డిస్‌రప్షన్‌(అంతరాయం) అనే 'డీ' ఉండకూడదన్నారు. ప్రజలే తమ ప్రభువులన్న విషయాన్ని శాసనకర్తలు గుర్తుంచుకోవాలన్నారు.

బంగ్లాదేశ్‌తో సరిహద్దు ఒప్పందానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర

దిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ఈ వారం బంగ్లాదేశ్‌ పర్యటన చేపట్టనున్న నేపథ్యంలో భారత్‌-బంగ్లాదేశ్‌ భూ సరిహద్దు ఒప్పందం(ఎల్‌.బి.ఎ.)పై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. పొరుగు దేశంతో సంబంధాలు బలపరచుకునేందుకు ఇది ఉపకరిస్తుందని భావిస్తున్నారు. సరిహద్దుల్ని కొంతమేర మార్చుకునేందుకు 1974లోనే ఒప్పందంపై సంతకాలు జరిగాయి. బంగ్లాదేశ్‌ పార్లమెంటు దీనికి వెంటనే ఆమోదం తెలపగా, భారత పార్లమెంటు మాత్రం గత నెలలోనే ఆమోదించింది. ఇది రాజ్యాంగ సవరణ బిల్లు అయినప్పటికీ 50% రాష్ట్రాల శాసనసభలు ఆమోదం తెలపాలనే నిబంధన దీనికి వర్తించదని అధికార వర్గాలు తెలిపాయి. సరిహద్దుల్ని నిర్ణయించుకోవడంతో పాటు భారత్‌ నుంచి బంగ్లాదేశ్‌కు 17,160 ఎకరాల భూమి బదలాయింపునకు ఒప్పందం వీలు కల్పిస్తుంది. బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు 7110 ఎకరాల భూమి లభిస్తుంది.

Followers