నల్లగొండ : జిల్లా కేంద్రానికి చెందిన ఏజాజ్ అనే ఉపాధ్యాయుడికి ఇటీవల ఓ
ఫోన్ కాల్ వచ్చింది. బ్యాంక్ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామనడంతో
ఎజాజ్ ... సార్ చెప్పండి అని గౌరవంగా మాట్లాడాడు. మీ ఖాతాకు సంబంధించి
కొన్ని వివరాలు కావాలని చెప్పి మీ ఏటీఎం బ్లాక్ అయింది. ఏటీఎం వెనుక ఉన్న
నెంబర్, ఆధార్ నెంబర్ చెప్తే క్రమ బద్దీకరిస్తామని వాటి వివరాలు కావాలని
చెప్పడంతో ఎజాజ్ నమ్మాడు. వెనుక, ముందు ఆలోచించకుండా అడిగిన
వివరాలన్నింటిని ఇచ్చాడు. ఏటీఎం వెనుక నెంబర్, పిన్ నెంబర్, ఆధార్ నెంబర్
ఇలా అడిగిన సమాచారం అంతా వారికి చెప్పాడు. ఫోన్ పెట్టేసిన క్షణాల్లో తన
ఖాతాల్లో రూ.30వేలు డ్రా అయినట్లు ఎస్‌ఎంఎస్ వచ్చింది. వెంటనే తేరుకున్న
ఎజాజ్ తనకు వచ్చిన ఫోన్ నెంబర్‌కు ఫోన్ చేసి నా ఖాతాలోంచి డబ్బులు డ్రా
అయ్యాయి అని వారిని నిలదీశాడు. దాంతో వారు మీ డబ్బులు ఎక్కడకు పోవు మళ్లీ
మీ ఖాతాలో జమ అవుతాయంటూ ఎదుటి వ్యక్తి ఫోన్ పెట్టేశాడు. తిరిగి మళ్లీ ఫోన్
చేస్తే ఫోన్ కలువదు. ఖాతాలో డబ్బులు జమ గాకపోవడంతో తాను మోసపోయాయని, తనలాగా
మరెవ్వరూ మోసపోకుండా నిందితులను పట్టుకోవాలని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి
ఫిర్యాదు చేశాడు. ఓ ఉదహరణ
ఇదీ.
సాంకేతికత దుర్వినియోగం
అంది వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని నేరగాళ్లు తమకు అనుగుణంగా
మలుచుకుంటున్నారు. బ్యాంకుల ఖాతాల వివరాలను తెలుసుకుని ఖాతాదారుల ఫోన్
నెంబర్లను సేకరించి వారికి ఫోన్లు చేసి బుట్టల్లో వేసుకుంటున్నారు. ఇతర
రాష్ర్టాల నుంచి ఫోన్ చేసి మరీ బ్యాంక్ ఖాతాలు, ఏటీఎం కార్డు నెంబర్లు,
ఆధార్ కార్డుల నెంబర్ల వివరాలు తెలుసుకుని ఖాతాలను తెరిచి అందులో నుంచి
డబ్బులను డ్రా చేసుకుంటున్నారు. సాంకేతికంగా పరిణతి సాధించిన వారే ఈ
పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని ఫోన్ నెంబర్ల ద్వారా వచ్చే
ఫోన్ కాల్స్ అడిగిన సమాచారాన్ని అమాయకంగా ఇవ్వడం తప్పు. చాలా మంది బ్యాంక్
ఖాతాలు అందుబాటు లో ఉన్న బ్యాంక్‌లోనే తీసుకుంటారు. బ్యాంక్ నుంచి ఫోన్
చేస్తున్నామని ఎవ్వరైనా మాట్లాడితే బ్యాంక్‌కు వెళ్లి వచ్చిన కాల్ నిజమా?
