శ్రీలంక తెరపై తమిళ కూటమి

శ్రీలంకలో మైనార్టీ తమిళులకు ప్రాతినిధ్యం వహిస్తున్న మూడు తమిళ రాజకీయ పార్టీలు కొత్త రాజకీయ కూటమిగా ఏర్పడాలని నిర్ణయించాయి. ఇప్పటి వరకూ తమిళులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాన పార్టీ 'తమిళ జాతీయ కూటమి' దేశ ఉత్తర, ఈశాన్య ప్రాంతాలలో వున్న తమిళులకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నదని పశ్చిమ ప్రావిన్స్‌లోని తమిళులకు చెందిన మైనార్టీ పార్టీ డెమొక్రాటిక్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ నేత మనో గణేశన్‌ అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కూటమిలో భాగస్వాములు కాబోతున్న మరో రెండు పార్టీలు సెంట్రల్‌ హిల్‌ ప్లాంటేషన్స్‌ ప్రాంతానికి చెందినవని వివరించారు. తమిళులు కేవలం ఉత్తర ఈశాన్య ప్రాంతాల్లో మాత్రమే కాక పశ్చిమ, వాయవ్య, మధ్య, నైరుతి రాష్ట్రాల్లోనూ నివశిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ ప్రాంత తమిళులకు టిఎన్‌ఎ ప్రాతినిధ్యం వహించటం లేదని అందువల్లే ఆయా ప్రాంతాలకు చెందిన తమిళ పార్టీలు నేషనల్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కర్స్‌ (ఎన్‌యుడబ్ల్యు), కంట్రీస్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ (యుసిపిఎఫ్‌)లతో కలిసి కూటమి ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు. భారత సంతతి తమిళులన్న మాటను నిలిపివేయాలని వారు కేవలం తమిళులు మాత్రమేనని
వారికి భారత సంతతి అన్న తోక ఎందుకని ఆయన ప్రశ్నించారు. త్వరలో పార్లమెంట్‌ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ కొత్త తమిళ కూటమి అధికార యుఎన్‌పికి చెందిన ప్రధాని రణిల్‌ విక్రమిసంఘేకు కీలకం కానున్నది. గణేశన్‌ దీర్ఘకాలంగా యుఎన్‌పి మిత్రుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Followers