9, 10వ తరగతుల్లో తిరిగి 11 పేపర్లకే ప్రభుత్వం మొగ్గు
ఇంటర్నల్స్ నిర్వహణ సహా పలు అంశాలకు మాత్రం గ్రీన్‌సిగ్నల్
హైదరాబాద్: పరీక్షల విధానాన్ని సమూలంగా సంస్కరించబోతున్నాం.. భారీ ఎత్తున
మార్పులు చేయబోతున్నాం.. అంటూ ఊదరగొట్టిన విద్యాశాఖ చివరికి
తుస్సుమనిపించింది. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా. తొమ్మిది, పదో
తరగతుల్లో తిరిగి పాత విధానంలో 11 పేపర్ల నిర్వహణకే మొగ్గుచూపింది. అయితే
ఇంటర్నల్ పరీక్షల నిర్వహణ, సహపాఠ్య కార్యక్రమాలకు మార్కులు, రాత పరీక్షకు
అదనంగా 15 నిమిషాల సమయం కేటాయింపు వంటి పలు సంస్కరణలకు మాత్రం పచ్చజెండా
ఊపింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వికాస్‌రాజ్ మంగళవారం సవరణ
ఉత్తర్వులు (జీవో నం.2) జారీ చేశారు. ఈ సంస్కరణలు ఈ విద్యా సంవత్సరం నుంచే
9, 10వ తరగతుల్లో అమల్లోకి వస్తాయని అందులో పేర్కొన్నారు. దీని ప్రకారం
2015 మార్చి/ఏప్రిల్‌లో జరిగే పరీక్షల్లోనే ఈ సంస్కరణలు అమలుకానున్నాయి.
మార్పు చేసిన సిలబస్, పుస్తకాలకు అనుగుణంగా పరీక్షల విధానంలోనూ భారీ
సంస్కరణలు తెస్తామంటూ ప్రకటనలు చేసిన విద్యాశాఖ అధికారులు.. తొలుత 7 పేపర్ల
విధానాన్ని(సైన్స్‌లో రెండు, మిగతా సబ్జెక్టుల్లో ఒక్కొక్కటి
చొప్పున) ప్రతిపాదించారు. తర్వాత వాటిని తొమ్మిది పేపర్లకు మార్పు చేశారు.
భాషా సబ్జెక్టుల్లో ఒక్కో పేపర్, భాషేతర సబ్జెక్టుల్లో రెండు పేపర్ల
చొప్పున మొత్తం తొమ్మిది పేపర్ల పరీక్షా విధానం అమలుకు మే 14న ప్రభుత్వం
ఉత్తర్వులు (జీవో నం.17) కూడా జారీ చేసింది. రెండు పేపర్లు ఉన్న
సబ్జెక్టుల్లో ప్రతి పేపర్‌లోనూ (కనీసం 14 మార్కులు) పాస్ కావాల్సిందేనని
నిబంధన విధించింది. అంతేకాదు ఇంటర్నల్ పరీక్షలనూ ప్రవేశపెట్టి వాటిలోనూ
పాస్ కావాల్సిందేనని పేర్కొంది. తీరా ఇప్పుడు ప్రధానమైన ఈ మూడు అంశాలను
తొలగిస్తూ. 11 పేపర్ల పాత పరీక్ష విధానానికే మొగ్గు చూపింది. అయితే ఒక
సబ్జెక్టుకు ఉండే రెండు పేపర్లలో కలిపి పాస్ మార్కులు వస్తే చాలని
సరళీకరించింది. దీంతోపాటు విద్యార్థి పాస్/ఫెయిల్ నిర్ధారణలో ఇంటర్నల్
మార్కులను పరిగణనలోకి తీసుకోరు. విద్యార్థి గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్
యావరేజీ నిర్ధారణలో మాత్రం ఈ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు.
అమల్లోకి రానున్న సంస్కరణలు..
9వ, 10వ తరగతుల్లో ఇంటర్నల్స్ విధానం అమల్లోకి వస్తుంది. ప్రతి
సబ్జెక్టులో 80 మార్కులకే రాత పరీక్ష ఉంటుంది. మిగతా 20 మార్కులు ఇంటర్నల్
పరీక్షలు, సహ పాఠ్య కార్యక్రమాలకు ఉంటాయి. రాత పరీక్షలోని 80 మార్కుల్లో 35
శాతం (28 మార్కులు) వస్తే పాస్ అయినట్లే.