కాదా? అని తెలుసుకోవాల్సిన బాధ్యత ఖాతాదారులపై ఉంటుంది. ఎక్కడా కూడా
ఖాతాదారులకు సంబంధించిన బ్యాంక్ సమాచారాన్ని బ్యాంక్ సిబ్బంది ఫోన్ చేసి
అడిగే పరిస్థితి ఉండదు. ఒక వేళ అడిగినా బ్యాంక్‌కు వెళ్లి సమచారం ఇచ్చే
ప్రయత్నం చేయాలి. ఫోన్‌లో ఇవ్వకూడదు.
ఏటీఎంల్లో మోసాలు...
డబ్బులు అవసరం ఉండి ఏటీఎం కేంద్రానికి వెళ్లిన వారు తమ ముందు, వెనుక ఎవరైనా
తమను గమనిస్తున్నారో? లేదో? అని పట్టించుకోకుండా ఏటీఎంలో డబ్బులు డ్రా
చేస్తారు. డబ్బులు డ్రా చేసే సమయంలో తమ ఏటీఎం కార్డును పెట్టి అందరూ
చూస్తుండగానే పిన్ నెంబర్ నొక్కుతారు. ఏటీఎం నుంచి వచ్చిన డబ్బులను కౌంట్
చేసే పనిలో తమ ఏటీఎంను పట్టించుకోరు. దీనిని గమనించిన నేరస్తులు ఇట్టే
మార్చేస్తారు. ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకుని వెళ్లిన వ్యక్తి తన పని
అయిపోగానే ఏటీఎం సంగతిని మర్చిపోతాడు. ఎస్‌ఎంఎస్ అలర్ట్ వసతి ఉన్న
ఖాతాదారులు తమ ఖాతా నుంచి డబ్బులు డ్రా అయినట్లు తెలుసుకుని లబోదిబో
మంటారు. కొందరు ఎస్‌ఎంఎస్ అలర్ట్‌ఉన్న దాని గురించి అవగాహన లేకపోవడం,
ఎస్‌ఎంఎస్ లేని వారు డబ్బులు జమచేయడమే తప్ప డబ్బులు ఖాతాలో ఉన్నాయో? లేదో?
తెలుసుకోలేని వారు చాలా మంది మోసపోతూనే ఉన్నారు.
ఫోన్‌కాల్స్‌ను నమ్మొద్దు- రాములు నాయక్, డీఎస్పీ, నల్లగొండ
బ్యాంక్ పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వచ్చిన
ఫోన్‌కాల్ బ్యాంకు దా? లేదా? అనేది తెలుసుకోవాలి. అవసరమైతే బ్యాం క్‌కు
వెళ్లి ఫోన్ కాల్ గురించి అడగాలే తప్పా వివరాలను చెప్పి మోసపోవద్దు. గుర్తు
తెలియని నెంబర్ల నుంచి కాల్స్ వస్తే పోలీసులను సంప్రదించాలి.
బ్యాంకు ప్రతినిధినంటూ ఫోన్ చేస్తే అప్రమత్తంగా ఉండాలి : సీఐ
కోదాడ, : పలు బ్యాంకుల నుంచి అకౌంట్ నెంబర్లు, ఏటీఎం పిన్ నెంబర్ల కోసం
ప్రతినిధినంటూ ఫోన్ చేస్తే ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని కోదాడ పట్టణ సీఐ
ఎం.శ్రీధర్‌రెడ్డి కోరారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
మాట్లాడారు. బ్యాంకు వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించవద్దన్నారు.
ఏటీఎం పిన్‌ను రహస్యంగా భద్రపర్చుకోవాలన్నారు. ఒకవేళ ఎవరైనా ఫోన్ చేస్తే
వెంటనే నేరుగా బ్యాం కుకు ఫోన్‌చేసి సంప్రదించాలన్నారు. అపరిచిత వ్యక్తులు
పంపే ఎస్‌ఎంఎస్‌లకు స్పందించవద్దని సూచించారు.