హిందీ/ఉర్దూ (ద్వితీయ భాష) మినహా మిగతా సబ్జెక్టులకు ఒక్కో పేపరుకు 40
మార్కుల చొప్పున 80 మార్కులకు రెండు పేపర్లు ఉంటాయి. హిందీ/ఉర్దూకు మాత్రం
ఒకటే పరీక్ష 80 మార్కులకు ఉంటుంది.
జవాబుపత్రాల రీవాల్యుయేషన్ ఉండదు. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ మాత్రమే
ఉంటుంది.
రాత పరీక్షకు ఇచ్చే సమయాన్ని పెంచారు. 2.30 గంటలతో పాటు అదనంగా 15
నిమిషాలు ప్రశ్నపత్రాన్ని చదువుకునేందుకు ఇస్తారు.
ప్రతి సబ్జెక్టులో ఇంటర్నల్స్‌కు 20 మార్కులు ఉన్నా.. వాటిలో పాస్
కావాలన్న నిబంధన ఉండదు. ఇంతకుముందు ప్రతిపాదించినట్లుగా వాటిల్లోనూ 7
మార్కులు రావాలన్న అంశాన్ని తొలగించారు.
ఇంటర్నల్ మార్కులను ప్రధానోపాధ్యాయులు/ప్రిన్సిపాల్‌లు సరిగ్గా ఇచ్చారా?
లేదా? అనేది తనిఖీ చేసేందుకు జిల్లా విద్యా శాఖ అధికారి నేతృత్వంలో
మోడరేషన్ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఇంటర్నల్ మార్కుల జాబితాను ప్రభుత్వ
పరీక్షల విభాగానికి పంపాల్సి ఉంటుంది. ప్రైవేటు పాఠశాలలైతే కరస్పాండెంట్
సంతకంతో పంపించాలి. వాటిలో తేడాలు ఉంటే పాఠశాల గుర్తింపును రద్దుచేస్తారు.
రెగ్యులర్‌గా పాఠశాలల్లో చదువుకోని వారు ప్రైవేటు విద్యార్థులుగా పరీక్ష
రాయడానికి ఇక వీలు లేదు. అలాంటివారు నేషనల్/రాష్ట్ర ఓపెన్ స్కూల్ వంటి
ప్రత్యామ్నాయ మార్గాల్లోనే పదో తరగతి పరీక్షలు రాసుకోవాలి.
కాంపోజిట్ కోర్సులో ఇప్పుడు నాలుగు భాషలు చదువుతున్నారు. త్రిభాషా
సిద్ధాంతం ప్రకారం ఇకపై మూడు భాషలే చదవాలి. ఇందులో తెలుగు, సంస్కృతంకు
80+20 మార్కులు ఉంటాయి.
తెలంగాణ జిల్లాల్లో 6వ తరగతిలో చేరే ఇతర రాష్ట్రాల విద్యార్థులు తెలుగును
లేదా హిందీని ద్వితీయ భాషగా ఎంచుకోవాలి. గతంలో ద్వితీయ భాషగా ఉన్న
ఇంగ్లిష్‌ను తొలగించారు. 7వ తరగతిలో వారికి ద్వితీయ భాష నుంచి మినహాయింపు
ఉంటుంది.
ఓరియంటల్ ఎస్సెస్సీలో తెలుగు/ఉర్దూకు ఉన్న 80 మార్కులను 100 మార్కులకు పెం
చారు. 200 మార్కులకు నిర్వహించే ఓరి యంటల్ సబ్జెక్టుల్లో మరో రెండు
పేపర్లలో 100 మార్కులకు ఒక పేపరు ఉంటుంది. వాటిల్లో రాతపరీక్షకు 80
మార్కులు, 20 మార్కులు ఇంటర్నల్స్‌కు ఉంటాయి.
ఇదీ పేపర్లు, మార్కుల విధానం..
సబ్జెక్టు పేపర్-1 పేపర్-2 ఇంటర్నల్స్ మొత్తం
ప్రథమ భాష (తెలుగు/హిందీ/ఉర్దూ) 40 40 20 100
ద్వితీయ భాష(హిందీ/ఉర్దూ) 80 0 20 100
తృతీయ భాష (ఇంగ్లిష్) 40 40 20 100
గణితం 40 40 20 100
సైన్స్ 40 40 (జీవశాస్త్రం) 20 100
సోషల్ 40 40 20 100
మొత్తం 280 200 120 600
కొత్త గ్రేడింగ్ విధానం
గ్రేడ్ మార్కులు జీపీఏ(శాతంలో)
ఎ1 91-100 10
ఎ2 81-90 9
బి1 71- 80 8
బి2 61- 70 7
సి1 51- 60 6
సి2 41-50 5
డి 35- 40 4
ఇ 0 - 34 3